చెప్పినట్లు చేస్తే చాలు: పూజాహెగ్డే

తెరంగేట్రం చేసింది కోలీవుడ్‌లో అయినా విజయాన్ని అందుకున్నది మాత్రం టాలీవుడ్‌లోనే. అవకాశాలను చక్కగా అందిపుచ్చుకొంటూ ముందుకెళుతోంది నటి పూజాహెగ్డే. తెలుగులో ‘ముకుంద’, ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాలు ఆమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. త్రివిక్రమ్‌ దర్శకత్వలో ఎన్టీఆర్‌ హీరోగా వచ్చిన ‘అరవింద సమేత’లో పూజ నటనకు మంచి మార్కులు పడ్డాయి. సెంటిమెంట్‌కు పెద్దపీట వేసే తెలుగు పరిశ్రమలో లక్కీగాళ్‌ పేరు సంపాదించింది. సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన ‘రంగస్థలం’ సినిమాలో ప్రత్యేక గీతంలో కనిపించి కుర్రుకారులో వేడిని రగిల్చింది. ఇప్పుడు మహేష్‌ బాబు సరసన ‘మహర్షి’లో నటిస్తోంది. ఇటీవల ఓ ముఖాముఖిలో పాల్గొందీ భామ. అక్కడ మాట్లాడుతూ ‘‘విధి అంటే ఏమిటో తెలియదు, ఇతర విషయాల పట్ల నాకంత అవగాహన లేదు వాటి గురించి ఎక్కువగా ఆలోచించలేను. సినిమాకి ఓకే చెప్పినప్పుడు ఆపాత్ర కోసం కోసం ఏం చేయాలనేది దర్శకుడు ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకొని ఉంటారు. అది కరెక్టుగా చేస్తే చాలు. నిజానికి మనం పుట్టినప్పుడే మన కర్తవ్యం ఏమిటనేని నిర్ణయించే ఉంటుంది. నేనిప్పుడు అదే చేస్తున్నాను. కాకపోతే విజయం ఐనా అపజయం ఐనా మనలో మార్పు తెచ్చేందుకు కీలకపాత్రను పోషిస్తాయి. ఆ అనుభవం నుంచి మాత్రమే పాఠం నేర్చుకోవాలి. నావరకు నేను ఎంతో అదృష్టవంతురాలినే’’ అంటోంది పూజాహెగ్డే.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.