ఆ తొమ్మిది రోజులు ఉదయం పూట భజన చేస్తా..!
హెగ్డే అందం గురించి వర్ణించడానికి ... త్రివిక్రమ్‌కి కూడా మాటలు రాలేదేమో! ‘మేడమ్‌ సర్‌.. మేడమ్‌ అంతే...’ అని రాసేశారు. పొడుగుకాళ్లతో... ముద్దు ముద్దు మాటలతో అమూల్యగా అలరించింది పూజ, ‘అల.. వైకుంఠపురములో’ చిత్రంతో. అల్లు అర్జున్‌తో కలిసి పూజ చేసిన రెండో చిత్రమిది. ఈ సందర్భంగా పూజా హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ...


* ఈ సినిమా చేయడానికి ప్రధాన కారణమేమిటి?
- త్రివిక్రమ్‌ సిద్ధం చేసిన కథే కారణం. వింటున్నంతసేపూ నవ్వుతూనే ఉన్నా. సున్నితంగా హృదయాల్ని స్పృశించే సినిమా ఇది. బన్నీకి బాస్‌గా కనిపించే పాత్ర మీది అన్నారు. కథానాయకుడు నా కాళ్ల వంక చూస్తుంటే... తలపైన బరువు ఉంటే కిందకి చూడలేవు అంటూ సున్నితంగానే ఒక పెద్ద పాఠం చెబుతుంది. తన ఆలోచనల్ని మార్చేస్తుంది.

* కథానాయకుడు అదే పనిగా కాళ్లని చూసే సన్నివేశాల గురించి చెప్పినప్పుడు మీ మనసులో తట్టిన ఆలోచనలేమిటి?
- తెరపై కనిపించినట్టుగా... నా కాళ్లని చూసే ప్రతి అబ్బాయికీ అలా పాఠం చెబుతూ కూర్చోలేను (నవ్వుతూ). అలా చేస్తే నా పని చేసుకోవడానికి సమయమే దొరకదు. సినిమాలో ప్రతి సన్నివేశానికీ ఓ కారణం ఉంటుంది. ఇందులో ప్రేమకథైనా, రొమాంటిక్‌ సన్నివేశాలైనా, పాటలైనా... కవితాత్మకంగా కనిపిస్తాయి. సామజవరగమన.. పాట కూడా నా నడక ఎలా ఉందో చెబుతుంది కానీ, నా కాళ్లు ఎలాంటి ఆకారంలో ఉన్నాయని చెప్పదు.

* అల్లు అర్జున్, త్రివిక్రమ్‌తో కలిసి మరోసారి పనిచేయడం ఎలాంటి అనుభవాన్నిచ్చింది?
- అల్లు అర్జున్‌ పనితీరుకి నేను పెద్ద అభిమానిని. ‘డీజే’లో ఆయనకీ, నాకూ మధ్య కెమిస్ట్రీ బాగుందన్నారు. త్రివిక్రమ్‌ సర్‌తో పనిచేయడాన్ని కూడా చాలా ఆస్వాదిస్తా. ఆయన సెట్‌లో చాలా ప్రశాంతంగా కనిపిస్తుంటారు. చిన్న విషయమైనా సరే చాలా బాగా వివరిస్తారు. సామజవరగమన పాట నేను పాడేది కాదు. కానీ అందులో ప్రతి లైన్‌ గురించ్కీచీజి వివరించి చెప్పారు. అది నేను కనిపించే విధానాన్నే మార్చేసింది. నటులకి సినిమాల ఫలితాల కంటే కూడా చిత్రీకరణ కోసం సెట్‌లో గడిపే కాలమే కీలకం. ఆ ప్రయాణం ఆస్వాదించేలా ఉండాలి.

