ఆ తర్వాతే మహేష్‌తో సినిమా

‘మనసుకు నచ్చింది చేయడమే.. నా దృష్టిలో నిజమైన సక్సెస్‌. ఇన్నేళ్ల సినీ ప్రయాణంలో నేను చేసింది తక్కువ చిత్రాలే అయినా.. ప్రతిదీ మనసుకు నచ్చిందే చేశానన్న సంతృప్తి ఉంద’’న్నారు మంజుల ఘట్టమనేని. నటుడు కృష్ణ నటవారసురాలిగా వెండితెరపైకి అడుగు పెట్టిన ఆమె..విలక్షణమైన నటిగా, అభిరుచి గల దర్శక నిర్మాతగా ప్రేక్షకుల మదిలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నారు. ఆదివారం ఆమె పుట్టినరోజు. ఈ నేపథ్యంలో శనివారం మీడియాతో ముచ్చటించారు మంజుల. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..


అందుకే విరామం..

ఒక సినిమా పూర్తికాగానే మరొకటి అంటూ ఉరుకులు పరుగులుగా చేయడం నాకు నచ్చదు. ఏ స్క్రిప్ట్‌ ఎంచుకున్నా.. అది నాలో, ప్రేక్షకుల్లో ఉత్సుకతను రేకెత్తించేలా ఉండాలి. ‘ఆరెంజ్‌’, ‘సేవకుడు’ చిత్రాల తర్వాత 8ఏళ్లు తెరకు దూరంగా ఉండటం అన్నది, వ్యక్తిగతంగా నేను తీసుకున్న నిర్ణయమే. ఈ విరామంలో ఓ అమ్మగా మాతృత్వంలోని మాధుర్యాన్ని తనివితీరా ఆస్వాదించా. ఎందుకంటే పిల్లలు పెద్దయ్యాక మనతో ఉండేది తక్కువ. అప్పుడీ ఆనందాల్ని మళ్లీ పొందలేం.

దర్శకత్వమే నా తొలి కల..

నేను చిన్నప్పటి నుంచి దర్శకురాలు అవ్వాలనే కలలు కనే దాన్ని. అది చాలా బరువైన బాధ్యత. ఓ కథను భావోద్వేగభరితంగా తెరపై ఆవిష్కరించడానికి ఎంతో అనుభవం ఉండాలి. అందుకే ముందు నటిగా.. తర్వాత నిర్మాతగా అన్ని విషయాలపై పట్టు సంపాదించే ప్రయత్నం చేశా. నేను తియ్యగలను నమ్మకం ఏర్పడ్డాకే.. దర్శకురాలిగా తెరపైకి అడుగుపెట్టా.

మహేష్‌తో అప్పుడే..


నా దర్శకత్వంలో మహేష్‌తో కచ్చితంగా సినిమా చేస్తా. దీనికన్నా ముందు దర్శకురాలిగా నన్ను నిరూపించుకోవాల్సి ఉంది. ఎంత సోదరుడైనా.. ఓ విజయంతో నిరూపించుకొని తన ముందుకెళ్లడం నా బాధ్యత. ఎందుకంటే తనొక సూపర్‌స్టార్‌. తన నుంచి ఓ చిత్రం వస్తుందంటే అభిమానుల్లో చాలా అంచనాలుంటాయి. నిజానికి ‘మనసుకు నచ్చింది’ చిత్రం హిట్‌ కొట్టి ఉంటే.. నా దారి మరోలా ఉండేది.

స్పెషల్‌ సర్‌ప్రైజ్‌

నా అనుభవాలన్నింటినీ సమాజానికి ఏదోక విధంగా ఉపయోగపడేలా మార్చాలనుకున్నా. ఇటీవల మంజుల ఘట్టమనేని పేరుతో ఓ బ్లాగ్‌, వెల్‌నెస్‌కు సంబంధించి ఓ యూట్యూబ్‌ ఛానెల్‌ ప్రారంభించా. హెల్త్‌, మైండ్‌, స్పిరిట్‌.. ఈ మూడింటిపై దృష్టి సారించే అంశాలుంటాయి. దీనికోసం మహేష్‌తో ఓ స్పెషల్‌ ఇంటర్వ్యూ చేశా. ఓ స్టార్‌గా మహేష్‌ తన అందం, ఆరోగ్యం గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడో ఈ ఇంటర్వ్యూ ద్వారా అందరికీ తెలియజేయబోతున్నా. దీన్ని ఈరోజు నా యూట్యూబ్‌ ఛానెల్‌లో రిలీజ్‌ చేస్తున్నా.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.