ఫైరింజన్‌తో నీళ్లు తోడుతూనే.. ఇటు సినిమా వేశారు!!
తన 50ఏళ్ల సినీ ప్రస్థానం, ఎన్టీఆర్‌తో అనుబంధం, తాను గడ్డం పెంచడం వెనుక కథ, పేరు చివరిన బి.ఎ. ఉండటానికి గల కారణం ఇలా ఎన్నో విషయాలను ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో గతవారం పంచుకున్నారు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. దానికి కొనసాగింపుగా మరిన్ని విశేషాలు.. అనుభవాలు మీకోసం..


*
మీకు సాధారణంగా కోపం రాదు.. వస్తే మాత్రం మీ కళ్లజోడు, సెట్‌లో ఉన్న కుర్చీలు పగలగొట్టేస్తారట! ఇప్పటికీ కోపం ఉందా?
రాఘవేంద్రరావు: నా కళ్లజోడు పగలగొట్టడానికి కారణం ఏంటంటే.. అవతలి వ్యక్తి కళ్లజోడు పగలగొడితే నన్ను కొడతారు. పైగా నేను ఎంత ఆవేశంలో ఉన్నానో ఎదుట వాళ్లకు తెలుస్తుంది. కోపం కూడా ఊరికే వచ్చేది కాదు. సమయపాలన, క్రమశిక్షణ నాకు ఎన్టీఆర్‌గారి నుంచి వచ్చాయి. అవి లేని వాళ్లపై వస్తుంది. ఆలస్యంగా వస్తానని ముందే చెబితే తప్పలేదు. కానీ, సమయానికి రాకుండా గంటల కొద్దీ ఆలస్యం చేస్తే, మాత్రం కోపం వచ్చేస్తుంది. చివరకు జ్ఞానోదయం అయింది. కోపం వల్ల సాధించింది ఏదీ లేదు. అందుకే 'చిరు నవ్వే భూషణం.. ఓర్పే ఆయుధం'
* 'జగదేకవీరుడు అతిలోక సుందరి' విడుదల సమయంలో తుపాను. రెండు రోజుల పాటు థియేటర్‌లో ఎవరూ లేరు. సినిమా ఫ్లాప్‌ అన్నవాళ్లూ ఉన్నారు. అది విన్నప్పుడు మీకెలా అనిపించింది? ఆ తర్వాత సినిమా సూపర్‌హిట్‌ అయితే, మీరెలా ఫీలయ్యారు?
రాఘవేంద్రరావు: 'జగదేక వీరుడు అతిలోక సుందరి'కు ముందే రెండు మూడు ఫ్లాప్‌లు ఉన్నాయి. 'ఈ సినిమాతో రాఘవేంద్రరావు పని అయిపోయింది' అన్నారు. చిరంజీవి, అశ్వనీదత్‌లకు నిజంగా హ్యాట్సాఫ్‌. 'ఇలాంటి సినిమా రాఘవేంద్రరావు తప్ప మరొకరు తీయలేరు' అని రిస్క్‌ చేసి నన్ను పెట్టుకున్నారు. ఇళయరాజాగారు దేవుడిలాంటి వ్యక్తి. కొత్తతరం మ్యూజిక్‌ ఇచ్చారు. ఈ సినిమా రీరికార్డింగ్‌కు వెళ్లే ముందు ఆయన చూసి, దీనికి బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ అక్కర్లేదు అన్నారు. అదొక ఆనందంగా అనిపించింది. దీంతో నేను అమెరికా వెళ్లా. సినిమా విడుదలైన తర్వాత రెండు, మూడు రోజులకు 'కొనుక్కొన్న వాళ్ల భార్యల పుస్తెలు కూడా అమ్ముకోవాల్సిందే.. పోస్టర్‌పై విఠలాచార్య పేరు వేస్తే బాగుంటుంది' ఇలా కామెంట్లు వచ్చాయి. వెంటనే నేను వచ్చేశా. నెమ్మదిగా సినిమాకు మంచి టాక్‌ రావడం ప్రారంభించింది. అయితే, తుపాను కారణంగా చాలా థియేటర్లు మూసేశారు. కరెంటు లేకపోతే కొన్ని థియేటర్లలో జనరేటర్‌ వేసి సినిమా ఆడించారు. తాడేపల్లిగూడెంలోని ఓ థియేటర్‌లో ఒక పక్క ఫైర్‌ ఇంజిన్‌తో నీళ్లు తోడుతూనే మరోపక్క సినిమా వేశారట. అదొక మర్చిపోలేని అనుభూతి. 'ప్రేమనగర్‌' నాగార్జునతో తీస్తే బాగుంటుందని రామానాయుడుగారు, సురేష్‌బాబు అంటుండేవారు. 'కొన్ని సినిమాలు చరిత్రలో నిలిచిపోతాయి. మళ్లీ తీస్తే, పాత సినిమాతో పోలికలు పెడతారు. నేను చేయలేను' అని చెప్పా. అలాగే 'జగదేక వీరుడు.. అతిలోక సుందరి' రీమేక్‌ చేయమని కూడా చాలా ఇంటర్వ్యూలో అడిగారు. చిరంజీవి, శ్రీదేవి పాత్రలు జనాల్లోకి వెళ్లిపోయాయి. రీమేక్‌ చేస్తే లేనిపోని పోలికలు వస్తాయి. అందుకే వాటి జోలికి వెళ్లకపోవడం మంచిది.


