ఆ పాత్ర కోసం 10కిలోల బరువు పెరిగా

‘‘తెలుగు సినిమాకి తెలుగమ్మాయిల అవసరం చాలా ఉంది. ప్రతిభని నిరూపించుకుంటే పరిశ్రమ ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోదు’’ అంటున్నారు నక్షత్ర. బాలనటిగా ‘లిటిల్‌ బుద్ధ’ చిత్రంతో పరిచయమైన ఈమె ‘పలాస 1978’, ‘రాజ్‌దూత్‌’ చిత్రాల్లో కథా నాయికగా నటించింది. పలు వెబ్‌ సిరీస్‌ల్లోనూ సందడి చేసింది. మంగళవారం నక్షత్ర పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె సోమవారం విలేకర్లతో ముచ్చటించింది. ఆ విషయాలివీ...

  • ‘‘కథానాయికగా ఒక మంచి ఆరంభం లభించింది. ‘పలాస 1978’, ‘రాజ్‌దూత్‌’ అవకాశాలు ఒకేసారి వచ్చాయి. వాటి చిత్రీకరణ సమాంతరంగా జరిగింది. ‘పలాస 1978’లో లచ్చిమి పాత్ర కోసం పది కిలోలు బరువు పెరిగి నటించా. ఆ క్రమంలో ఆస్పత్రి పాలయ్యా. ఆ కష్టానికి తగ్గ ఫలితమే వచ్చింది. కెరీర్‌ ఆరంభంలోనే అంత మంచి పాత్ర చేయడం తృప్తినిచ్చింది. ఆ సినిమా తర్వాత చాలా అవకాశాలొచ్చాయి. ఆహా ఓటీటీ కోసం ‘గీత సుబ్రమణ్యం’, ‘మెట్రో కథలు’ చేశా. మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఈ యేడాది చివర్లో నా కొత్త సినిమాలు మొదలవుతాయి. ఆరు కథలు విని నటించేందుకు ఒప్పుకొన్నా’’.

  • ‘‘విభిన్నమైన కథలు, పాత్రలు చేయాలన్నదే నా ప్రణాళిక. రమ్యకృష్ణ అంటే ఇష్టం. ఆమెలా పేరు తెచ్చుకోవాలని ఉంది. కథకి అవసరం అనిపిస్తే... పరిమితి మేరకు గ్లామర్‌ పాత్రల్లో నటించడానికీ సిద్ధమే. స్వతహాగా డ్యాన్సర్‌ని కాబట్టి నృత్య ప్రధానమైన సినిమా చేయాలని ఉంది.’’



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.