చిన్నప్పుడు నన్నొక గజినీలా చూసేవారు!!
అభిమానులకు డార్లింగ్‌.. తెలుగు సినిమాకేమో బాహుబలి.. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే బుజ్జిగాడు..! ఇవన్నీ.. ప్రభాస్‌ ఏంటో చెప్పకనే చెబుతాయి. నటనతో 'ఫ్యాన్స్‌'ని సంపాదించుకున్న ఈ హీరో.. తన వ్యక్తిత్వంతో వాళ్లని 'డైహార్డ్‌ ఫ్యాన్స్‌'గా మార్చేసుకున్నాడు. కాస్త సిగ్గు, ఇంకాస్త బిడియం, కొండంత వినయం.. ఇవన్నీ ఆయనలో కనిపిస్తుంటాయి. వాటి గురించి ప్రభాస్‌ ఏమన్నాడు? ఆయన బాల్యం ఎలా గడిచింది? తన వ్యక్తిత్వంపై ప్రభావం చూపిందెవరు..? ఈ విషయాలన్నీ 'హాయ్‌'తో పంచుకున్నాడు..


*'సాహో' ప్రచారాన్ని అంతా మీరై నడిపించినట్లున్నారు?
మా వాళ్లూ అదే అంటున్నారు. శ్రద్ధాకపూర్‌ కంటే నువ్వే ఎక్కువ మాట్లాడుతున్నావ్‌ అని. నాకు మరో ఛాయిస్‌ లేదు మరి (నవ్వుతూ). మా టీమ్‌లో అందరికీ తెలిసినవాడ్ని నేనే కదా! శ్రద్ధాకపూర్‌కి మరో కమిట్‌మెంట్‌ ఉండడం వల్ల ఎక్కువ సేపు మాతో ఉండలేకపోయింది. మా ఫ్రెండ్సేమో ఈ సినిమాపై విపరీతంగా ఖర్చు పెట్టేశారు. అందుకే దానికి తగిన రీతిలో ప్రచారం చేయాల్సివచ్చింది.

* హీరోయిన్‌తో రొమాన్స్‌ చేసేటప్పుడు సిగ్గు, బిడియం పక్కన పెట్టేస్తుంటారా?
'ఈశ్వర్‌', 'రాఘవేంద్ర' సమయంలో రొమాంటిక్‌ సన్నివేశాల్లో చాలా ఇబ్బంది పడేవాడ్ని. 'అన్నీ బాగున్నాయి.. కానీ రొమాన్స్‌ సరిగా చేయడం లేదు' అని జయంత్‌ సి.పరాన్జీ నా గాలి మొత్తం తీసేశారు. 'వర్షం' యాక్షన్‌ సినిమా అయినా.. రొమాన్స్‌ ఉంటుంది. ఆ సినిమా బాగా ఆడింది. ఆ సీడీని తీసుకెళ్లి జయంత్‌గారికి చూపించా. 'సూపర్‌.. ఇరగదీశావ్‌' అని మెచ్చుకున్నారు. అక్కడి నుంచి ఆ సన్నివేశాలకూ అలవాటు పడ్డాను.

అరకొర మార్కులే
నేను యావరేజ్‌ స్టూడెంట్‌నే. అరకొర మార్కులతో పాసైపోయేవాడ్ని. స్కూలు జీవితం అస్సలు ఆస్వాదించలేకపోయాను. అంతంత సేపు క్లాసులో కూర్చోవడం ఇబ్బందిగా అనిపించేది. డ్రిల్‌ పీరియడ్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూసేవాడ్ని. అలాగని నేనేం స్పోర్ట్స్‌ పర్సన్‌ని కాదు. ఈ క్లాసులు, సబ్జెక్టుల బాధ తప్పుతుంది కదా! బాస్కెట్‌బాల్‌, వాలీబాల్‌ మాత్రం ఆడేవాడ్ని. తొమ్మిదో తరగతి, పదో తరగతి హాస్టల్‌లో ఉండి చదువుకున్నా. అప్పుడు మాత్రం బాగా ఎంజాయ్‌ చేశా. తొమ్మిదో తరగతిలో సోషల్‌ టీచర్‌ ఉండేవారు. ఆయన నన్ను చాలా ఇన్‌స్పైర్‌ చేశారు. టీచర్ల ప్రభావం నాపై కొంత ఉంది.

