టీ షర్ట్‌ బావుందనగానే.. ప్రభాస్‌ గిఫ్ట్‌ ఇచ్చాడు
విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు మురళీ శర్మ. తండ్రిగా, పోలీస్‌గా, ప్రతినాయకుడిగా.. ఇలా ఏ పాత్ర ఇచ్చినా అందులో చక్కగా ఇమిడిపోతారు. ‘సాహో’లోనూ ఓ మంచి పాత్ర దక్కింది. ప్రభాస్‌ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. సుజిత్‌ దర్శకుడు. యూవీ క్రియేషన్స్‌ నిర్మించింది. ఈ చిత్రం విడుదల సందర్భంగా ముచ్చటించారు మురళీ శర్మ.


‘‘బాహుబలి’తో ప్రభాస్‌ చాలా ఎత్తుకు ఎదిగిపోయాడు. అందరిలానే నేను కూడా ‘సాహో’ విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. అలాంటిది తన సినిమాలో నాకో మంచి పాత్ర దక్కింది. ట్రైలర్‌లో నేను చెప్పిన సంభాషణకు మంచి స్పందన లభిస్తోంది’’.

* ‘‘భాగమతి’ చిత్రీకరణ సమయంలో సుజిత్‌ నన్ను కలిసి ఈ కథ చెప్పాడు. కథలో మలుపులు ఆసక్తిని రేకెత్తిస్తాయి. తను ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విధానం అందరికీ నచ్చుతుంది. యూవీ క్రియేషన్స్‌ అంటే నా మాతృ సంస్థ లాంటిది. అంతర్జాతీయ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో నేనే డబ్బింగ్‌ చెప్పుకున్నాను. ఒకేసారి నాలుగు భాషల్లో నటించడం, అన్నిట్లోనూ నా గొంతే వినిపించడం మంచి అనుభవం’’.

* ‘‘ప్రభాస్‌ని అందరూ డార్లింగ్‌ అని ఎందుకు పిలుస్తారో ఈ సినిమాతో నాకు తెలిసింది. ఓరోజు ప్రభాస్‌ టీ షర్టు వేసుకొచ్చాడు. ‘ఈ టీ షర్టు భలే ఉంది’ అన్నాను. సాయంత్రానికల్లా అలాంటిదే మరో టీషర్టు నాకు బహుమతిగా పంపాడు. ‘ఇంటి భోజనం అంటే నాకు చాలా ఇష్టం’ అని చెప్పాను. అప్పటి నుంచీ ఈ సినిమా అయిపోయేంత వరకూ ప్రభాస్‌ ఇంటి నుంచే నాకు భోజనం వచ్చేది. పదిమందికి సరిపడేంత పెద్ద క్యారియర్‌ నాకు పంపేవారు. ప్రభాస్‌ ఇంటి గుత్తొంకాయ కూర అదుర్స్‌. ఆ రుచి ఇంకెక్కడా రాదు’’.

* ‘‘భలే భలే మగాడివోయ్‌’ నుంచి నా కెరీర్‌ మారిపోయింది. మంచి తండ్రి పాత్రలు వస్తున్నాయి. నటుడిగా అన్ని రకాల పాత్రలూ చేయాలని ఉంది. సెట్‌లో ఎలాంటి తడబాటూ లేకుండా నటించడానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే ఉంటాను. ఇది వరకు నాకు తెలుగు వచ్చేది కాదు. క్రమంగా తెలుగు నేర్చుకుని, తెలుగులోనే మాట్లాడడం మొదలెట్టా. తమిళం, హిందీ వచ్చు. మలయాళం కూడా నేర్చుకుంటున్నా. ఓ స్నేహితుడి వల్ల పంజాబీ కొంచెం కొంచెం నేర్చుకున్నా’’.

* ‘‘ప్రస్తుతం మహేష్‌బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో నటిస్తున్నా. త్రివిక్రమ్‌ ‘అల.. వైకుంఠపురములో’ కూడా చేస్తున్నా. తెలుగు ప్రేక్షకులు, ఇక్కడి దర్శక నిర్మాతలు నన్ను ఆదరిస్తున్న తీరు ఎప్పటికీ మర్చిపోలేను. ఇప్పటి వరకూ కెరీర్‌ సంతృప్తికరంగా గడిచింది. ఇక మీదటా ఇలాంటి మంచి పాత్రలతో అలరించాలనుంది’’.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.