ఇలాంటి కథను ఇంత హాస్యంతో ఎవరూ తీయలేదు!!
చిరంజీవి నటించిన ‘గ్యాంగ్‌ లీడర్‌’ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిన విషయమే. ఇప్పుడు అదే టైటిల్‌తో వస్తున్నాడు యంగ్‌ హీరో నాని. విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మహిళా గ్యాంగ్‌కు లీడర్‌గా కనిపించబోతున్నాడు నేచురల్‌ స్టార్‌. ఈ చిత్రం ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకొస్తున్న నేపథ్యంలో తాజాగా మీడియాతో ముచ్చటించారు నాని. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..


* ఇంతకీ మీరేనా 'గ్యాంగ్‌లీడర్‌'?
నాని: అవునండీ నేనే గ్యాంగ్‌ లీడర్‌.(నవ్వులు) అది చెబుదామనే వచ్చా. నేనూ, విక్రమ్‌ ఎప్పటి నుంచో కలిసి పనిచేయాలని అనుకున్నాం. చాలా ఆలోచనలు వచ్చాయి. అవేవీ నాకు నచ్చలేదు. ఎట్టకేలకు ఈ ఐడియా సినిమాగా కార్యరూపం దాల్చింది. ఈ కథ చెప్పిన సమయంలో నేను 'జెర్సీ' మూవీ చేస్తున్నా. ఇద్దరికీ నచ్చడంతో 'గ్యాంగ్‌లీడర్‌' పట్టాలెక్కింది.

* చిత్ర టైటిల్ ఆలోచన ఎవరిది ?
నాని: 'జెర్సీ' సమయంలో ఒక రోజు విక్రమ్‌ నా దగ్గరకు వచ్చి 'మన సినిమాకు గ్యాంగ్‌లీడర్‌' అని పెట్టాలనుకుంటున్నా' అని చెప్పాడు. ఈ టైటిల్ పై కొన్ని వివాదాలు, భిన్న వాదనలు తెరపైకి వచ్చాయి. అందుకే మేము 'నాని గ్యాంగ్ లీడర్' అని పెట్టాం. నా దృష్టిలో ఈ టైటిల్ ఈ కథకు చక్కగా సరిపోతుంది. మూవీ చూసిన తర్వాత మీకు కూడా అర్థం అవుతుంది. ఒక విషయమైతే కచ్చితంగా చెప్పగలను. ఇది విక్రమ్‌ కె కుమార్‌ సినిమా. అందులో ఎలాంటి అనుమానం లేదు.


* 'జెర్సీ' తర్వాత ఈ చిత్రమే ఎంచుకోవడానికి కారణం ఏంటి?
నాని: ఈ కథ కొత్తగా ఉంటుంది. రివేంజ్‌ స్టోరీని హాస్యంతో ఎవరూ ఇంతవరకూ తీయలేదు. విక్రమ్‌ తొలిసారి అలా తెరకెక్కించారు. విక్రమ్‌ కథ చెప్పినప్పుడు నేను ఎంత నవ్వానో.. థియేటర్‌లో మీరు కూడా అంతే నవ్వితే సినిమా ఘన విజయం సాధించినట్లే. దానిలో అనుమానం లేదు. ఇక ఈ చిత్రంలో ఐదుగురు ఆడవాళ్ళు ఉంటారు, ప్రతి ఒక్కరికి కథలో ప్రాధాన్యం ఉంటుంది. అందుకే నేను గ్యాంగ్ లీడర్ చేయడానికి ఒప్పుకొన్నాను.

* విక్రమ్‌ స్క్రీన్‌ప్లే చాలా విభిన్నంగా ఉంటుంది. మరి ఇది?
నాని: ఇందులో అలాంటి గందరగోళం ఏమీ ఉండదు. చాలా సింపుల్‌ సినిమా. కీలక మలుపులు, ఊహించని ట్విట్‌లు ఉన్నా అవన్నీ అందరికీ అర్థమయ్యేలా ఉంటాయి. మిమ్మల్ని బాగా ఎంటర్‌టైన్‌ చేస్తుంది. అదే సమయంలో అస్సలు గందరగోళంగా ఉండదు. ఇందులోనే పెన్సిల్‌ పార్థసారథి అనే రచయితగా కనిపిస్తా. చాలా రివేంజ్‌ డ్రామా స్టోరీలు రాసినా, అవేవీ అమ్ముడుపోవు.

* ఇంతకీ విక్రమ్‌తో పనిచేయడం ఎలా అనిపించింది?
నాని: చాలా సంతోషంగా గడిచిపోయింది. షూటింగ్‌ జరిగినన్ని రోజులూ ఎంతో ఫన్నీగా సాగిపోయింది. విక్రమ్‌ సాంకేతికంగా ఎప్పుడూ ముందుంటారు. అదే సమయంలో ఆయన ఆలోచనలు ఉన్నతంగా ఉంటాయి. ఎందుకంటే ఆయన ఎంచుకున్న సబ్జెక్ట్‌లు అలాంటివి. విరామం తీసుకోవడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. సినిమా విడుదలకు ముందే ప్రమోషన్స్‌ కోసం షూటింగ్‌లకు వెళ్లను. దీంతో ఆ రోజులన్నీ చాలా భారంగా గడుస్తాయి.


