నా పెళ్లి కూడా ఇలాగే జరగాలి!
రాశిఖన్నా అంటే అందమే కాదు... మంచి అభనయం కూడా! ఆ విషయాన్ని ఆమె ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతోనే చాటి చెప్పింది. కానీ ఆ తర్వాత ఆ స్థాయి సినిమాలు చేసే అవకాశం రాకపోవడంతో ఆమె ప్రతిభ పూర్తిగా వెలుగులోకి రాలేదు. అయితే ‘తొలిప్రేమ’తో మళ్లీ తనలో ఎంత మంచి నటి ఉందో చాటి చెప్పింది. ఇటీవలే నితిన్‌తో ‘శ్రీనివాసకళ్యాణం’లో నటించింది. సతీష్‌ వేగేశ్న దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మించిన ఆ చిత్రం ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా రాశిఖన్నా సోమవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించింది. ఆ విషయాలివీ...సినిమాలో మిమ్మల్ని మీరు చూసుకొన్నాక ఏమనిపించింది?
కథ వినేటప్పుడే ఓ మంచి సినిమా చేస్తున్నానని నాకు తెలుసు. సినిమా చూసుకొన్నాక నా అంచనాల్ని, ఊహల్ని మించిపోయిన అనుభూతి కలిగింది. పతాక సన్నివేశాల్లో అయితే కన్నీళ్లు ఆగలేదు. మా నాన్నకి భాష తెలియదు. కానీ ఆయన కూడా కంటతడి పెట్టుకొన్నారు. ‘తొలిప్రేమ’ తర్వాత మరో మంచి సినిమా చేయాలి, నాకు నేను కొత్తగా కనిపించాలనుకొన్న నేను అలాంటి సినిమానే చేయడం తృప్తినిచ్చింది.

కథ పెళ్లి నేపథ్యంలోనే సాగుతుందా?
పెళ్లి మాత్రమే కాదు... మన విలువలు, సంప్రదాయాలు, సంస్కృతిని చాటి చెప్పే చిత్రమిది. ఒక యువ జంట ప్రయాణం ప్రేమ నుంచి పెళ్లి వరకు ఎలా సాగిందనేది చూడొచ్చు. * ఇందులో మీ పాత్ర ఎలా ఉంటుంది? - సంప్రదాయాలకు విలువనిచ్చే సిరి అనే ఓ యువతిగా కనిపిస్తా. ఆమె ఎలా ప్రేమలో పడింది? పెళ్లి ఎలా జరిగిందనేది తెరపైనే చూడాలి. ప్రకాష్‌రాజ్‌, రాజేంద్రప్రసాద్‌, జయసుధ, నరేష్‌, సితార... ఇలా చాలామంది సీనియర్‌ నటులతో కలిసి పనిచేశా. వాళ్ల నుంచి చాలా విషయాలు తెలుసు కొన్నా. నితిన్‌ మంచి సహనటుడు. పతాక సన్నివేశాల్లో చాలా బాగా నటించాడు. నందిత శ్వేత పాత్ర కూడా చాలా బాగుంటుంది. సమీర్‌రెడ్డి విజువల్స్‌ సినిమాని మరింత అందంగా మార్చేశాయి.

ఉత్తరాదిలో పుట్టి పెరిగారు కదా. తెలుగు పెళ్లి కొత్తగా అనిపించిందా?
ఉత్తరాదిలో జరిగే పెళ్లికీ, తెలుగు పెళ్లికీ చాలా తేడా ఉంది. కానీ అందులో అనుభూతి మాత్రం ఒకలాగే అనిపించింది. ఈ సినిమాలో నటిస్తున్నంతసేపూ నేను తెలుగమ్మాయిగా మారిపోయి నటించా. అమలాపురంలో చిత్రీకరణ జరిగింది. ఈ సినిమా చూశాక ఎవ్వరైనా వాళ్ల పెళ్లి ఊళ్లోనే జరగాలనుకొంటారు. నేటి తరానికి అవసరమైన సినిమా ఇది.పెళ్లిపై మీ అభిప్రాయం ఏంటి?
పెళ్లి గురించి ప్రతి అమ్మాయీ కలలు కంటుంది కదా! నేనూ అంతే. విడాకులు తీసుకోవడం వల్ల పెళ్లిపై నమ్మకం తగ్గిపోతోంది కానీ... పెళ్లి అనేది చాలా గొప్పది. ఈ సినిమా చూశాక దర్శకుడు సతీష్‌ వేగేశ్న పాదాల్ని తాకాను. పెళ్లి బంధం గురించి అంత గొప్పగా చెప్పారాయన.


మీరు పెళ్లి చేసుకొంటే ఈ చిత్రమే గుర్తుకొస్తుందేమో కదా?
తప్పకుండా వస్తుంది. తెలుగు సంప్రదాయం ప్రకారం పెళ్లి వేడుకలో జీలకర్ర బెల్లం ఎందుకు తలపై పెడతారు? బాసికం ఎందుకు కట్టుకుంటారు? తలంబ్రాలు ఎందుకు? ఇలా చాలా విషయాల్ని తెలుసుకొన్నా. భవిష్యత్తులో నా పెళ్లి కూడా ఇలాగే జరగాలనుకుంటున్నా. వీలైతే తెలుగింటి అబ్బాయినే పెళ్లి చేసుకోవాలని ఉంది (నవ్వుతూ).

‘తొలిప్రేమ’ తర్వాత చేసిన ఈ సినిమా విషయంలో ఏమైనా ఒత్తిడికి గురయ్యారా?
అంతకుముందు నాకు విజయం ఉన్నా, పరాజయమైనా అది పట్టించుకోను. మరో మంచి సినిమా చేయాలనే విషయంపై నా ధ్యాసంతా. ‘తొలిప్రేమ’ చూసే దిల్‌రాజు ‘శ్రీనివాసకళ్యాణం’లో అవకాశమిచ్చారు. ఈ సినిమా తర్వాత మరిన్ని మంచి పాత్రలు చేస్తాననే నమ్మకం నాకుంది.

ఈమధ్య ఎక్కువగా తమిళంపైనే దృష్టిపెడుతున్నారు కదా?
తెలుగులోనూ ఒక సినిమాకి సంతకం చేశా. తమిళంలో మూడు సినిమాలు చేస్తున్నా. అయితే ఇవి రెండేళ్లకు ముందు సంతకం చేసిన సినిమాలు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.