బంధువులే స్నేహితులు
చిన్నప్పటి నుంచి నాకు స్నేహితులు ఎక్కువ. మా కుటుంబంలో కజిన్స్‌, మామయ్య అత్తయ్య పిల్లలు అంతా కలిసి రెండొందలమంది ఉండేవారు. వేసవి సెలవులు వస్తే అంతా కలిసేవాళ్లం. వాళ్ల మధ్యే నా బాల్యం గడిచిపోయింది. ఈ గ్యాంగ్‌తోనే నాకు టైమ్‌ సరిపోయేది కాదు. అందుకే బయటి వాళ్లతో ఎక్కువగా కలిసేవాడ్ని కాదు. అది కాస్త మైనస్‌ అయ్యిందనుకుంటా. అందుకే కొత్త వ్యక్తుల ముందుకొచ్చినా, కొత్త ప్రదేశాలకు వెళ్లినా మాట్లాడటానికి కాస్త ఆలోచిస్తుంటాను.


చిన్నప్పుడు మతిమరుపు ఎక్కువ
ముఖ్యమైన విషయాలు బాగానే గుర్తుంటాయి. ఐదేళ్ల క్రితం చెప్పిన మాట కూడా గుర్తు పెట్టుకోగలను. నిజానికి చిన్నప్పుడు నన్ను నా స్నేహితులు గజినీలా చూసేవారు. పెన్ను మర్చిపోయి పరీక్షలకు వెళ్తుండేవాడ్ని. పుస్తకం ఓ చోట పెట్టుకుని మరోచోట వెదికేవాడ్ని. స్కూల్లో ఏం చెప్పినా గుర్తుండేది కాదు. ఇప్పుడు కూడా కొన్ని విషయాలు మర్చిపోతుంటాను. రోడ్డుపై నడుస్తూ ఎటు వెళ్లాలో మర్చిపోతుంటా. హైదరాబాద్‌లో ఇన్నేళ్ల నుంచీ ఉంటున్నా.. కారు తీసి ఇంటికి వెళ్లడానికి కన్‌ఫ్యూజ్‌ అయిపోతుంటా. ఈ విషయంలో ఇప్పుడు కాస్త మెరుగుపడినట్టే.

* మీరు.. మీలా ఎవరి దగ్గర ఉండగలరు?
నా స్నేహితుల దగ్గర ఓపెన్‌ అయిపోతాను. కొత్త వాళ్ల దగ్గరే కాస్త ఇబ్బంది. స్టార్టింగ్‌ ట్రబుల్‌ అంటారే అలాగన్నమాట. కాస్త పరిచయమైతే చాలు.. త్వరగా కలిసిపోతా. వినాయక్‌, రాజమౌళి నాకు మంచి స్నేహితులు. వాళ్లతో కలిసినప్పుడు నేను నాలా ఉంటా.

* హిందీ ఎలా నేర్చుకున్నారు?
నాకు హిందీ రాయడం, చదవడం వచ్చు. మాట్లాడే అవసరం, అవకాశం ఎప్పుడూ రాలేదు. సినిమాలకు మనకొచ్చిన హిందీ సరిపోదు. అందుకే ముంబయిలో ఓ మాస్టార్ని నియమించుకున్నాను. ఆయన దగ్గరే హిందీ నేర్చుకున్నా. ఆయన సెట్లోనే ఉండేవారు. హిందీ డబ్బింగ్‌కి చాలా సమయం తీసుకున్నా. నాలుగు నెలల పాటు ముక్కలు ముక్కలుగా చెబుతూనే ఉన్నా. చివరి రోజు కాస్త కష్టపడి ఎక్కువ సమయం చెప్పాల్సి వచ్చింది.

