ఆ గాయంతోనే.. పదేళ్లు మౌనం దరిచేరిందట!!
నయనతార.. ఇప్పుడు దక్షిణాదిలో మోస్ట్‌ వాంటెడ్‌ కథానాయిక‌. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే ప్రస్తుతం దక్షిణాదిలో ఆమే లేడీ సూపర్‌ స్టార్‌. తెలుగు మెగాస్టార్‌ చిరుకైనా.. తమిళ సూపర్‌స్టార్‌ రజనీ చిత్రానికైనా కావాల్సింది ఆమే. అటు అగ్ర కథానాయకులతో ఆడిపాడుతూనే విజయ్‌ వంటి స్టార్లతో ‘విజిల్‌’ కొట్టించేందుకు ముస్తాబవుతోంది. ఇక ఆమె కోసం వేచి చూస్తున్న నాయికా ప్రాధాన్య చిత్రాలైతే అరడజను పైగానే ఉన్నాయట. అయితే చిత్రసీమలో ఇంతలా వెలుగులు చిందిస్తున్న నయన్‌ మీడియాలో కనిపించేది మాత్రం చాలా తక్కువే. ఎప్పుడైనా ప్రేక్షకులకు ఏదైనా చెప్పాల్సి వస్తే.. సోషల్‌ వాల్‌పై సందడి చేస్తుందే తప్ప మీడియాలకు ఇంటర్వ్యూల్లో అస్సలు పాల్గొనదు. ఇంకా పక్కాగా చెప్పాలంటే ఆమె చివరిసారిగా ఇంటర్వ్యూ ఇచ్చి 10ఏళ్లు దాటిపోయింది. అయితే ఇంతకీ ఆమె ఇలా మీడియాకు దూరంగా ఉండటానికి కారణం ఆమె మనసుకు తగిలిన ఓ గాయమేనట. తాజాగా ఈ విషయాన్ని ప్రముఖ మ్యాగజైన్‌ ‘వోగ్‌’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంది. ఇప్పటి వరకు ఈ మాగ్యజైన్‌ కవర్‌ పేజీపై ఏ దక్షిణాది కథానాయిక సందడి చేయలేదు. తొలిసారి ఆ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది నయనతార మాత్రమే. ఈ సందర్భంగా ఆమె వారికి ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది.


‘‘చిత్రసీమలోకి వచ్చిన కొత్తలో మీడియాకు ఎప్పుడూ అందుబాటులోనే ఉండేదాన్ని. కానీ, కొన్ని సందర్భాల్లో నేను మాట్లాడిన కొన్ని మాటలను మీడియా వక్రీకరించింది. అది నా మనసును చాలా బాధపెట్టింది. నా మనసుకు తగిలిన ఆ గాయం కారణంగానే మీడియాకు దూరంగా ఉంటూ వస్తున్నా. ఈ పదేళ్లలో నేను ఎవరికీ ఇంటర్వ్యూలు కానీ, వీడియో బైట్స్‌ కానీ, ఇవ్వలేదు. నటిగా నా బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు కష్టపడుతుంటా. చిత్రసీమ అంటేనే మగవాళ్ల ఆధిపత్యమే ఎక్కువగా కనిపిస్తుంది. కానీ, ఈ విషయంలో నేనెప్పుడూ సర్దుకుపోలేదు. నా మనసుకు నచ్చిన కథలనే ఎంపిక చేసుకుంటుంటా. షూటింగ్స్‌, కాస్ట్యూమ్‌, మేకప్‌.. ఇలా ప్రతి విషయంలో నేనే నిర్ణయం తీసుకుంటా. పరిశ్రమలోని వాళ్లు నా గురించి ఏమనుకుంటారు? ప్రేక్షకులు ఏం మాట్లాడుకుంటారు? అని నేనెప్పుడూ పట్టించుకోలేదు. నాకు నచ్చినట్లు జీవిస్తున్నా అది చాలు’’ అంటూ తన వ్యక్తిగత, సినీ కెరీర్‌కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. నయన్‌ ఇటీవలే చిరంజీవితో ‘సైరా’లో సందడి చేసింది. త్వరలో రజనీకాంత్‌ ‘దర్బార్‌’తో, విజయ్‌ ‘విజిల్‌’ చిత్రాలతో ప్రేక్షకుల్ని పలకరించనుంది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.