ఆ పాత్రల్లో చూడటం మా వాళ్లకు ఇబ్బందిగానే ఉంటుంది..
పాయల్‌ రాజ్‌పుత్‌... ఇప్పుడీ పేరు తలచుకుంటే చాలు కుర్రాళ్ల గుండెల్లో ఓ అలజడి... ఆమె ఓ చూపు చూస్తే చాలు గుండెల్లో వంద ఆర్డీఎక్స్‌లు ఒక్కసారిగా పేలుతాయి. ‘ఆర్‌.ఎక్స్‌.100’ చిత్రంతో పాయల్‌ చేసిన మాయ ఇదంతా. తొలి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకుల్ని తనవైపు తిప్పుకుందీ పంజాబీ భామ. అందాల విందు చేయడమే కాదు, అభినయంతోనూ మెప్పించింది. ఇప్పుడు ‘ఆర్డీఎక్స్‌ లవ్‌’ అనే చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలో ఆమెను ‘హాయ్‌’ పలకరించగా ఆసక్తికర విషయాలు పంచుకుంది.


*
అందరూ ‘ఆర్‌ఎక్స్‌ 100’తో మీరు ఓవర్‌నైట్‌ స్టార్‌ అయిపోయారు కదా అంటుంటారు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఆ సినిమాతో వచ్చిన స్టార్‌డమ్‌ వెనుక నా ఆరేళ్ల కష్టముంది. రూ.లక్ష చేతిలో పట్టుకుని సినీ అవకాశాలు వెతుక్కుంటూ తొలిసారి ముంబయిలో అడుగుపెట్టా. ఆ డబ్బు సంపాదించడం కోసం ఏడాది కష్టపడ్డా. ఎన్నో ప్రకటనల్లో నటించా. పలు వేదికలపై వ్యాఖ్యాతగా పనిచేశా. అలా నన్ను నేను నిరూపించుకునేందుకు సిద్ధమయ్యా. తెలుగు, తమిళ చిత్రసీమల్లో ఎన్నో ఆడిషన్లకు హాజరయ్యా. ప్రతిచోటా నాకు తిరస్కారాలే ఎదురయ్యాయి. కొందరు నా ముఖం దక్షిణాది చిత్రాలకు పనికిరాదనే చెప్పేవారు. చివరికి ‘ఆర్‌ఎక్స్‌ 100’ చేసే ఛాన్స్‌ దొరికింది.

*
నాకు వినోద ప్రపంచం కొత్తేమీ కాదు. నాలుగేళ్లకే ముఖానికి రంగేసుకొన్నా. పలు పంజాబీ సీరియళ్లలో నటించా. ఫిల్మ్‌ఫేర్‌ పురస్కారమూ అందుకొన్నా. మా అమ్మకి యాంకరింగ్‌ అంటే చాలా ఇష్టం. ఆ ఆసక్తి నన్ను బాలనటిగా చేసింది. మాది పంజాబీ కుటుంబమైనా నేను పుట్టి పెరిగిందంతా దిల్లీలోనే. అమ్మా నాన్న ఇద్దరూ టీచర్లే.

*
బుల్లితెరతో ఉన్న అనుబంధం వల్ల జర్నలిజంలో డిగ్రీ పూర్తి చేశాక యాంకరింగ్‌ చేశా. కాలేజీ రోజుల్లోనే మోడలింగ్‌లో అడుగుపెట్టా. ఆ తర్వాతే సినిమాల్లో నటించాలనే ఆశ పెరిగింది.

*
కొన్ని కథలు విన్నప్పుడు ఇవి చేస్తే నేనే చేయాలని మనసుకు అనిపిస్తుంటుంది. ‘ఆర్‌ఎక్స్‌ 100’, ‘ఆర్డీఎక్స్‌ లవ్‌’ చిత్రాల్లో ఉన్నంత బోల్డ్‌ పాత్రలు నేను తప్ప మరెవ్వరూ చేయలేరన్నది నా అభిప్రాయం. అయితే ఆ ఘాటుతనం అనేది స్క్రిప్ట్‌లో ఉందేమో తప్ప... నాలో కాదు. కథలో పాత్రకు తగ్గట్లుగా నేను కనిపిస్తుంటా అంతే. మీరు నమ్ముతారో లేదో.. ఇప్పటికీ నేను ఏదైనా స్క్రిప్ట్‌ వింటే అందులోని విషయాలన్నీ మా అమ్మతో పంచుకుంటా. ఇన్ని ముద్దు సీన్లు ఉన్నాయి, ఇలాంటి రొమాంటిక్‌ సన్నివేశాలు ఉంటాయని చెబుతుంటా. నీ మనసుకు నచ్చి, నీకు సౌకర్యంగా అనిపిస్తే ఏదైనా చెయ్యి అని సలహా ఇస్తుంటుంది. ‘ఆర్‌ఎక్స్‌ 100’ సినిమాతో వచ్చిన డబ్బుతో ముంబయిలో ఓ ఇల్లు కొనుకున్నా. ఆ ఇంటిపైన ‘ఆర్‌ఎక్స్‌ 100’కు గుర్తుగా ఓ బైక్‌ కూడా పెట్టుకున్నా.