* అప్పట్లో అది భారీ బడ్జెట్‌ చిత్రం కదా!
రాఘవేంద్రరావు: అవును! అయితే, నా మొదటి చిత్రం కూడా భారీ బడ్జెట్‌తో తీసిందే. రూ.లక్షతో సినిమా తీద్దామని నా ఫ్రెండ్స్‌తో చెప్పా. వాళ్లు కుదరదన్నారు. చేస్తే గొప్ప సినిమా చేయాలన్నారు. సరే.. వీళ్ల పని ఇలా ఉందా? అని వాహిని స్టూడియోస్‌లో అతి పెద్ద ఫ్లోర్‌ ఉండేది. దాని గోడలు కూడా పగలగొట్టి పెద్ద బంగ్లా సెట్‌ వేశాం. మెడ మీద కత్తిపెట్టి భారీగా తీయమంటే ఇలాగే ఉంటుంది. ఏ సినిమాకు ఎంత అవసరమో అంతలోనే తీయాలి. బడ్జెట్‌ పరిమితులు దాటిపోవడంతోనే ఆ సినిమా యావరేజ్‌గా ఆడింది.
* ఆ తర్వాత 'ఘరానా మొగుడు' సూపర్‌హిట్‌ కదా! చిరు కెరీర్‌లో మొదటిసారి రూ.10 కోట్లు వసూలు చేసిందట!
రాఘవేంద్రరావు: సినిమా చూసేవాళ్లలో మూడు కేటగిరీలు ఉంటారు. ప్రతి ఒక్కరూ ఒకసారి సినిమా చూస్తే, సక్సెస్‌ఫుల్‌ సినిమా అంటారు. ప్రతి వాళ్లూ రెండు, లేదా మూడుసార్లు చూస్తే దాన్ని హిట్‌ సినిమా అంటారు. ఒక్కొక్కరూ పదేసిసార్లు చూస్తే దాన్ని సూపర్‌హిట్‌, బ్లాక్‌బస్టర్‌ అంటారు.
* 'అల్లరిప్రియుడు' రాజశేఖర్‌ కోసమే రాశారా? అంత హిట్‌ అవుతుందని అనుకున్నారా?
