పోటీ లేదు ఇద్దరం గెలుస్తాం!
నాగచైతన్యని తెరపై ఎక్కువగా ప్రేమికుడిగానే చూశాం. తన ప్రేమావతారంతోనే సమంత మనసు గెలుచుకొని ఓ ఇంటివాడయ్యాడు. ఈసారి తనలోని చిలిపి కోణాన్ని కూడా ఆవిష్కస్తున్నారు... ‘శైలజారెడ్డి అల్లుడు’ చిత్రంతో! మారుతి దర్శకత్వం వహించిన ఆ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా నాగచైతన్య బుధవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ...


‘శైలజారెడ్డి అల్లుడు’ ఎలా ఉండబోతున్నాడు?


పేరు, ప్రచార చిత్రాలు చూసి ఇది అత్త అల్లుడు మధ్య గొడవలు... సవాళ్లతో కూడిన సినిమా అనుకుంటున్నారేమో. అందుకు పూర్తి భిన్నమైన కథ ఇది. మనుషుల్లో ఉండే అహం చుట్టూ సాగే కథ ఇది. పరిణతితో ఆలోచించే ఓ కుర్రాడు కొంతమందిలోని అహాన్ని ఎలా తొలగించాడు? పరిస్థితుల్ని ఎలా చక్కదిద్దాడనే విషయాలతో ఈ చిత్రం సాగుతుంది.

అహం ఉన్న వ్యక్తులతో మీకెదురైన అనుభవాలు పంచుకొంటారా?

ప్రతి ఒక్కరికీ అలాంటి అనుభవాలు ఎదురవుతుంటాయి. అందరిలోనూ ఎంతో కొంత అహం ఉంటుంది. కానీ అది పరిమితికి మించినప్పుడే సమస్యలు. ఆ విషయాన్ని చర్చిస్తూనే ఆద్యంతం సరదాగా సాగే చిత్రమిది.

సినిమాలో కూడా చైతన్యగానే నటించారు. ఆ పాత్రకీ, నిజ జీవితంలో మీకూ పోలికలేమైనా కనిపించాయా?

వ్యక్తిగత జీవితంలో ఎంత సరదాగా ఉంటానో, ఈ సినిమాలో కూడా అలాగే కనిపిస్తా. చాలా విషయాల్లో నాకూ, తెరపైన చైతన్య పాత్రకీ చాలా దగ్గరి పోలికలు కనిపించాయి. అందుకే దర్శకుడు మారుతి తెరపై పాత్రకి ఆ పేరు పెట్టారేమో (నవ్వుతూ).

ఇదివరకు చేసిన చిత్రాలతో... ‘శైలజారెడ్డి అల్లుడు’ని పోల్చి చూసుకుంటే ఏమనిపిస్తుంది?


అసలు పోలికలే కనిపించవు. నా సినీ జీవితంలో మొట్ట మొదట చేసిన పూర్తిస్థాయి వినోదాత్మక పాత్ర ఇది. ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’ సినిమా నన్ను కుటుంబ ప్రేక్షకులకు దగ్గరగా తీసుకెళ్లింది. ఆ విషయంలో మరో అడుగు ముందుకేయించే సినిమా ఇది. ప్రేమకథల్లో నటించడాన్ని నేను చాలా సౌకర్యంగా భావిస్తుంటా. కానీ ఆ జోనర్‌ నుంచి బయటికెళ్లి చేసిన సినిమా ఇది. ఇందులో కూడా ప్రేమకథ ఉన్నా, అది భిన్నంగా ఉంటుంది. రమ్యకృష్ణ, నాన్న కలిసి చాలా సినిమాల్లో నటించారు. వాటిలో ‘హలో బ్రదర్‌’ సినిమాని 30 సార్లైనా చూసుంటాను. మొదట రమ్యకృష్ణతో కలిసి నటించాలన్నప్పుడు కాస్త భయపడ్డా. కానీ ఆవిడ చాలా సరదాగా ఉంటూ, నా భయం పోగొట్టారు. ఈ సినిమాలో చివరి 30 నిమిషాలు మరో స్థాయిలో ఉంటుంది. మారుతి తన హీరోలకి భిన్నమైన పాత్రని సృష్టించి నాతో చేయించారు.

తదుపరి అఖిల్‌ కూడా మారుతి దర్శకత్వంలో చేస్తారని ప్రచారం సాగుతోంది. నిజమేనా?

ఈ సినిమా సెట్‌లోనే వాళ్లిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. అఖిల్‌ కోసం ఓ కథ తయారు చేస్తున్నారని తెలిసింది. వాళ్లిద్దరి కలయికలో ఓ సినిమా అయితే తప్పకుండా ఉంటుంది, అదెప్పుడనేది మాత్రం చెప్పలేను.

