‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ వాయిదా.. పవన్‌ రీ ఎంట్రీ.. చరణ్‌ క్లారిటీ!!
రామ్‌చరణ్‌ ఎదురైతే చాలా ప్రశ్నలు, సందేహాలు మొదలవుతాయి.
‘సైరా’ ఫలితం గురించి, ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ సంగతుల గురించీ, ఈ మధ్య ఉపాసన చేసిన ట్వీట్‌ గురించీ, కొరటాల శివతో చేస్తున్న సినిమా గురించీ చాలా విషయాలు అడగాలనిఅనిపిస్తుంది. ఈ ప్రశ్నలన్నింటికీ రామ్‌చరణ్‌ సమాధానాలు చెప్పారు. ‘సైరా’ మంచి విజయాన్ని అందుకున్న నేపథ్యంలో రామ్‌చరణ్‌ ‘ఈనాడు & సితార.నెట్‌’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..


ఓ నిర్మాతగా ‘సైరా’ ఫలితం మీకెలాంటి సంతృప్తినిచ్చింది?
రామ్‌చరణ్‌: నా బ్యానర్‌లో రెండో చిత్రంతోనే ఇంత మంచి సబ్జెక్ట్‌తో ఇంతటి భారీ ప్రాజెక్టును విజయవంతంగా చేయడం మా అందరికీ గర్వకారణంగా అనిపిస్తుంది. ముఖ్యంగా నాన్న ఇప్పటి వరకు ఎన్నో గొప్ప చిత్రాల్లో నటించారు. ‘ఖైదీ’, ‘ఘరానా మొగుడు’, ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ వంటి చిత్రాల్లో మైలురాళ్ల లాంటి పాత్రలు చేశారు. కానీ, తొలిసారి ఇంత పెద్ద క్యాస్ట్యూమ్‌ డ్రామా చేశారు. దానికి తోడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి లాంటి గౌరవప్రదమైన విప్లవ వీరుడి పాత్రను చేయడం, మా కొణిదెల ప్రొడక్షన్స్‌లో ఇంతటి గొప్ప చిత్రాన్ని నిర్మించడం మాకు గొప్ప సంతృప్తిని అందిస్తున్నాయి.

చిత్ర వసూళ్లను అధికారికంగా ప్రకటించనని గతంలోనే చెప్పారు. అయితే మీరనుకున్న స్థాయి వసూళ్లను రాబట్టగలిగాం అనుకుంటున్నారా?
రామ్‌చరణ్‌: నిజానికి నేనిప్పటి వరకు ఎంత వసూళ్లొచ్చాయి అని ఎవరినీ అడగలేదు. చిరంజీవి చిత్రాలు అనగానే డ్యాన్స్‌లు, మాస్‌ ఎలిమెంట్స్‌, మేనరిజమ్స్‌ ఇలా పేక్షకులు ఎన్నో ఆశిస్తారు. కానీ, ‘సైరా’ కోసం నాన్న అవన్నీ పక్కకు పెట్టి నిజాయితీగా ఆ పాత్ర చేయడానికి సిద్ధపడ్డారు. ఇదొక పెద్ద ఛాలెంజ్‌. సినిమా తొలి నిమిషం నుంచి ముగింపు వరకు దేశభక్తి మాత్రమే ఉంటుంది. ఇంత నిజాయితీగా చేసిన మా ప్రయత్నానికి ‘రంగస్థలం’ దాటి ‘బాహుబలి’కి దగ్గరగా వసూళ్లు రాబట్టింది. దసరా సెలవులతో పాటు అదనంగా మరిన్ని ప్రభుత్వ సెలవులు రావడం కూడా చిత్రానికి చక్కగా కలిసొచ్చింది. ఇంత పెద్ద విజయం ప్రేక్షకుల ఆదరణ వల్లే సాధ్యమైంది. ఓ మంచి కథతో మేం చేసిన ఈ నిజాయితీ ప్రయత్నాన్ని వాళ్లు రెండు చేతులతో ఆశీర్వదించారు. అందుకే దీన్ని వాళ్ల విజయంగానే భావిస్తా.

ఈ చిత్ర నిర్మాణంలో మీకెదురైన సవాళ్లేంటి?

