లిప్‌లాక్‌లు లేని ఏకైక హీరోయిన్‌ నేనే
‘దర్శకుడు’, ‘రంగస్థలం’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న నటి పూజితా పొన్నాడ. ఆమె కథానాయికగా నటించిన చిత్రం ‘సెవెన్‌’. హవీష్ కథానాయకుడు. నిజార్ షఫీ దర్శకుడు. రమేష్ వర్మ నిర్మాత. రొమాంటిక్‌ థ్రిల్లర్‌గా రూపొందించిన ఈ సినిమాలో రెజీనా, నందితా శ్వేత, అనీషా ఆంబ్రోస్, త్రిధా చౌదరి, అదితి ఆర్య కూడా కథానాయికల పాత్రలు పోషించారు. జూన్‌ 5న ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో పూజిత మీడియాతో మాట్లాడారు.


* ‘సెవెన్’ టైటిల్ మిస్టరీ ఏంటి?

మరో మూడు రోజుల్లో సినిమా విడుదల అవుతుంది. అప్పటి వరకూ ఆ సస్పెన్స్ అలాగే ఉంచుదాం.

* మీ పాత్ర ఏంటి?
నాదొక సస్పెన్స్ రోల్. దీని గురించి ఎక్కువ చెప్పకూడదు. కథలో కొన్ని ప్రశ్నలకు నా పాత్ర ద్వారా సమాధానం లభిస్తుంది.

* ఇందులో మీ పాత్ర బోల్డ్ కదా?
బోల్డ్ కాదు.. ప్రత్యేకమైన పాత్ర. ‘సెవెన్’లో నా పాత్రకు మంచి ప్రేమకథ ఉంది. ఇందులో లిప్‌లాక్ సన్నివేశాలు లేని ఏకైక హీరోయిన్ నేనే అనుకుంటా.


* హవీష్‌తో నటన‌ ఎలా అనిపించింది?
హవీష్ చాలా మంచి వ్యక్తి. అతడితో పని చేయడం సులభంగా ఉంటుంది. ఈ సినిమాకు సంతకం చేయడానికి ముందే నాకు హవీష్ స్నేహితుడు.

* మీతో పాటు ఈ సినిమాలో ఆరుగురు హీరోయిన్లు ఉన్నారు. ఎంత మందితో కలిసి నటించారు?
విచిత్రం ఏంటంటే.. ఎవరికి ఎవరితోనూ సంబంధం ఉండదు. ఎవరి కథ వాళ్లది. చివర్లో అందరి కథలు కలుస్తాయి. ప్రతి ఒక్కరి కథలోనూ హవీష్ హీరో. నేను కాకుండా ఐదుగురు హీరోయిన్లు ఉన్నప్పటికీ.. వారితో ఎప్పుడూ మాట్లాడలేదు. రెజీనాతో మాత్రమే కాంబినేషన్ సీన్లు ఉన్నాయి. ఆమెతో నటించడం మంచి అనుభూతి.


* తెలుగమ్మాయిలకు అవకాశాలు ఎలా వస్తున్నాయి?
ఎవరి ప్రయాణం వారిది. ఒక హీరోయిన్ కెరీర్‌తో మ‌రో హీరోయిన్ కెరీర్‌ని పోల్చకూడ‌దు. నా వరకూ మంచి అవకాశాలు వస్తున్నాయి. దర్శక, నిర్మాతలు తెలుగమ్మాయిలు కావాలని అంటున్నారు. మా ఇంట్లో సినిమా నేపథ్యం ఉన్నవారు ఎవరూ లేరు. నటనపై ఆసక్తితో లఘు చిత్రాలు చేశా. ఇంట్లో అవి చూపిస్తే ప్రోత్సహించారు. సుకుమార్ గారు నేను నటించిన లఘు చిత్రం చూసి ‘దర్శకుడు’కి ఎంపిక చేశారు.

* మీ తదుపరి సినిమాలు?
రాజశేఖర్ గారితో నటించిన ‘కల్కి’ విడుదలకు సిద్ధమైంది. అందులో నా పాత్ర చాలా విభిన్నంగా ఉంటుంది. నేను గిరిజన యువతిగా నటిస్తున్నాను. నా పాత్రకి మంచి ట్విస్ట్ కూడా ఉంటుంది. కథ విన్నప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను. ‘కల్కి’ కాకుండా కీర్తీ సురేష్‌తో ఒక తెలుగు సినిమాలో నటిస్తున్నా. తమిళంలో ఒక సినిమాకు సంతకం చేశా.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.