చిరంజీవి స్ఫూర్తితో..

‘‘వంద రూపాయలకి వెయ్యి రూపాయల వినోదం అందిస్తుంది మా చిత్రం’’ అంటున్నారు జిపిఎస్‌. ఆయన కథానాయకుడిగా నటిస్తోన్న ఆ చిత్రమే ‘ప్రేమపిపాసి’. మురళీ రామస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. పి.ఎస్‌.రామకృష్ణ నిర్మించారు. ఈరోజు ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం హైదరాబాద్‌లో విలేకర్లతో మాట్లాడారు జిపిఎస్‌.


*
‘‘ఇప్పటి వరకు తెరకెక్కని ఓ సరికొత్త ప్రేమకథతో దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించారు. నిజమైన ప్రేమను వెతుక్కుంటూ తిరిగే ఆవారాగా కనిపిస్తా. ఈ ప్రయాణంలో నాకెదురైన అనుభవాల సమాహారమే ఈ చిత్రం. నా పాత్రలో మూడు భిన్న కోణాలు ఉంటాయి. ఓ పాత్ర కోసం పది కేజీల బరువు తగ్గి.. మరో పాత్ర కోసం ఐదు కేజీలు బరువు పెరిగి నటించా. నటనపై ఉన్న పిచ్చి వల్లే దీన్ని సవాల్‌గా తీసుకోని చేశా. ఆరుగురు కథానాయికలుంటారు. కానీ, కథ ప్రధానంగా నా చూట్టూనే తిరుగుతుంది. పదికి పైగా ముద్దు సన్నివేశాలున్నా.. ఎక్కడా అసభ్యత కనిపించదు. దర్శకుడు ఎంత చక్కగా కథ చెప్పారో.. అంతే గొప్పగా తెరపై చూపించారు. ప్రధమార్థం వినోదాత్మకంగా సాగితే.. ద్వితియార్థం భావోద్వేగభరితంగా ఉంటుంది. యువకులు నా పాత్రలో తమని తాము చూసుకుంటారు. సినిమాలోని ఐదు పాటలు ఆకట్టుకుంటాయి’’.

* ‘‘నాకు కుల, మత, ప్రాంతీయ భేదాలంటే నచ్చవు. నేను వాటిని ప్రస్తావించడానికి ఇష్టపడను. అందుకే పేరుని కూడా జిపిఎస్‌ అని పెట్టుకున్నా. పూర్తి పేరు జ్ఞానప్రకాష్‌. ఈ విషయంలో దర్శకుడు తేజ నాకు స్ఫూర్తి. ఆయన కూడా తన కుల, మతాల్ని ఎక్కడా ప్రస్తావించరు. ఇక నటుడిగా మారడానికి చిరంజీవి స్ఫూర్తి. నాకు చిన్నప్పటి నుంచి ఆయనలా మంచి హీరో కావాలని కోరిక ఉండేది. అదే నన్నిక్కడి వరకు తీసుకొచ్చింది. బీటెక్‌ పూర్తి చేశాక.. ‘నేనొస్తా’ అనే చిత్రంలో సైకో పాత్ర చేశా. దానికి విమర్శకుల నుంచి మంచి ప్రశంసలొచ్చాయి. దీంతో హీరో అవ్వాలని కోరిక మరింత బలపడింది. అలా అవకాశాల కోసం అన్వేషించే క్రమంలో ఈ చిత్ర దర్శకుడు పరిచయమయ్యారు. నేను హీరో అవ్వడంలో నిర్మాతల సహకారం మర్చిపోలేను. ఇకపైనా కథానాయకుడిగానే చెయ్యాలనుకుంటున్నా. ప్రస్తుతం రెండు కథలు విన్నా. ఓ సినిమా ఈ చిత్ర బృందంతోనే చేస్తా’’.
Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.