రామ్‌చరణ్‌: బడ్జెట్‌ పెద్ద సవాల్‌. మా బ్యానర్‌లో ఇది రెండో చిత్రమే. ‘ఖైదీ నెం. 150’ని చేసినా.. దాన్ని మేం అనుకున్న బడ్జెట్‌లో చాలా సింపుల్‌గా చేసేయగలిగాం. కానీ, ఇదలా కాదు. ఇంత పెద్ద కాస్ట్యూమ్‌ డ్రామా ప్రాజెక్టును ఇతర నిర్మాతలెవరైనా మొదలు పెట్టుంటే ఒక షెడ్యూల్‌ పూర్తిగానే ఆపేసేవారు. ఇది నాన్న కలల సినిమా. అందుకే దీనిపై ఎలాంటి మచ్చ పడకూడదనే ఉద్దేశంతో కష్టమైనా మేమే చేశాం. 400 మంది జూనియర్‌ ఆర్టిస్టులు, వాళ్ల కోసం వేల సంఖ్యలో క్యాస్ట్యూమ్స్‌ రెడీ చేయడం, ఇంత మందినీ కో-ఆర్డినేట్‌ చేసుకుంటూ ముందుకెళ్లడం, అన్నింటికీ మించి ఈ వయసులో నాన్నతో ఇలాంటి సాహసోపేతమైన పాత్రను చేయించడం ప్రతిదీ సవాల్‌గానే నిలిచాయి.

‘సైరా’ క్లైమాక్స్‌లో చిరు ఉరి సన్నివేశం ప్రతి ఒక్కరితో కంటతడి పెట్టించింది. ఆ సీన్‌ను నాన్న చేస్తున్నప్పుడు సెట్స్‌లో మీరెలా ఫీలయ్యారు?
రామ్‌చరణ్‌: వాస్తవానికి నాన్న ఆ సీన్‌ చేస్తున్నప్పుడు నేను ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ సెట్స్‌లో ఉన్నాను. కానీ, తెరపై చూసినప్పుడు మాత్రం కళ్ల వెంట నీళ్లు ఆగలేదు. అలా తల తెగి ఉన్న ఆయన్ని అసలు చూడలేకపోయాం. నిజానికి ఈ సీన్‌ను ఎలా చేయాలి అని నిర్ణయించుకోవడానికి మాకు రెండు నెలల సమయం పట్టింది. ఉయ్యాలవాడ నిజ జీవితంలో ఆయన్ని ఉరి తీసి 30ఏళ్ల పాటు ఆ తలను కోట గుమ్మానికి వేలాడదీశారు. దాన్ని అదే విధంగా తెరకెక్కించాలా? లేక ఉరి సీన్‌తో ఆపి అక్కడి నుంచి దేశభక్తి నేపథ్యమైన వాయిస్‌ ఓవర్‌తో ముగింపు టైటిల్స్‌ వేయాలా? అని రకరకాల ఆలోచనలు చేశాం. చిత్ర బృందంతో అనేక చర్చలు జరిపి చివరకు ఆ సీన్‌ను అలాగే యథాతథంగా తీయాలని నిర్ణయించుకున్నాం. కాకపోతే ప్రేక్షకులు కూడా ఎక్కడా బాధ పడకూడదనుకునే ఉద్దేశంతో కాస్త స్వేచ్ఛ తీసుకొని ఆ సీన్‌ పూర్తి చేశాం.

