అలా మొదలైంది ‘అల్లరి’

అల్లరి నరేష్‌... చూస్తుండగానే హాఫ్‌ సెంచరీ కొట్టేశారు. అందుకే ఆయన్ని సడన్‌ స్టార్‌ అన్నారేమో! కామెడీకి కేరాఫ్‌గా నిలుస్తూ ప్రేక్షకులకి కితకితలు పెడుతుంటారు నరేష్‌. ‘గమ్యం’, ‘శంభో శివ శంభో’, ‘మహర్షి’లాంటి చిత్రాలతో తన అభినయంలో మరో కోణాన్నీ ప్రదర్శించారు. ఆయన తొలి చిత్రం ‘అల్లరి’ విడుదలై ఈ నెల 10తో 18 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆయన నట ప్రయాణం, వ్యక్తిగత జీవితం గురించి ‘ఈనాడు సినిమా’తో ప్రత్యేకంగా ముచ్చటించారు.

వాళ్లకి నచ్చకపోతే ఉండలేం

‘‘19 ఏళ్ల వయసులో ‘అల్లరి’తో నా ప్రయాణం మొదలైంది. ఆ సినిమా విడుదలై 18 ఏళ్లు అయింది. అప్పుడే అన్నేళ్లయిందా అనిపిస్తోంది. అదే సమయంలో సంతోషంగానూ అనిపిస్తుంది. పరిశ్రమలో ఆటుపోట్లు తట్టుకుని అన్నేళ్లు నిలవడం ఓ గొప్ప లక్ష్యాన్ని చేరుకున్నట్టే ఉంది. నటనంటే మొదట్నుంచీ ఆసక్తి. మనకిష్టమైన రంగంలో కొనసాగడం, విజయవంతం కావడం కంటే గొప్ప విషయం ఏముంటుంది? ప్రేక్షకులకు నచ్చకపోతే ఇన్ని రోజులు ఉండలేం. ఎప్పటికప్పుడు వాళ్లని నవ్విస్తూ, మెప్పిస్తూ ఇంత దూరం ప్రయాణం చేయడం మంచి అనుభూతి’’.


క్యాషియర్‌గా వచ్చా

‘‘నాన్నతో సెట్‌కి వెళ్లినప్పుడు సరదాగా క్లాప్‌ కొట్టడం, సీన్‌ పేపర్లు చూడటం చేసేవాణ్ని. నాన్న నన్ను దర్శకుణ్ని చేయాలనుకున్నారు. ‘చాలా బాగుంది’ సమయంలో దర్శకత్వం, నిర్మాణం రెండూ చూసుకోవడం కష్టమవుతోందని, సాయంగా నన్ను పిలిచారు. పక్కాగా చెప్పాలంటే ఓ క్యాషియర్‌గా పరిశ్రమలోకి అడుగుపెట్టా. ఆ సినిమానే నా జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ సినిమా వంద రోజుల వేడుకకి అతిథిగా అమితాబ్‌ బచ్చన్‌ వచ్చారు. ఆయన నన్ను చూసి హైట్‌ ఎంతని అడిగారు. 6 ప్లస్‌ అని చెప్పా.‘మా అభిషేక్‌ అంత హైట్‌ ఉన్నావు’ అన్నారు. ఆ తర్వాత నా గురించి మా నాన్నతో ‘హీరోగా ప్రయత్నిస్తే బాగుంటుంద’ని చెప్పారట. ఆ విషయం చెప్పగానే ‘నాక్కూడా ఆసక్తి ఉంది నాన్నా’ అన్నా. దర్శకుణ్ని చేద్దామనుకుంటే, నటన అంటున్నాడేంటి అనుకున్నారు. అలాగని వద్దు అని చెప్పలేదు’’.అల్లరి అలా..

‘‘మా నాన్న పెద్ద దర్శకుడైనా, నాకు బయటి దర్శకుల సినిమాతోనే పరిచయం కావాలని ఉండేది. నాన్న, చలపతిరావు అంకుల్‌ స్నేహితులు. దాంతో నాకు రవిబాబుతో అనుబంధం ఉండేది. ఆయన అప్పుడు వాణిజ్య ప్రకటనలు చేసేవారు. ఒకరోజు నన్ను ‘నువ్వెందుకు నటించడం లేదు’ అని అడిగాడు. నాకు ఆసక్తి ఉంది, శిక్షణ కూడా తీసుకున్నా అని చెప్పా. నా సినిమాలో చేస్తావా అని అడిగాడు. నేను బాగా తెలుసు కాబట్టి, నన్ను ప్రోత్సహించడానికి అలా అంటున్నారేమో అనుకున్నా. జనవరి 22, 2002 ఉదయాన్నే ఫోన్‌ చేసి ‘అర్జంటుగా నీ దగ్గరున్న మంచి దుస్తులు తీసుకుని రామానాయుడు స్టూడియోకు వచ్చేయ్‌’ అన్నారు. ఏమైనా ప్రకటన ప్లాన్‌ చేశారేమో అనుకున్నా. ఫొటో షూట్‌ అయ్యాక ‘నేను ‘అల్లరి’ అనే సినిమా చేస్తున్నా, నువ్వే అందులో హీరో’ అన్నారు’’


