కొత్త కొత్త సవాళ్లని ఎలా అధిగమించాలో నేర్చుకున్నా

మారుతి... తొలి అడుగుల్లోనే భలే దర్శకుడు అనిపించుకున్నాడు. చిన్న సినిమాలతో ఓ కొత్త ట్రెండ్‌ని తీసుకొచ్చారు. ఒకొక్క సినిమాకీ తన స్థాయిని పెంచుకుంటూ వెళ్లారు. గతేడాది ‘ప్రతిరోజూ పండగే’తో ఘన విజయాన్ని అందుకున్న ఆయన, కొత్త చిత్రాన్ని పట్టాలెక్కించే ప్రయత్నంలో ఉన్నారు. గురువారం మారుతి పుట్టినరోజు ఈ సందర్భంగా పంచుకున్న ఆసక్తికర విశేషాలు..

ఈ పుట్టిన రోజుకి కొత్త సినిమాని ప్రకటించనున్నారా?

మారుతి: నిర్మాతలకైతే కథ చెప్పా. త్వరలోనే ప్రకటన ఉంటుంది. డిసెంబరు నుంచి చిత్రీకరణ మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నా. ఒక స్టార్‌ కథానాయకుడితోనే నా తదుపరి సినిమా ఉంటుంది.

మీరు చేసిన ‘ప్రతి రోజూ పండగే’ గతేడాది డిసెంబర్‌లో విడుదలైంది. దాదాపుగా ఏడాది విరామం వచ్చింది కదా?

మారుతి: కరోనా లేకపోతే మార్చిలోనే సినిమాని మొదలు పెట్టేవాళ్లం. 2020 అందరి జీవితాల్నీ ప్రభావితం చేసింది. ఈ విరామంలో మూడు నాలుగు కథలు రాసుకున్నా. కుటుంబంతో గడపడం, రాసుకోవడం కొన్నాళ్లుగా ఇదే నా దినచర్య. వచ్చే యేడాది మాత్రం బిజీ బిజీగా గడపబోతున్నా. వచ్చే పుట్టినరోజు లోపు రెండు సినిమాలు విడుదల చేస్తా.

కరోనావల్ల ఇక నుంచి చిత్రీకరణల్లో మరిన్ని సవాళ్లు ఎదురవుతుంటాయి. అందుకు సిద్ధమవుతున్నారా?

మారుతి: ఇక నుంచి సెట్లో పరిస్థితులైతే ఇదివరకటిలా ఉండవు. అయితే నాకు సవాళ్లు కొత్త కాదు. ‘ఈరోజుల్లో’, ‘బస్‌స్టాప్‌’, ‘ప్రేమకథా చిత్రమ్‌’ సినిమాల సమయం నుంచే కొత్త కొత్త సవాళ్లని ఎలా అధిగమించాలో నేర్చుకున్నా. డబ్బున్నా, లేకపోయినా అనుకున్న కథని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవడం అలవాటు చేసుకున్నా.

పరిమిత వ్యయంతో సినిమాలు చేశారు. అగ్ర తారలతో చేస్తున్నారు. మీపై అంచనాల ప్రభావం ఎంత?

మారుతి: నేను మంచి సినిమాలు చేస్తాను, మీరు అంచనాలు పెంచుకోండని నేనే నా సినిమాలతో సంకేతాలు ఇచ్చాను. కాబట్టి నాపైన ఇంకా బాధ్యత పెరుగుతుంది. దాన్ని నిలుపుకోవడమే నా ప్రయత్నం. ప్రముఖ హీరోలతో సినిమాలు చేయడం, వాళ్ల అభిమానుల్ని దృష్టిలో ఉంచుకుని సినిమా చేస్తూ అందరినీ మెప్పించడం ఆషామాషీ కాదు. కానీ అందులో విజయవంతమైతే ఇంకా ఎక్కువమంది ప్రేక్షకులకు నా సినిమా చేరువవుతుంది. అంచనాల్ని కూడా ఆస్వాదిస్తూ పనిచేస్తుంటా.

ఓటీటీల్లో వస్తున్న కథల్ని గమనిస్తున్నారా? మీరు ఓటీటీ కోసం ఓ కథ సిద్ధం చేశారట ?

మారుతి: ఆహా కోసం ఓ కథ సిద్ధం చేశాను. దాన్ని త్వరలోనే నిర్మాత అల్లు అరవింద్‌ ప్రకటిస్తారు. ఓటీటీల్లో కథల్ని గమనిస్తున్నా. ఎక్కువగా థ్రిల్లర్‌ జోనర్‌లోనే సినిమాలు చేశారు. నా శైలి వినోదంతో కూడిన కథలు కూడా వస్తే బాగుంటుందనిపించింది. ఓటీటీ కారణంగా కొత్త ప్రతిభతోపాటు, కొత్త కథలు, కొత్త రకమైన వినోదం వెలుగులోకి వచ్చింది.

‘‘అల్లు అర్జున్‌ నా ఎదుగుదలని అతి సమీపం నుంచి చూసిన వ్యక్తి. మేమిద్దరం ఎప్పట్నుంచో మంచి స్నేహితులం. తనతో నా కథలే కాదు, అన్ని విషయాల్ని పంచుకుంటుంటా. ఈమధ్యే తను నా కార్యాలయానికి వచ్చాడు. ‘చాలా ప్రశాంతంగా ఉంది’ అంటూ మెచ్చుకున్నారు. మారుతి మార్క్‌ కామెడీ అనే మాట విన్నప్పుడు సంతృప్తినిస్తుంది. ‘భలే భలే మగాడివోయ్‌’కి సీక్వెల్‌ చేయాలనే ఆలోచన అప్పట్లో వచ్చింది. కానీ, చేస్తే ఏదైనా కొత్తగా చేయడమే మేలనే భావనే నన్ను మళ్లీ ఆ కథ గురించి ఆలోచించనీయలేదు’’.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.