‘సైరా’ క్లైమాక్స్‌లో చిరు ఉరి సన్నివేశం ప్రతి ఒక్కరితో కంటతడి పెట్టించింది. ఆ సీన్‌ను నాన్న చేస్తున్నప్పుడు సెట్స్‌లో మీరెలా ఫీలయ్యారు?
రామ్‌చరణ్‌: వాస్తవానికి నాన్న ఆ సీన్‌ చేస్తున్నప్పుడు నేను ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ సెట్స్‌లో ఉన్నాను. కానీ, తెరపై చూసినప్పుడు మాత్రం కళ్ల వెంట నీళ్లు ఆగలేదు. అలా తల తెగి ఉన్న ఆయన్ని అసలు చూడలేకపోయాం. నిజానికి ఈ సీన్‌ను ఎలా చేయాలి అని నిర్ణయించుకోవడానికి మాకు రెండు నెలల సమయం పట్టింది. ఉయ్యాలవాడ నిజ జీవితంలో ఆయన్ని ఉరి తీసి 30ఏళ్ల పాటు ఆ తలను కోట గుమ్మానికి వేలాడదీశారు. దాన్ని అదే విధంగా తెరకెక్కించాలా? లేక ఉరి సీన్‌తో ఆపి అక్కడి నుంచి దేశభక్తి నేపథ్యమైన వాయిస్‌ ఓవర్‌తో ముగింపు టైటిల్స్‌ వేయాలా? అని రకరకాల ఆలోచనలు చేశాం. చిత్ర బృందంతో అనేక చర్చలు జరిపి చివరకు ఆ సీన్‌ను అలాగే యథాతథంగా తీయాలని నిర్ణయించుకున్నాం. కాకపోతే ప్రేక్షకులు కూడా ఎక్కడా బాధ పడకూడదనుకునే ఉద్దేశంతో కాస్త స్వేచ్ఛ తీసుకొని ఆ సీన్‌ పూర్తి చేశాం.


కొణిదెల ప్రొడక్షన్‌ బ్యానర్‌లో అన్ని నాన్నగారితోనే చేయాలని నిర్ణయించుకున్నారా?
రామ్‌చరణ్‌: నిజానికి కొణిదెల ప్రొడక్షన్‌ అన్నది నాన్న ఆలోచనల నుంచి పుట్టిందే తప్ప నాది కాదు. నేనెప్పుడూ నిర్మాతను అవుతానని అనుకోలేదు. నాకు ప్రొడక్షన్‌ వ్యవహారాలపై అంతగా ఆసక్తీ లేదు. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే నాన్న డ్రీమ్‌ ప్రాజెక్టు కోసం పెట్టింది ఇది. ఆయన అన్ని సినిమాలకీ నేనే నిర్మాతగా ఉండాలనీ అనుకోవట్లేదు. అందుకే కొరటాల ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను మ్యాట్నీ నిరంజన్‌ రెడ్డికే అప్పజెప్పా. కేవలం నేను ఓ చిన్న నిర్మాణ భాగస్వామిని మాత్రమే.

‘సైరా’ చిత్రంలో ఏదైనా పాత్ర పవన్‌ కల్యాణ్‌తో చేయిస్తే బాగుండని మీకేమైనా అనిపించిందా?
రామ్‌చరణ్‌: లేదు. బాబాయ్‌కి ఏదైనా పాత్ర ఇస్తే అది ఆయన స్థాయికి తగ్గట్లుగా ఉండాలి. అలాంటి పాత్ర ‘సైరా’లో లేదు. కాకపోతే ముందు నుంచే ఈ చిత్రానికి పవన్‌ బాబాయ్‌తో వాయిస్‌ ఓవర్‌ ఇప్పించాలని నిర్ణయించుకున్నాం. బిగ్‌బి గారిది చిన్న పాత్రైనా నాన్నకు గురువు కాబట్టి ఆయన్ని తీసుకున్నాం. ఆయన కూడా నిడివి గురించి పట్టించుకోకుండా పెద్ద మనసుతో ఆ పాత్రను చేశారు. నిజంగా ఆయన గొప్పతనమిది. ఇది చిరు - అమితాబ్‌ల స్నేహ బంధానికి ప్రతీక. ఆయన ఆరోగ్య కారణాల వల్ల ప్రచార కార్యక్రమాలకు హాజరు కాలేకపోయినా.. సినిమా చూసి మమ్మల్ని అభినందిస్తూ ఓ ప్రత్యేక సందేశం పంపించారు.

‘చిరు 152’, ‘లూసిఫర్‌’ చిత్రాల్లో మీరు నాన్నగారితో తెర పంచుకోబోతున్నారట?
రామ్‌చరణ్‌: వాస్తవం కాదు. ప్రస్తుతం నాన్న కొరటాల, త్రివిక్రమ్‌ల కథలు వింటున్నారు. అందులో నాకు సరిపోయే పాత్ర ఏమైనా ఉందో? లేదో? నాకైతే తెలియదు. కొరటాల కూడా నాకింత వరకు ఏం చెప్పలేదు. అవన్నీ నాన్న సినిమాలు. ఆయన నేను ఫలానా దాంట్లో ఉంటే బాగుంటుందని నిర్ణయించుకుంటే కచ్చితంగా చేస్తా. ఇక ‘లూసిఫర్‌’ విషయానికొస్తే.. హక్కులు కొన్న మాట వాస్తవం. అందులోనూ నేను లేను. ఈ చిత్రాన్ని ఎవరు తెరకెక్కించబోతున్నారన్నది త్వరలో తెలియజేస్తాం.


