సామ్‌ రెండోసారి చేద్దామని అడిగింది
‘‘ఓ బేబీ’ లాంటి విజయవంతమైన చిత్రంలో భాగమైనందుకు ఆనందంగా ఉంది. అందునా అగ్ర కథానాయిక సమంత పక్కన నటించడం మరింత సంతోషాన్ని కలగజేసింద’’న్నారు నాగశౌర్య. నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ‘ఓ బేబీ’లో నాగశౌర్య ఓ కీలకమైన పాత్రలో కనిపించారు. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో నాగశౌర్య విలేకర్లతో ముచ్చటించారు.


*
‘మురారి’ సినిమా చూసినప్పటి నుంచీ లక్ష్మిగారితో కలసి నటించాలని ఉండేది. ఇప్పుడు ఆమె నటించిన సినిమాలో నేనూ భాగం పంచుకోవడం ఆనందంగా ఉంది. లక్ష్మి గారి బాడీలాంగ్వేజ్, నటనని పరిశీలించడం కోసం ఓరోజు సెట్‌కి వెళ్లి పరిశీలించింది సమంత. ఆ తరవాతే.. తాను షూటింగ్‌లో పాల్గొంది. సమంత శ్రద్ధకు అదే నిదర్శనం. మామూలుగానే నాకు సిగ్గు ఎక్కువ. సన్నివేశాల చిత్రీకరణప్పుడు తనెంతగానో ప్రోత్సహించారు. మా ఇద్దరి మధ్య ఆసక్తికరమైన సన్నివేశం ఒకటి ఉంది. తను చెప్పిన సంభాషణకి నవ్వాపుకోలేక తాగేవాటిని తనపైనే ఉమ్మేసే సన్నివేశం అది. దీన్ని ఒకే టేక్‌లో చేద్దామనుకున్నాను. ఒక టేక్‌లోనే ఓ.కే అయింది. కానీ ఆ సన్నివేశం మరింత సహజంగా ఉండాలనే తపనతో ‘మనం రెండోసారి చేద్దాం’ అని అడిగారామె. సమంత ఏకాగ్రత, కథని పండించడానికి సమంత చూపే తపనకు ఆ సందర్భం అద్దం పట్టింది. ముందు నన్ను అతిథి పాత్రకోసమే తీసుకున్నారు. తర్వాత నా పాత్ర పరిధిని ఇంకొంచెం పెంచారు’’.


*
‘‘ప్రేక్షకులు సహజత్వాన్ని ఇష్టపడుతున్నారు. ‘అశ్వత్థామ’ చిత్రంలోని పధ్నాలుగు నిమిషాలుండే సన్నివేశంలో డూప్‌ లేకుండా నటించే ప్రయత్నం చేశా. కాలికి దెబ్బని తగిలించుకున్నాను. దాంతో విశ్రాంతి తీసుకోవాల్సివచ్చింది. ప్రస్తుతం మూడు సినిమాలు చిత్రీకరణలో ఉన్నాయి. అవసరాల శ్రీనివాస్‌ దర్శకత్వంలో ‘పలానా అబ్బాయి పలానా అమ్మాయి’. సంతోష్‌ దర్శకత్వంలో ‘పార్థు’లలో నటిస్తున్నా’’.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.