మూడో సినిమా నుంచి

‘‘నా మూడో సినిమాని నాన్న చేశారు. అప్పట్నుంచి మేం కలిసి 9 సినిమాలు చేస్తే 7 హిట్లు. సీరియస్‌ కథలతో చేసిన రెండు సినిమాలు మాత్రం ఆడలేదు. నాన్నదీ, నాదీ ఒకే రకమైన బాడీ లాంగ్వేజ్‌ కాబట్టి, కామెడీ మీద పట్టు బాగా వచ్చింది. అది నా కెరీర్‌కి చాలా మేలు చేసింది. ఇప్పటివరకు 57 సినిమాలయ్యాయి. కె.విశ్వనాథ్, బాపు, వంశీ, కృష్ణవంశీ ఇలా లెజెండ్స్‌తో సినిమాలు చేశా. 22 మంది కొత్త దర్శకులతో చేశా. ఒక సినిమా సెట్లో ఉండగానే, రెండు కథలు ఓకే చేసేవాణ్ని. 72 గంటలు విరామం లేకుండా పని చేసిన సందర్భాలు ఉన్నాయి. పరాజయం వచ్చినప్పుడే విజయం విలువ తెలుస్తుంది. ఒకప్పుడు మినిమమ్‌ గ్యారెంటీ హీరో అనేవాళ్లు. ఈమధ్య పరాజయాలు వస్తున్నాయి. అయినా సరే, ‘ఏం పర్లేదు, సమయం తీసుకోండి. మంచి కథ చేయండి. ఒక్క హిట్టు కెరీర్‌ని మారుస్తుంద’ని సన్నిహితులు చెబుతుంటారు’’.ఎక్కువ సమయం పాపతోనే

‘‘ఇంట్లో మా పాపతో ఎక్కువ గడుపుతున్నా. అల్లరి నరేష్‌కే అర్థం కానంత అల్లరి చేస్తోంది మా పాప (నవ్వుతూ). ఇప్పుడిప్పుడే మాటలొస్తున్నాయి తనకు. టీవీలో నేను కనిపించానంటే ‘డాడా వచ్చాడు’ అంటుంది. ఇదివరకు పండగ రోజూ చిత్రీకరణలకి వెళ్లేవాణ్ని. ఎప్పుడూ షూటింగేనా అని మా అమ్మ తిట్టేవారు. షూటింగులతో పాటు వ్యక్తిగత జీవితమూ ముఖ్యమే అని ఇప్పుడు అనిపిస్తోంది. మా పాప మా అన్నయ్య రాజేష్‌తో‘డాడా ఇలా అన్నాడ’ని నా మీద ఫిర్యాదు చేస్తుంటుంది’’

సూపర్‌ కాదు యావరేజ్‌

‘‘వేసవిలో వచ్చిన నా సినిమాలన్నీ హిట్టే. ఈ సారి కూడా ‘బంగారు బుల్లోడు’ సినిమాను ఏప్రిల్‌లో విడుదల చేయాలనుకున్నాం. ‘నాంది’ కూడా పది రోజులు చిత్రీకరణ చేస్తే పూర్తవుతుంది. మే చివర్లో విడుదల అనుకున్నాం. కరోనాతో అన్నీ తారుమారయ్యాయి. మా సినిమాలు వాయిదా పడటం సమస్య కాదు. వలస కూలీల బాధ చూస్తే మనసు తరుక్కుపోతుంది. మార్చి 17 నుంచి ఇంటి బయట అసలు అడుగుపెట్టలేదు. ఈమధ్య వంట నేర్చుకున్నా. ఇదివరకు వంట రూమ్‌లోకి రావొద్దు అనేవాళ్లు. ఇప్పుడు వాళ్లు కూడా ‘చెయ్యనీ...’ అంటూ వదిలేశారు. సూపర్‌ అనడం లేదు కానీ... యావరేజ్‌ కుక్‌గా పాసయ్యాను (నవ్వుతూ).
Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.