అలాంటి సినిమాలకు మనుగడ ఉండదు...
ఈరోజుల్లో’లాంటి చిన్న సినిమాతో చిత్రసీమని తనవైపుకు తిప్పుకున్న దర్శకుడు మారుతి. ‘భలే భలే మగాడివోయ్‌’, ‘మహానుభావుడు’లాంటి వినోదాత్మక చిత్రాల్ని అందించి, తనకంటూ ఓ స్థానం దక్కించుకున్నారు. అటు నిర్మాతగానూ మారి కొత్తవాళ్లకు అవకాశాలిచ్చారు. ప్రస్తుతం సాయిధరమ్‌ తేజ్‌తో ‘ప్రతీరోజూ పండగే’ చేసుకుంటున్నారు. మంగళవారం మారుతి పుట్టిన రోజు. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చటించారు.


*
‘ఈ రోజుల్లో’ నాటికి ఒక్క సినిమా తీసి, దర్శకుడిగా నిరూపించుకోవాలనేదే నా లక్ష్యం. అది తీరిపోయింది. ఆ తరవాత నాకొచ్చిన అవకాశాలన్నీంటినీ సద్వినియోగపరచుకుంటూ ముందుకు వెళ్తున్నాను. ఏ కథానాయకుడితో సినిమా చేసినా.. ‘ది బెస్ట్‌’ ఇవ్వాలని తపిస్తుంటాను. ‘భలే భలే మగాడివోయ్‌’, ‘మహానుభావుడు’ చిత్రాలు నాకు సంతృప్తినిచ్చాయి. ‘బాబు బంగారం’, ‘శైలజారెడ్డి అల్లుడు’ కూడా ఇష్టపడి తీసినవే. అయితే.. అంతగా ప్రజాదరణకు నోచుకోలేదు’’.

*
‘‘చాలా కాలం తరవాత నా మనసుకు నచ్చిన కథతో ‘ప్రతిరోజూ పండగే’ చేస్తున్నాను. మొదట్లో నేను సమాజంలోని విషయాలనే కథా వస్తువులుగా చేసుకునేవాడ్ని. ఆ తరవాత మనిషిలోని లోపాల్ని వినోదాత్మకంగా మలచి సినిమాలు చేశాను. ఈసారి మళ్లీ మూలాల్లోకి వెళ్లి కథ రాసుకున్నాను. మనిషి పుట్టినప్పుడు ఓ పండగలా చేసుకుంటాం. అదే చనిపోయిన రోజు పండగలా ఎందుకు చేసుకోకూడదు? అనే విషయం చుట్టూ ఈ కథ నడుస్తుంది. ఇప్పటికి 80 శాతం షూటింగ్‌ పూర్తయింది. డిసెంబరు నాటికి సినిమా సిద్ధం అవుతుంది’’.

*
‘‘ఈ రోజుల్లో కొన్ని చిన్న చిత్రాలు బూతుని నమ్ముకుంటున్నాయి. అలాంటి సినిమాలకు మనుగడ ఉండదు. ‘బ్రోచేవారెవరురా’, ‘ఏజెంట్‌ సాయిశ్రీనివాస ఆత్రేయ’ కథని నమ్ముకుని వచ్చిన చిత్రాలు. సినిమాలు ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌లలో ఉచితంగా దొరికేస్తున్నాయి. ఇలాంటప్పుడు జనాల్ని థియేటర్లకు రప్పించడం చాలా కష్టం. సినిమాలో దమ్ముండాలి. లేదంటే స్టార్‌ వాల్యూ ఉండాలి’’.

*
‘‘రామ్‌చరణ్, అల్లుఅర్జున్‌లాంటి కథానాయకులతో సినిమాలు చేయాలని నాకూ ఉంది. వాళ్లిద్దరితోనూ నేను టచ్‌లోనే ఉంటాను. ఆ స్నేహాన్ని వాడుకుని సినిమాలు చేయడం నాకు ఇష్టం లేదు. వాళ్లకు తగిన కథ దొరికితే... తప్పకుండా వాళ్ల దగ్గరికే వెళ్తా. ‘మారుతి టాకీస్‌’తో చిన్న చిత్రాలు చేయకూడదని నిర్ణయించుకున్నా. మరో పెద్ద సంస్థతో కలసి భాగస్వామ్య పద్ధతిలో సినిమాలు చేస్తాను. ‘మహానుభావుడు’ హిందీలో చేయమని అడుగుతున్నారు. అన్నీ కుదిరితే ఆ చిత్రానికి నేనే దర్శకత్వం వహిస్తా’’.
మారుతీ,భలే భలే మగాడివోయ్,బాబు బంగారం,శైలాజారెడ్డి అల్లుడు,మహానుభావుడు,ప్రతి రోజూ పండుగేCopyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.