నిజానికి చిరు కలల ప్రాజెక్టు ‘భగత్‌ సింగ్‌’. భవిష్యత్తులో ఆ పాత్రను మీరు చేసే అవకాశముందా?

రామ్‌చరణ్‌: కచ్చితంగా. నిజంగా అలాంటి గొప్ప పోరాట యోధుడి కథతో వస్తే ఏ హీరో కాదంటారు చెప్పండి. భవిష్యత్తులో ఆయన కథ నా దగ్గరకొస్తే నేను అసలు వదులుకోను.

‘నా బయోపిక్‌లో చరణ్‌ వద్దు’ అని నాన్న చెప్పారు. మీకైతే చెయ్యాలని ఉందా?
రామ్‌చరణ్‌: నాన్న పాత చిత్రాలను రీమేక్‌ చేయడానికే నేను సాహసించను. అలాంటిది ఆయన పాత్రను చేయడమంటే అసలు జరగని పని. నేను ఆయన పాత్రను చేయడం కూడా నాకు కరెక్ట్‌గా అనిపించదు. ఎందుకంటే చిరు బయోపిక్‌ అంటే అందులో చరణ్‌ కూడా ఉంటాడు. కాబట్టి నాన్న పాత్రను నేను చేస్తే నా పాత్రను ఎవరు చేయాలి. ఒకవేళ చేసినా నేను నాలో చరణ్‌ను చూసుకోవాలా? నాన్నలా ఉండాలా? చరణ్‌తోనే సీన్‌ ఉన్నప్పుడు నన్ను నేను ఎలా చూసుకోవాలి? ఇదంతా ఓ కన్ఫ్యూజింగ్‌గా అనిపించే కాన్సెప్ట్‌. అందుకే ఆయన బయోపిక్‌ నేను చేయడం సరైన నిర్ణయం కాదనే అనుకుంటా.

‘సైరా’లా మీకూ ఏదైనా డ్రీమ్‌ ప్రాజెక్టు ఉందా?
రామ్‌చరణ్‌: నాకు మంచి స్పోర్ట్స్‌ డ్రామా చేయాలనుంది. నిజానికి ఒకప్పుడు ఆర్‌.బి.చౌదరితో నేను ‘మెరుపు’ అనే స్పోర్ట్స్‌ సబ్జెక్ట్‌ మొదలుపెట్టా. కానీ, అనుకోని కారణాల వల్ల అది ఆగిపోయింది. ఆ తర్వాత మళ్లీ అలాంటి ప్రాజెక్టు రాలేదు. ఈ మధ్య నా మనసుకు నచ్చిన స్పోర్ట్స్‌ జోనర్‌ చిత్రాల్లో ‘జెర్సీ’ బాగా నచ్చింది. నిజానికి అది తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంతో సాగే కథ. దాన్ని ఎంతో చక్కగా క్రికెట్‌ ఆటతో ముడిపెట్టారు. ‘ధృవ’లో ఓ పాటలో ఇలాంటి ప్రయత్నం చేశా. కానీ, పూర్తిస్థాయిలో ఓ భావోద్వేగభరిత స్పోర్ట్స్‌ డ్రామాను చేయాలనుంది.

పవన్‌ కల్యాణ్‌ రీఎంట్రీపై వార్తలొస్తున్నాయి. మీ ప్రొడక్షన్‌లో ఆయనతో ఏదైనా సినిమా చేయాలనుకుంటున్నారా?
రామ్‌చరణ్‌: పవన్‌ బాబాయ్‌ ప్రస్తుతానికి ఏ చిత్రాన్ని అంగీకరించలేదు. కానీ, రకరకాల కథలు వింటున్నారు. మరి ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. నాకూ బాబాయ్‌తో సినిమా చేయడం కన్నా.. ఆయన ప్రొడక్షన్‌లో నటించడమంటే చాలా ఇష్టం. వచ్చే ఎన్నికల లోపు బాబాయ్‌ నాకలాంటి అవకాశం కల్పిస్తారో? లేదో? వేచి చూడాలి.