* ఈ చిత్రానికి ఓ కొరియన్‌ సినిమా స్ఫూర్తి అంటున్నారు. దీనిపై మీ సమాధానం?
నాని: అది ఏ సినిమానో మీరే చెప్పండి. ప్రతి వాళ్లకు ఇదో ఫ్యాషన్‌ అయిపోయింది. ఎవరో ఏదో ఒకటి రాస్తూ ఉంటారు. దాన్ని మీరే సరిచూసుకోవాలి.

* విలన్ పాత్రకు హీరో కార్తికేయను తీసుకోవాలన్న ఆలోచన ఎవరిది?
నాని: ఆ పాత్ర కోసం నలుగురైదుగురి పేర్లు అనుకొన్నాం. మొదట కార్తికేయను సంప్రదించి కథ చెప్పగా వెంటనే ఒప్పుకొన్నాడు. 'గ్యాంగ్ లీడర్'లో కార్తికేయది కీలకపాత్ర. ఆయన పాత్ర అందరికి బాగా కనెక్ట్ అవుతుంది.

* ఇందులో రొమాన్స్‌ సీన్లు ఉన్నాయా?
నాని: చాలా తక్కువ. అంతా రివేంజ్‌ స్టోరీపైనే నడుస్తుంది. రొమాన్స్‌కు చాలా తక్కువ అవకాశం ఉంది.


* 'జెర్సీ' ఫలితంతో మీరు సంతోషంగా ఉన్నారా?
నాని: చాలా సంతోషంగా ఉన్నా. తెలుగు సినిమా మూస ధోరణి లెక్కలను బద్దలు కొట్టి విభిన్నంగా తెరకెక్కిన చిత్రం. దాదాపు రూ.30కోట్లకు పైగా వసూలు చేసింది. 'ఎంసీఏ' విడుదలైనప్పుడు 'డబ్బులు పర్వాలేదు. నాని మంచి సినిమాలు చేయడా?' అని అన్నారు. అదే జెర్సీ విడుదలైన తర్వాత 'మంచి సినిమాలు ఒకే ఎంసీఏ కలెక్షన్లను దాటుతుందా' అని కూడా అన్నారు. ఇలాంటి భిన్న స్పందనలు వస్తుంటే నన్నేం చేయమంటారు. (నవ్వులు)

* జెర్సీ, గ్యాంగ్ లీడర్ చిత్రాలలో ఏది మీకు కష్టంగా అనిపించింది?
నాని: జెర్సీ చిత్రం కోసం మానసికంగా, శారీరకంగా చాలా కష్టపడాల్సి వచ్చింది, గ్యాంగ్ లీడర్ విషయంలో అలా కాదు. విక్రమ్ కుమార్ వలన గ్యాంగ్ లీడర్ షూటింగ్ సులువుగా హ్యాపీగా గడిచిపోయింది.

* మీరు నిర్మించిన చిత్రానికి జాతీయ అవార్డు వచ్చింది. మళ్లీ మీ బ్యానర్‌లో సినిమాలు చేస్తారా?
నాని: రెండు అవార్డులు వచ్చినందుకు సంతోషంగా ఉంది. త్వరలోనే ఒక సినిమా చేయబోతున్నా. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు నడుస్తున్నాయి.

* చిత్ర పరిశ్రమలో 11ఏళ్ల ప్రయాణం చేశారు,ఆ అనుభవం ఎలా ఉంది?
నాని: 11ఏళ్ల సమయం ఎప్పుడైందో కూడా తెలియనంతగా కాలం గడిచిపోయింది. ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడ్డాను. ఇన్నేళ్ళుగా నన్ను ఆదరిస్తున్న అభిమానులకు కృతఙ్ఞతలు.

* బాలీవుడ్‌కు వెళ్లే ఆలోచన ఉందా?
నాని: నేను అస్సలు వెళ్లను. వెళ్లినా నన్ను అభిమానిస్తారని నేను అనుకోవడం లేదు.

* సక్సెస్‌ను మీరు ఎలా అభివర్ణిస్తారు!
నాని: నా దృష్టిలో సక్సెస్‌ అనే పదానికి అర్థమే లేదు. 10 సినిమాలు హిట్టయిన తర్వాత ఒకటి ఫ్లాప్‌ అయితే, 'నాని కష్టాల్లో ఉన్నాడు' అంటున్నారు. సక్సెస్‌ రేటు గురించి ఆలోచించకుండా నేను కథలు ఎంచుకుంటున్నా.

* 'బిగ్‌బాస్‌' చూస్తున్నారా?
నాని: అస్సలు సమయం లేదండీ. 'గ్యాంగ్‌లీడర్‌' ప్రమోషన్స్‌ కోసం ఏదైనా ఎపిసోడ్‌ ప్లాన్‌ చేయాలి. అయినా నాగ్‌ సర్‌ అద్భుతంగా చేస్తున్నారుగా.
సంబంధిత వ్యాసాలు


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.