అది తప్ప మిగతా సన్నివేశాలు నచ్చలేదని చెప్పా
తెలుగు చిత్రసీమలో కుటుంబ కథల సమయం నడుస్తోంది. యువ కథానాయకులు ఆ కథలపై మరింత మక్కువ ప్రదర్శిస్తున్నారు. ఇంటిల్లిపాదినీ థియేటర్లకి రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఈసారి ‘ఎంత మంచివాడవురా’తో కల్యాణ్‌రామ్‌కి ఆ అవకాశం దొరికింది. సతీష్‌ వేగేశ్న తెరకెక్కించిన చిత్రమిది. ఆదిత్య మ్యూజిక్‌ ఇండియా పతాకంపై ఉమేష్‌ గుప్త, సుభాష్‌ గుప్త నిర్మించారు. శివలెంక కృష్ణప్రసాద్‌ సమర్పించారు. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 15న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా కల్యాణ్‌రామ్‌ సోమవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ...


* మీ సినిమా తొలిసారి సంక్రాంతికి విడుదలవుతోంది. ఆ అనుభూతి ఎలా ఉంది?
ఇదివరకు ‘పటాస్‌’ను పండగకు విడుదల చేయాలనుకున్నా. కానీ అప్పట్లో కుదరలేదు. సంక్రాంతిని రైతుల పండగ అని ఎలా అంటామో, సినిమా వాళ్లకి కూడా ఇదొక పెద్ద పండగ. ప్రతిసారీ కొన్ని పెద్ద బడ్జెట్‌ సినిమాలతో పాటు ఒకట్రెండు మీడియం బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రాలొస్తాయి. ఇది కుటుంబమంతా కలిసి చూడదగ్గ సినిమా. వాళ్లకు సులభంగా చేరువ కావాలంటే మాకు కనిపించింది సంక్రాంతే. మేం ముందు నుంచి ప్రణాళికతో ఉన్నాం కాబట్టి మా సినిమాకి అవసరమైన థియేటర్లు మాకున్నాయి.

* ఈ సమయంలో ‘ఎంత మంచివాడవురా’ చేయడానికి ప్రత్యేక కారణమేమైనా ఉందా?
‘118’ తర్వాత చాలా కథలే విన్నా. ఒకరోజు నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్‌ వచ్చి ‘గుజరాతీ సినిమా ఒకటి ఉంది, చూస్తారా’ అని అడిగారు. అందులో సినిమాకి మూలమైన ప్రధాన అంశం నాకు బాగా నచ్చింది. మిగతా సన్నివేశాలు నాకు అంతగా నచ్చలేదని చెప్పా. సతీష్‌ వేగేశ్న మార్పులు చేసి కథ సిద్ధం చేశాడు, వినండి అన్నారు. సతీష్‌ ఎప్పుడైతే ఆ మార్పులు చెప్పారో అది నాకు బాగా నచ్చింది.

* కొన్ని సినిమాలు కొంతమంది ఇమేజ్‌ని మారుస్తుంటాయి. ఈ సినిమాపై మీ అభిప్రాయమేంటి?
నేనెప్పుడూ ఇమేజ్‌ గురించి ఆలోచించలేదు. కథ నచ్చితే చేయడమే. కుటుంబ కథ చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నా. ‘శతమానం భవతి’ చిత్రాన్ని నా భార్య చూసింది. ‘ఆ సినిమా చాలా బాగుంది, మీరెందుకు అలాంటివి చేయరు? ఎప్పుడూ వాణిజ్య ప్రధాన సినిమాలే చేస్తారెందుకు?’ అని అడిగింది. అప్పుడు నేను ఒకటే చెప్పా. ‘ఆ దర్శకుడు నన్ను నమ్మాలి, నేను నటింగలను, ఆ కథకి నేను బాగుంటానని నమ్మితే అలాంటి సినిమాలు చేయడం సాధ్యం’ అన్నా. అలాంటి కథనే సతీష్‌ వేగేశ్న నా దగ్గరికి తీసుకొచ్చాడు. ఇదే సరైన సమయం అని నమ్మి ఈ సినిమా చేశా. తారక్‌ కూడా ఇలా ఎప్పటికప్పుడు విభిన్నమైన కథలు చేయమని చెబుతుంటాడు. ఎలాంటి కథలు చేస్తున్నామో మేం ఒకరికొకరు చెప్పుకుంటుంటాం.


