నటనలో నాన్న.. డ్యాన్స్‌లో అమ్మ
‘చిన్నోడిని హీరో చేయాలి.. పెద్దోడిని దర్శకుడిగా చూడాలి అని నాన్న ఎప్పుడూ చెబుతుండే వారు. ఇప్పుడాయన కోరిక ప్రకారమే నేను కథానాయకుడిగా మీ ముందుకొస్తున్నా’’ అన్నారు దివంగత నటుడు శ్రీహరి కుమారుడు మేఘాంశ్‌. ‘రాజ్‌దూత్‌’తో కథానాయకుడిగా వెండితెరకు పరిచయమవుతున్నారు. అర్జున్‌ గున్నా - కార్తిక్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జులై 12న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు మేఘాంశ్‌.


*
‘‘రాజ్‌దూత్‌ అనే బైక్‌.. అందులోని వజ్రాల చుట్టూ అల్లుకున్న కథ ఇది. ఆ బైక్‌ను వెతికి పట్టుకోవడం కోసమే నేను ప్రయత్నిస్తుంటాను. రోడ్డు ప్రయాణ నేపథ్యంలో సాగుతుంటుంది. రెండు మూడు రకాల జోనర్లతో మిళితమైన కథ. నాపై ఎలాంటి ఒత్తిడి పడకుండా ఉండాలనే టీజర్‌ విడుదలయ్యే వరకు నా ఎంట్రీ గురించి ఎక్కడా బయటపడనీయలేదు. చిత్రీకరణకు అమ్మ వచ్చినా కంగారు పడేవాడ్ని. తొలిసారి కెమెరా ముందు నిలబడినప్పుడు కాస్త భయం అనిపించింది. క్రమంగా అలవాటు పడ్డా. కొత్తవాళ్లమైనా సినిమా కోసం బాగా కష్టపడ్డాం. 45 డిగ్రీల ఎండల్లో చిత్రీకరణ జరిపాం. ఇందులోని మా అల్లరితనం, కథలోని సహజత్వం, పాటలు అన్ని ఆకట్టుకుంటాయి’’.

* ‘‘నటుడు తేజ వద్ద కొన్ని రోజులు శిక్షణ తీసుకున్నా. ఆయన ‘బాహుబలి’లో దుబాసీగా నటించారు. నా నటన విషయంలో అమ్మ - అన్నయ్య సలహాలు ఎంతో ఉపయోగపడ్డాయి. ఈ సినిమాను అర్జున్‌ - కార్తిక్‌ ఎంతో చక్కగా తెరకెక్కించారు. వీరిద్దరూ గతంలో సుధీర్‌ వర్మ చిత్రాలకు రచయితలుగా చేశారు. చిత్రీకరణ మొత్తం హైదరాబాద్, రాజమండ్రి, రంపచోడవరం పరిసర ప్రాంతాల్లోనే జరిగింది’’.

* ‘‘నేను బీబీఎమ్‌ చదివా. నటనపై చిన్నప్పటి నుంచే నాకు ఆసక్తి ఉండేది. స్కూల్‌ రోజుల నుంచే నాటకాలు, డ్రామాల్లో చురుగ్గా పాల్గొనేవాడిని. ‘అందరితో మంచిగా ఉండండి. ప్రతి ఒక్కరినీ సమానంగా చూడండి. సాయానికి ముందుండండి’ అని నాన్న చెబుతుండేవారు. నటనలో నాకు ఆయనే స్ఫూర్తి. డ్యాన్స్‌లో అమ్మ. రియల్‌ స్టార్‌ అన్న పదం నాకంటే అన్నయ్యకే ఎక్కువ సరిపొతుంది. ప్రస్తుతం దర్శకత్వ శిక్షణలో ఉన్నాడు. కథలు సిద్ధం చేసుకోవడానికి మరో నాలుగేళ్ల సమయం పడుతుంది’’.

* ‘‘నాన్న చనిపోయాక మేమంతా చిత్ర పరిశ్రమకు దూరమయ్యాం. నా టీజర్‌ విడుదలయ్యాక సాయిధరమ్‌ తేజ్, శ్రీను వైట్ల, మంచు మనోజ్‌ అన్న.. ఇలా ప్రతి ఒక్కరూ అభినందించారు. నాన్న ఉండుంటే నా ఎంట్రీ మరో రకంగా ఉండేది. ప్రతిదాన్ని ఆయనే దగ్గరుండి చూసుకునేవారు’’.


- మందలపర్తి రాజేశ్‌ శర్మ, ఈనాడు డిజిటల్‌


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.