అందుకే ‘దేవుళ్లు’ పాపగానే గుర్తున్నా

‘‘నేనొక చిత్రాన్ని ఎంచుకున్నానంటే.. అందులో నటిగా నా పాత్రకు తగినంత ప్రాధాన్యత ఉందా? లేదా? అని చూసుకుంటా. నన్నొక టేబుల్‌లా చూపించే పాత్రల్ని అసలు ఒప్పుకోను. గతంలో నాకిలాంటి అనుభవాలు ఎదురయ్యాయి’’ అంటోంది నిత్యా శెట్టి. ‘దేవుళ్లు’, ‘అంజీ’ తదితర చిత్రాలతో బాల నటిగా మెప్పించిన ముద్దుగుమ్మ ఈమె. ఇప్పుడు ‘ఓ పిట్టకథ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. విశ్వంత్‌ దుద్దుంపూడి, సంజయ్‌ రావు కథానాయకులుగా నటించిన చిత్రమిది. చెందు ముద్దు దర్శకత్వం వహించారు. వి.ఆనంద ప్రసాద్‌ నిర్మించారు. ఇటీవలే విడుదలైంది. ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించింది నిత్యా శెట్టి. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..


* అందుకే చాలా సంతృప్తిగా ఉంది..

‘‘బాలనటిగా చాలా చిత్రాల్లో చేశాను. కానీ, ‘దేవుళ్లు’, ‘అంజి’ చిత్రాలు వాణిజ్యపరంగా పేరు తెచ్చుకున్నాయి కాబట్టి ఆ చిత్రాలతోనే ఎక్కువగా అందరికీ గుర్తున్నా. చాలా మంది నన్ను దేవుళ్లు పాప అనే అంటుంటారు. ఇన్నేళ్ల ప్రయాణంలో నటిగా నాకు బాగా సంతృప్తినిచ్చిన చిత్రం మాత్రం ‘ఓ పిట్టకథ’నే. తొలిసారి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల మధ్య కూర్చోని వెండితెరపై చూసుకున్నప్పుడు చాలా సంతృప్తిగా అనిపించింది. ముఖ్యంగా దర్శకుడు నా పాత్రను చెప్పింది చెప్పినట్లుగా తెరకెక్కించినందుకు చాలా సంతోషపడ్డా. ఎందుకంటే చాలా మంది దర్శకులు ముందు ఒకటి చెప్పి.. తెరపైకి వచ్చే సరికి మరొకటి చూపిస్తారు’’.



* నా సీన్లు తీసేయ్యరు కదా..

‘‘నిజానికి నాకు ఇప్పటికైతే ఓ దర్శకుడ్ని జడ్జ్‌ చేసేంత అనుభవం రాలేదు. అందుకే పెద్ద నిర్మాణ సంస్థల్లో చెయ్యడానికి ఇష్టపడుతుంటా. ఎందుకంటే వాళ్లకు దర్శకుడిలోని ప్రతిభను, ఓ స్క్రిప్ట్‌ మంచిదా? కాదా? అని నిర్ణయించగల అనుభవం ఉంటుంది. నిజానికి నేను భవ్య క్రియేషన్స్‌లో ఆడిషన్‌ ఇచ్చింది మరో చిత్రం కోసం.. కానీ, కొన్ని కారణాల వల్ల అది పట్టాలెక్కలేదు. తర్వాత చెందు ఫోన్‌ చేసి ఈ చిత్రం గురించి చెప్పారు. నాకు కథ చెప్పేముందు తనని ఒకటే అడిగా.. ‘నాకు ఎన్ని సీన్లు ఉంటాయి?. చిత్రీకరించాక అవి తీసెయ్యరు కదా?’ అన్నా (నవ్వుతూ). ఒకరకంగా ఇందులోని వెంకటలక్ష్మీ పాత్ర కోసం బాగానే కష్టపడ్డా. చిత్రీకరణకు ముందే ఆ పాత్ర ఎలా ఉండాలి? ఎలా కనిపిస్తే బాగుంటుంది? అన్నది నా నుంచే తెలుసుకోని దర్శకుడు ఆ పాత్రను తీర్చిదిద్దారు. కథ మొత్తం నా చుట్టూనే తిరిగినా మా మూడు పాత్రలకు ఎంతో ప్రాధాన్యముంది. చిత్ర ముగింపులో వచ్చిన సర్‌ప్రైజ్‌లు చూసి నా స్నేహితులు కూడా షాకయ్యారు’’.


* గ్లామర్‌ పాత్రలతో ఎవరూ రాలేదు..

‘‘తెలుగులో నాకిది మూడో చిత్రం. తమిళ్‌లోనూ మూడు చేశా. కానీ, ఇప్పటి వరకు గ్లామర్‌ పాత్రలతో ఎవరూ నన్ను సంప్రదించలే. ఒకవేళ వస్తే చెయ్యడానికి సిద్ధమే. ఇప్పటికైతే నాకు గ్లామర్‌ రోల్స్‌ అంతగా నప్పవేమో అనిపిస్తోంది. నన్ను చిన్నప్పుటి నుంచి బాలనటిగా చూశారు కాబట్టి ఒకవేళ నేనలాంటి పాత్రలు చేసినా ‘ఈ అమ్మాయికి ఇలాంటి పాత్రలిచ్చేరేంటి’ అని ప్రేక్షకులు అనుకుంటారేమో (నవ్వుతూ). నిజానికి బాల నటిగా ఉన్నప్పటి కంటే ఇప్పుడు కథానాయిక అయ్యాకే నాపై బాధ్యత పెరిగినట్లనిపించింది. అప్పుడంటే ఏది పడితే అది తినేసి ఎక్కడ పడితే అక్కడ కూర్చునే వాళ్లం. ఇప్పుడేం చేసినా అందంగా కనిపించడం చాలా ముఖ్యం. కాబట్టి అలాంటివి చెయ్యలేం’’.



* అందుకే సినిమాలకు బ్రేక్‌ ఇచ్చా..

‘‘బాల నటిగా బిజీగా ఉన్నప్పుడే సినిమాల నుంచి తాత్కాలిక విరామం తీసుకున్నా. నిజానికిది మా పెద్దవాళ్ల నిర్ణయం. ఎంత సినిమాలు చేసినా ఎంతో కొంత చదువు కచ్చితంగా ఉండాలన్నారు. వాళ్ల నిర్ణయం ప్రకారమే ఇంజినీరింగ్‌ పూర్తి చేసి మళ్లీ సినిమాల్లోకి వచ్చా. నేను పుట్టి పెరిగింది అంతా హైదరాబాద్‌లోనే. ప్రస్తుతం తమిళ్‌లో ఓ సినిమా చెయ్యబోతున్నా. వచ్చే నెలలో పారిస్‌లో చిత్రీకరణ మొదలవ్వాల్సి ఉంది. కరోనా ప్రభావం వల్ల ఆ షెడ్యూల్‌ వాయిదా వేశారు. తెలుగులో ఏ చిత్రానికి సంతకాలు చెయ్యాలేదు’’.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.