* మరోసారి మీ పాత్రకి మీరే డబ్బింగ్‌ చెప్పుకున్నారు కదా...
- ఇప్పుడు తెలుగమ్మాయి అయిపోయా కదా. తెలుగు మరింత సౌకర్యంగా మాట్లాడటానికి, అర్థం చేసుకోవడానికి డబ్బింగ్‌ చాలా ఉపయోగపడుతోంది. నేనెప్పుడూ నా పాత్రకి నేనే డబ్బింగ్‌ చెప్పాలనుకుంటా. వేరేవాళ్లు చెబితే... ప్రతి మాటనీ ఎక్కువ చేసి చెప్పినట్టు అనిపిస్తుంటుంది. దాంతో పాత్ర కాస్త ఓవర్‌ యాక్టింగ్‌ చేసినట్టు కనిపిస్తుంటుంది.

* తెలుగులో వరుసగా అవకాశాలు అందుకుంటున్నారు. ఇకపైన హిందీ సినిమాలు తగ్గిస్తారా?
- నేను ఏక కాలంలో నాలుగు సినిమాలు చేయగలను. ‘అరవింద సమేత’ సమయంలో మూడు షిఫ్టులు పనిచేశా. డబ్బింగ్‌ కోసం 5 గంటలకి లేచేదాన్ని. అప్పట్లో శ్రీదేవిలా మూడు షిఫ్టులు పనిచేస్తున్నావేంటి అని అడిగేవారు. తెలుగు, హిందీతో పాటు, తమిళ సినిమాలన్నా నాకు ఇష్టమే. నా నటనని స్వీకరించిన చోటంతా నేను నటిస్తుంటా. ఇండియన్‌ స్టార్‌ అనే గుర్తింపే నా లక్ష్యం.


* కథల విషయంలో మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి?
- వైవిధ్యమే నా బలం. ‘గద్దలకొండ గణేష్‌’లో అచ్చమైన పల్లెటూరి అమ్మాయిగా, ‘మహర్షి’లో కార్పొరేట్‌ అమ్మాయిగా భిన్నమైన పాత్రలు చేశా. ఇందులోనేమో అల్లు అర్జున్‌కి బాస్‌గా కనిపించా. రాబోయే చిత్రాలు ఇలా నాలోని కొత్త కోణాల్ని ఆవిష్కరిస్తాయి.

* కథానాయిక ప్రాధాన్యంతో కూడిన కథలేమైనా వచ్చాయా? అలాంటివాటికి న్యాయం చేయగలననే నమ్మకం ఉందా?
- చేయగలనో లేదో, ఇది ఆడుతుందో లేదో అనే భయాలతో ఎప్పుడూ బతకకూడదు. ఫలితం ఎలా వచ్చినా నమ్మింది చేశానన్న తృప్తి ఉంటుంది కదా. తెలుగులో తక్కువే కానీ, హిందీలో అలాంటి కథలు ఎక్కువగా వచ్చాయి. ఒక కథ విన్నాను, ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం తెలుగులో ప్రభాస్, అఖిల్‌లతో సినిమాలు చేస్తున్నా. హిందీలోనూ రెండు సినిమాలున్నాయి.

* సంక్రాంతి... తిల్లు లడ్డూ
‘‘నేను ముంబైలో పుట్టి పెరిగా. మా ఇంట్లో దక్షిణాది వాతావరణమే. ఇక్కడి పండగలన్నింటినీ జరుపుకుంటాం. సంక్రాంతి అంటే నాకు గుర్తుకొచ్చేది తిల్లూ లడ్డూలే. మా అమ్మ ఈ పండగకి ఆ లడ్డూలు చేసి పెడుతుంటారు. గాలిపటాలతో ఆడుకున్నది తక్కువే. దసరా నవరాత్రుల్లో మా ఇంట్లో భజన ఉంటుంది. నేను ఎక్కడ ఉన్నా ఆ తొమ్మిది రోజులు ఉదయం పూట భజన చేస్తుంటా. సినిమాల వల్ల పండగల పూట ఇంటికి దూరంగా గడపాల్సి వస్తుంటుంది. కానీ వీలు దొరికినప్పుడంతా ఇంట్లో వాలిపోతుంటా’’.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.