* బోల్డ్‌ పాత్రలు ఎంత ఇష్టపడి చేసినా.. అమ్మానాన్నలతో కలిసి చూడటం అసౌకర్యంగానే అనిపిస్తుంది. వాళ్లకీ నన్నలా చూడటం ఇబ్బందిగానే అనిపించొచ్చు కానీ, ఎప్పుడూ బయటకి చెప్పరు. ‘ఆర్డీఎక్స్‌ లవ్‌’ను మా ఫ్యామిలీతో చూస్తా. ప్రస్తుతం ‘వెంకీమామ’, ‘డిస్కోరాజా’తోపాటు, మరో కొత్త చిత్రంలో నటిస్తున్నా.

*
నా దృష్టిలో ప్రేమ ఓ అందమైన అనుభూతి. ప్రతి ఒక్కరూ జీవితంలో ఏదోక దశలో ప్రేమలో పడే ఉంటారు. నేను మూడో తరగతిలో ఉన్నప్పుడు తొలిసారి ప్రేమలో పడ్డా. ఆ అబ్బాయి పేరు చెప్పను. ఆ అబ్బాయి చాలా అందంగా ఉండేవాడు. దూరం నుంచే చూసి ఇష్టపడేదాన్ని. ఎప్పుడూ మాట్లాడలేదు. పన్నెండో తరగతి వరకు ఇద్దరం కలిసే చదువుకున్నాం. కానీ, ఎప్పుడూ ఆ విషయంలో బయటపడలేదు. ఇక ప్రస్తుతానికైతే ప్రేమించేంత తీరిక లేదు.

*
నన్ను చేసుకోబోయే వాడు అందంగా ఉండాలి, ఇంత ఎత్తుండాలనేమీ చెప్పను. నాకు తగ్గట్టుగా ఉంటే చాలు. హాస్య చతురత మాత్రం తప్పనిసరి. నేనే విషయంలోనైనా అలిగితే నన్ను బుజ్జగించాలి. భవిష్యత్తులో కచ్చితంగా ప్రేమ పెళ్లి చేసుకుంటా. చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తిని మాత్రం అస్సలు చేసుకోను.


*
ఒక నవతరం అమ్మాయి ఎలా గడుపుతుందో ఇంట్లో నేనూ అంతే. సమయం దొరికిందంటే టీవీ చూస్తూనో లేదంటే, ఇష్టమైన పని చేస్తూనే గడుపుతుంటా. కానీ చాలాసార్లు మా తమ్ముడు గుర్తుకొస్తుంటాడు. తను 23 యేళ్ల వయసులో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అనారోగ్య కారణాలు, కొన్ని వ్యక్తిగత కారణాలతో తను ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడు. పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాం. కానీ తన జాడ ఇప్పటిదాకా దొరకలేదు. వాడు నాకు తమ్ముడు మాత్రమే కాదు, ఒక స్నేహితుడిలాగా ఉండేవాడు.

* మాది ఉమ్మడి కుటుంబం కావడంతో ప్రతి పండగ మా ఇంట్లో ఒక పెద్ద సంబరంలా జరుగుతుంది. ముఖ్యంగా దసరా, దీపావళి లాంటి పండగలు మరింత ప్రత్యేకంగా చేస్తారు. నాకు ఖాళీ దొరికితే చాలు అమ్మతో కలిసి వంట గదిలో దూరిపోతా. నాకు అన్ని వంటలూ వచ్చు. ముఖ్యంగా పంజాబీ వంటకాలు అదరగొట్టేస్తా. ప్రస్తుతం మాంసాహారం తినడం మానేశా.

- మందలపర్తి రాజేష్‌శర్మ,

ఫొటో : మధు


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.