* పుస్తకాలు చదివే అలవాటు ఉందా?
ఇది వరకు బాగా చదివేవాడ్ని. ఇప్పుడు కాస్త తగ్గింది. ఐదేళ్ల నుంచీ మరీ తగ్గింది. 'బాహుబలి', 'సాహో'లాంటి సినిమాలు చేయడం వల్ల... సమయం కేటాయించలేకపోయాను. కానీ ఇప్పుడు మళ్లీ చదవాలనిపిస్తోంది.

* ఎలాంటి పుస్తకాలు చదువుతారు?
అన్ని రకాల పుస్తకాలు చదువుతా. ఎలాంటి పుస్తకం అనేది మూడ్‌ని బట్టి ఉంటుంది. సిడ్నీ షెల్డన్‌ పుస్తకాలంటే చాలా ఇష్టం. ఈమధ్య రాజమౌళి ఓ పుస్తకం ఇచ్చాడు. మనిషి వ్యక్తిత్వానికి సంబంధించిన పుస్తకమది. చాలా ఇబ్బంది పెట్టిందనుకోండి. అయితే మానసికంగా చాలా మారాను.


* పుస్తకాల్లా సినిమాలూ మీపై ప్రభావం చూపించాయా?
ఓ సినిమాలో మంచి ఎమోషన్‌ సీన్‌ చూస్తే ఉద్వేగం కలుగుతుంది. 'ఇలా నేను నటించగలనా?' అనిపిస్తుంది. ఇలాంటి కథల్ని ఎంచుకుంటే బాగుంటుంది కదా? అనుకుంటాను. కానీ కొన్ని రోజులే. తర్వాత మామూలైపోతాను. రాజ్‌కుమార్‌ హిరాణీ సినిమాలంటే నాకు చాలా ఇష్టం. ఆయన కథలన్నీ ఆలోచింపజేస్తాయి. ఈమధ్య 'దంగల్‌' సినిమా బాగా నచ్చింది.

* చూసిన సినిమానే మళ్లీ మళ్లీ చూసిన సందర్భాలున్నాయా?
వినోదాత్మక చిత్రాల్ని మళ్లీ మళ్లీ చూస్తుంటాను. అలా చూసినవాటిలో రాజేంద్రప్రసాద్‌గారి సినిమాలే ఎక్కువ. 'పోకిరి' ఎన్నిసార్లు చూసినా బోర్‌ కొట్టదు.. అలా వెళ్లిపోతూ ఉంటుంది. 'ఇడియట్‌' కూడా అంతే. ఈ జాబితాలో చాలా సినిమాలున్నాయి.

* మీ సినిమాలు మీరు చూసుకుంటూ ఉంటారా?
అస్సలు చూడను. ఎంత మంచి సినిమా చూసినా.. నాకు నేను చేసిన తప్పులే ఎక్కువగా కనిపిస్తుంటాయి. 'ఇక్కడేదో మిస్‌ అయ్యిందే' అనిపిస్తుంటుంది. 'బాహుబలి 1' థియేటర్లో ఒక్కసారే చూశా. మొన్నామధ్య హోమ్‌ థియేటర్లో చూశా. టీవీలో నా సినిమా వస్తుందంటే ఛానల్‌ మార్చేస్తుంటాను.

* మీపై చాలా వార్తలు బయటకు వస్తుంటాయి. అందులో మీ ప్రేమకథ ఒకటి. నిజానిజాలేంటో చెప్తారా..!
నిజమైతే నేనే ఒప్పుకొనేవాడ్ని. ఈ విషయంలో నేను చాలాసార్లు స్పందించా. ఆ వార్తలు మాత్రం ఆగట్లేదు. నేను ఎవరినైనా ఇష్టపడితే కచ్చితంగా అందరితోనూ చెబుతా. అదేం దాచుకునే విషయం కాదు. దాచినా దాగదు!