మీ అర్థాంగి సమంత, మీరు ఒకేసారి బాక్సాఫీసు దగ్గర బరిలోకి దిగుతున్నారు. ఇద్దరి మధ్య పోటీ అనుకోవచ్చా?

పోటీ ఏమీ లేదండీ. పండగ కాబట్టి ప్రేక్షకులు రెండు సినిమాల్నీ చూస్తారు. ఇద్దరం గెలుస్తామనే నమ్మకం నాకుంది. సమంత ‘యు టర్న్‌’ విడుదల సెప్టెంబరు 13 అని మొదట్నుంచీ చెబుతూనే ఉన్నారు. మా సినిమానే వాయిదా పడి ఇక్కడ ల్యాండ్‌ అయ్యింది. మొదట ఈ విషయం చెప్పినప్పుడు సమంత ఒక రకంగా చూసింది నన్ను (నవ్వుతూ). ఈ సినిమా కంటే ముందే ‘సవ్యసాచి’ విడుదలవుతుందనుకొన్నా. కానీ విజువల్‌ ఎఫెక్ట్స్‌ పనులు ఆలస్యం కావడంతో అది వాయిదా పడింది.

కొత్త రకమైన ప్రయత్నాలకి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది కదా, మీరూ ఆ దిశగా అడుగులేమైనా వేస్తున్నారా?

ఇదివరకు వాణిజ్య ప్రధానమైన కథలనీ, సేఫ్‌ జోన్‌ అనే మాటలు వినిపించేవి. ఇప్పుడలాంటివేవీ లేవు. ప్రేక్షకులు కొత్తదనంతో కూడిన ప్రతి సినిమానీ ఆదరిస్తున్నారు. ఆ తరహా సినిమాలు చేయాలని ఉంది కాబట్టే కొత్త దర్శకులతో కలిసి కొన్ని ప్రయత్నాలు చేశా. కానీ అవేవీ అచ్చిరాలేదు. అందుకే మళ్లీ ఒకట్రెండు విజయాల్ని అందుకొన్నాక, అప్పుడు ప్రయోగాల గురించి, కొత్త దర్శకులతో సినిమాల గురించి ఆలోచిస్తా.

యువ కథానాయకులు పోటాపోటీగా సినిమాలు చేస్తుంటారు. విజయాల విషయంలో ఎప్పుడైనా ఒత్తిడికి గురవుతుంటారా?

పోటీ అనేది ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అలాంటి వాతావరణం ఉన్నప్పుడే అందరి నుంచీ ఏదో ఒక విషయం నేర్చుకుంటూ ఉంటాం. అయితే విజయాల విషయంలో నేనెప్పుడూ ఒత్తిడికి గురికాలేదు. నటుడిగా నన్ను నేను నిరూపించుకొంటూ ముందుకెళ్లాలనేదే నా లక్ష్యం.

సమంత, మీరు కలిసి నటిస్తున్న కొత్త సినిమా ఎలా ఉండబోతోంది?

పెళ్లయిన ఓ జంట నేపథ్యంలో సాగే ప్రేమకథా చిత్రమది. అక్టోబరు నుంచి ఆ సినిమా మొదలవుతుంది. ఆ తర్వాత ‘వెంకీ మామ’ మొదలవుతుంది. అది ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది. అందులో యాక్షన్‌ కూడా ఉంటుంది.

‘చి.ల.సౌ’ చిత్రానికి అండగా నిలిచారు. ఆ తరహా ప్రయత్నాలు భవిష్యత్తులో కూడా కొనసాగిస్తారా?

తప్పకుండా చేస్తాను. కొత్తదనంతో కూడిన చిత్రం ‘చి.ల.సౌ’. మంచి కథ అనిపిస్తే నా దృష్టికి తీసుకురండని నాకు తెలిసినవాళ్లకి చెబుతూనే ఉంటా.

రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో మీ సంస్థ నుంచి మరో చిత్రం రాబోతోందని తెలిసింది. ఆ ప్రయత్నాలు ఎంతవరకొచ్చాయి?

నాన్నని దృష్టిలో ఉంచుకొని ఓ స్క్రిప్టు సిద్ధం చేస్తున్నాడు. ‘మన్మథుడు’ తరహా కథ అది. అందుకే ‘మన్మథుడు2’ అనే పేరు అనుకొంటున్నారు. ఆ కథ పూర్తిగా సిద్ధమయ్యాక నాన్న విని, నిర్ణయం తీసుకుంటారు. దాంతో పాటు బంగార్రాజు పాత్రతో ఓ ఫ్రాంచైజీలాగా రెండేళ్లకో సినిమా చేస్తే బాగుంటుందనేది నా ఆలోచన. ఒకసారి నాన్న నేను... మరొకసారి నాన్న, అఖిల్‌ చేస్తే బాగుంటుంది. ప్రస్తుతం ‘బంగార్రాజు’ స్క్రిప్టు దశలో ఉంది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.