అకీరాను మీ బ్యానర్‌లో తెరకు పరిచయం చేస్తానని పవన్‌కు మాటిచ్చినట్లు వార్తలొచ్చాయి. నిజమేనా?

రామ్‌చరణ్‌: నిజానికి బాబాయ్‌కి నాకు మధ్య ఇలాంటి చర్చలు ఏం జరగలేదు. కానీ, అకీరాను మా బ్యానర్‌లో పరిచయం చేయాల్సి వస్తే అంతకంటే సంతోషకరమైన విషయం మరొకటి ఏముంటుంది. వాడు ఎప్పుడు సినిమాల్లోకి వస్తానంటే మేము అప్పుడు రెడీ.

‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ చిత్రీకరణ ఆగి ఆగి నడుస్తోందని, సినిమా వాయిదా పడే అవకాశాలున్నాయని వార్తలొస్తున్నాయి?
రామ్‌చరణ్‌: అలాంటిదేం లేదు. చిత్రీకరణ ముందుగా అనుకున్న షెడ్యూల్స్‌ ప్రకారమే నడుస్తోంది. చిత్రీకరణ ఎంత వరకు వచ్చింది కచ్చితంగా చెప్పలేం కానీ, ఎన్టీఆర్‌తో పాటు నా పాత్ర చిత్రీకరణ కూడా సరిసమానంగా సాగుతోంది. అనుకున్న సమయానికే ప్రేక్షకుల ముందుకొస్తుంది.


దీపావళి పండగను చిన్నప్పుడు ఎలా జరుపుకొన్నారు? ఇప్పుడెలా నిర్వహించుకోబోతున్నారు?

రామ్‌చరణ్‌: దీపావళిని నేనంత ఎంజాయ్‌ చేయలేను. టపాసులు కాల్చడం వంటివి అంతగా నచ్చదు. ఏదైనా పండగ వస్తుందంటే మాత్రం ఇంట్లో అందరం ఒక దగ్గర కలుస్తామన్న ఆనందం ఎక్కువగా ఉంటుంది.

మోదీకి ట్వీట్‌ చేసినట్లు ఉపాసన తర్వాత చెప్పింది..
‘‘నిజానికి ఇలాంటి ఇష్యూలపై నటీనటులు మాట్లాడటం కన్నా.. ‘మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌’ (మా) వాళ్లు కానీ, సమాజంలోని పెద్ద వ్యక్తులు మాట్లాడటమే సరైనది. ఉపాసన ప్రధాని మోదీ గారిని ఎక్కడా విమర్శించే విధంగా ట్వీట్‌ చేయలేదు. చాలా గౌరవపూర్వకంగా తన ఆవేదనను వ్యక్తం చేసింది. దీన్ని ఖుష్బూ గారు దీన్ని మరో స్థాయికి తీసుకెళ్లారు. నిజానికి ఉపాసన ట్వీట్‌ చేసిన సంగతి నాకు ఎప్పటికో తెలిసింది. దీనిపై తనని అడగ్గా.. ‘మోదీకి ట్వీట్‌ చేస్తున్నట్లు చెబితే నువ్వు వద్దంటానని.. చెప్పకుండా చేశా’’అని చెప్పింది. ఇదంతా తన ఆలోచనే’’.
కొరటాలతో సినిమా ఉంది..
‘‘నిజానికి కొరటాల శివతో సినిమా చేయాలని ఎప్పుడో నిర్ణయించుకున్నాం. మధ్యలో ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ రావడం వల్ల డేట్లు కుదరలేదు. ముందుగా ఆయనకిచ్చిన డేట్లతోనే ‘చిరు 152’ మొదలుపెట్టాం. శివకి కూడా నాన్నతో సినిమా చేయాలని బలంగా ఉండటం.. ఆయన కూడా నాకు చిరు సర్‌తో చేయాలనుందని చెప్పడంతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కింది. ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ పూర్తయిన వెంటనే శివకు డేట్లు ఇస్తానని చెప్పా’’.

- మందలపర్తి రాజేశ్‌ శర్మ, ఈనాడు డిజిటల్‌Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.