* బాహుబలి, సాహో.. ఇవి రెండూ పాన్‌ ఇండియా సినిమాలే. ఇక మీదటా ఈ తరహా సినిమాలే చేస్తారా?
ఇప్పుడు రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది. అదీ పాన్‌ ఇండియా సినిమానే. 'బాహుబలి'తో నా సినిమా చూసే ప్రేక్షకులు పెరిగారు. 'బాహుబలి' ఎక్కడకెక్కడికి వెళ్లిందో.. అక్కడికి నా సినిమాలు తీసుకెళ్లాలి.
మామూలుగా 'సార్‌, భయ్యా, బ్రదర్‌' ఇలా పిలుస్తుంటారు. నాకు మాత్రం అలా పిలవాలంటే కొంచెం ఇబ్బంది. అందుకే 'డార్లింగ్‌' అని పిలవడం మొదలెట్టా. 'బుజ్జిగాడు'తో పూరిగారు దాన్ని పాపులర్‌ చేసేశారు. ఆ సినిమాలో హీరో అందరినీ అలానే పిలుస్తాడు. ఆఖరికి విలన్‌ని కూడా. ఆ సినిమా వచ్చాక ఆ పిలుపు బ్రాండ్‌గా మారిపోయింది.


శుక్రవారం చాలు..
రికార్డులు శాశ్వతం కావు. ఎప్పుడో ఒకప్పుడు అవి చెరిగిపోవడం ఖాయం. ఎంత గొప్ప రికార్డు బద్దలవ్వడానికైనా ఒక్క శుక్రవారం చాలు. మంచి కథలకు అద్భుతాలు సృష్టించే శక్తి ఉంది. 'బాహుబలి'లాంటి సినిమాల వల్ల బడ్జెట్లు పెరిగాయి. ఎంత పెద్ద కథైనా, ఎంత పెద్ద కాన్వాస్‌లో అయినా చెప్పే ధైర్యం చేస్తున్నారు. భవిష్యత్తులో ఈ బడ్జెట్లు మరింత పెరుగుతాయి. ఈ అంకెలూ మారతాయి.

రంగంలోకి దూకేయాల్సిందే!
బాహుబలి తరవాత యాక్షన్‌ సినిమా చేయాలని అనుకోలేదు. ప్రేమకథలు దొరుకుతాయేమో అనుకున్నాను. 'సాహో' వచ్చింది. ఈ సినిమా చేస్తున్నప్పుడు మరోసారి ఇంత పెద్ద స్కేల్‌ ఉన్న యాక్షన్‌ సినిమా చేయకూడదు అనుకున్నా. మన దగ్గరకు ఎప్పుడు ఎలాంటి కథ వస్తుందో చెప్పలేం. మంచి కథ దొరికినప్పుడు, ఆ కథపై నమ్మకం కుదిరినప్పుడు రంగంలోకి దూకేయాల్సిందే.

నా అభిమానులకు ఓపిక ఎక్కువ
అభిమానులు చూపిస్తున్న ప్రేమ చూస్తుంటే చాలా గర్వంగా, సంతోషంగా అనిపిస్తుంటుంది. భయం వేస్తుంది కూడా! అంత అర్హత నాకు ఉందా? అనిపిస్తుంది. ఆ ప్రేమని, నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు నేనెంత జాగ్రత్తగా ఉండాలా? అని ఆలోచిస్తుంటాను. నా అభిమానులకు ఓపిక ఎక్కువ. రెండేళ్లకు ఓ సినిమా ఇచ్చినా... ప్రేమతో ఎదురుచూస్తుంటారు. అందుకే వాళ్లంతా 'డైహార్డ్‌ ఫ్యాన్స్‌' అయిపోయారు.

- మహమ్మద్‌ అన్వర్‌, ఫొటోలు: జయకృష్ణ


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.