* ఒక కొత్త కథ చేస్తున్నప్పుడు నటుడిగా ఎలాంటి సవాళ్లని ఎదుర్కొంటుంటారు. ఈ సినిమా ప్రయాణం ఎలా సాగింది?
కొత్త కథలు చేయడమే నాకు ఇష్టం. ఆ సవాళ్లు కూడా సంతృప్తినిస్తుంటాయి. ఈ సినిమా విషయంలో ఏ రోజూ భారంగా అనిపించలేదు. అప్పుడే అయిపోయిందా అనిపించింది. మున్నార్‌తో పాటు సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ లేని పలు ప్రాంతాల్లో ఈ సినిమా చేశాం. ‘నిన్ను కోరి’ చూశాక గోపీసుందర్‌ సంగీతంలో సినిమా చేయాలనుకున్నా. ఈ సినిమాతో కుదిరింది. మెహరీన్‌కి చాలా మంచి పాత్ర దొరికింది. సంగీత రంగంలో అగ్రగామిగా ఉన్న ఆదిత్య సంస్థ ఈ సినిమాతో నిర్మాణంలోకి రావడం ఇంకా సంతృప్తినిచ్చింది.

* కుటుంబ కథ కదా, ఇందులో నటిస్తున్నప్పుడు మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలేవైనా గుర్తుకొచ్చాయా?
నా నిజ జీవితానికి దగ్గరగా ఉండే పాత్ర ఇది. ఎప్పుడూ నవ్వుతూ కనిపిస్తుండాలని, కళ్లు కూడా పెద్దవి చేసి చూడకూడదని దర్శకుడు చెప్పారు. వ్యక్తిగతంగా నేనలాగే ఉంటా. మేమంతా ఉమ్మడి కుటుంబం నుంచి వచ్చిన వాళ్లమే. చిన్నప్పుడు ఇంటికి బంధువులు వచ్చారంటే చాలా బాగుండేది. ఇప్పుడు మా ఇంట్లో తొమ్మిది మంది ఉంటున్నాం. ఉదయం టీ తాగుతూ ఒక గంట అందరితో కలిసి గడపడం, వాళ్లతో మాట్లాడటం నాకు అలవాటు. అలాంటి సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. అవన్నీ నాకు వ్యక్తిగతంగా బాగా కనెక్ట్‌ అయ్యాయి.

* మీ వ్యక్తిత్వానికి తగ్గట్టుగానే ‘ఎంత మంచివాడవురా’ పేరు కుదిరిందని అంతా అంటున్నారు....
అందరూ మంచోళ్లేనండీ. ప్రతి ఒక్కరూ వాళ్ల కోణంలో ఆలోచించి పనులు చేస్తారు. ఆ పని మనల్ని ఇబ్బంది పెట్టిందంటే చెడ్డోళ్లు అంటూ తిట్టుకుంటాం. నిజానికి మనుషులు అనేవాళ్లే మంచోళ్లు. ఈ చిత్రంలో కూడా అదే చెబుతున్నాం. ఇందులో ‘ఏమో ఏమో..’ పాట వింటే ఈ సినిమా ఏంటనేది తెలుస్తుంది. ప్రతి విషయాన్నీ సానుకూల దృక్పథంతో చూడడం ఇందులో హీరో అలవాటు. తనకి కావల్సిన బంధాల్ని తీసుకొని, ఎదుటివాళ్లకి కావల్సిన భావోద్వేగాల్ని ఇస్తుంటాడు. ఇక ఈ పేరంటారా? మొదట ‘ఆల్‌ ఈజ్‌ వెల్‌’ అనే పేరు పెడతామన్నారు దర్శకుడు. కానీ సతీష్‌ వేగేశ్న ఇదివరకు చేసిన సినిమాల పేర్లు అచ్చ తెలుగులో ఉంటాయి. వాటిలో నిండుతనం కనిపిస్తుంది. నేను కూడా మీ నుంచి అలాంటి ఓ తెలుగు పేరు కోరుకుంటున్నానని చెప్పా. అప్పుడు ఈ టైటిల్‌ చెప్పారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.