రాఘవేంద్రరావు: 'రాజశేఖర్‌.. ఇద్దరు హీరోయిన్లు.. రాఘవేంద్రరావు దర్శకత్వం.. అసలు ఏంటీ సినిమా.. అతనికేదో మైండ్‌లో చిప్‌ పోయినట్లుంది' అప్పట్లో ఇండస్ట్రీలో జనరల్ టాక్‌. ఎవరూ చేయలేనిది మనం చేస్తేనే కదా! గొప్ప. రాజశేఖర్‌ ఏం చేయగలడో అదే చేయించా. కష్టమైనవి ఏవీ చెప్పలేదు. రిలీజ్‌లైన రెండో రోజు ఒక డిస్ట్రిబ్యూటర్‌ ఫోన్‌ చేసి, 'రాజశేఖర్‌కు ఆ బ్యాండ్‌మేళం డ్రెస్‌ల్లేంటి.. ఆయన స్టెప్‌ల్లేంటి.. ఏమైంది మీకు.. దుకాణం మూసుకోవడమే' అన్నాడు. నేను రోజూ ఉదయం దేవుడికి పూజచేస్తా. అప్పుడు 'ఆ డిస్ట్రిబ్యూటర్‌ కోసమైనా సినిమా ఆడాలి' అని దేవుడికి పూజ చేసేవాడిని. రెండో వారం నుంచి అందుకుంది. 25 వారాల పాటు ఇక ఆగలేదు. నువ్వు(ఆలీ) 'యమలీల' చేశావు. 'నువ్వేంటి హీరో' అని ఎవరూ అనలేదుగా. ఆ సబ్జెట్‌ను ఆలీతో తీస్తే బాగుంటుందని ఎస్వీ కృష్ణారెడ్డిగారు భావించారు. అలాగే రాజశేఖర్‌ యాంగ్రీ యంగ్‌మెన్‌గానే ఎందుకు ఉండాలి? అని 'అల్లరిప్రియుడు' చేశా.
* 'రమ్యకృష్ణ ఐరన్‌లెగ్‌.. ఆమెను పెట్టుకుంటే సినిమా ఫ్లాప్‌ అవుతుంది' అని చెప్పేవారు. అలాంటి ఆమెను మీరు తీసుకొచ్చి గోల్డెన్‌ లెగ్‌ చేశారు. సెంటిమెంట్స్‌ ఉన్న మీరు ఆమెను ఎలా నమ్మారు?
రాఘవేంద్రరావు: ఆ సెంటిమెంట్స్‌ను నమ్మను. తన కూతురికి సరైన హిట్‌ లేదని రమ్య వాళ్ల తల్లిదండ్రులు నా దగ్గర బాధపడ్డారు. దీంతో 'అల్లుడుగారు'లో వేషం ఇచ్చాను. ఒక్క పాటతోనే పెద్ద హీరోయిన్‌ అయిపోయింది. 'ముద్ద బంతి పువ్వులో మూగ బాసలు'పాట పెద్ద హిట్‌. ఈ సినిమా అయిపోగానే 'అల్లరి మొగుడు' సూపర్‌హిట్‌. 'సూత్రధారులు' సినిమా తర్వాత తనకి 14 సినిమాలు ఫ్లాప్‌ అయ్యాయి. 'ఎవరైతే నిన్ను కాదన్నారో వాళ్లే నీ కాల్‌షీట్‌ల కోసం వేచిచూసే రోజు వస్తుంది' అని తనకి చెప్పా. ఇటీవల శివగామి పాత్ర వరకూ ఎన్నో విభిన్న పాత్రలు పోషించింది. అయితే, అందంగా ఉంటే హీరోయిన్‌ అవుతుందా? కేవలం టాలెంట్‌ ఉంటే హీరోయిన్‌ అవుతుందా? అందం.. టాలెంట్‌ రెండూ ఉంటే హీరోయిన్‌ అవుతుందా? అనే దానిపై నేను క్లాస్‌ కూడా చెప్పాను. సినిమా హిట్‌ అయితేనే హీరోయిన్‌ అవుతుంది.
* మీ సొంతూరు ఏది?
రాఘవేంద్రరావు: కృష్ణాజిల్లా కేసరపల్లి. గన్నవరం పక్కనే ఉంటుంది. అయితే, నా చదువంతా చెన్నైలోనే సాగింది. మా తండ్రి దాదాపు ఏడెనిమిది సినిమాల్లో హీరోగా చేశారు. ఆ తర్వాత దర్శకత్వం వైపు వచ్చారు
* మీ తండ్రి దర్శకత్వం చేస్తున్నప్పుడు మిమ్మల్ని ఫ్రీగా వదిలేశారా? భయం ఉండేదా?
రాఘవేంద్రరావు: నేనంటే ఆయనకు భయం ఉండేది. ఆయన దగ్గర సహాయకుడిగా ఉన్నప్పుడు తీయాల్సిన సీన్లు కూడా సరికొత్తగా తీయాలని తపన నాకు ఉండేది. నేను చెప్పినట్లు కాకుండా వేరే రకంగా తీస్తే అలిగేవాడిని. అయితే, చివరకు స్క్రీన్‌పై చూసుకుంటే ఆయన తీసినదే కరెక్ట్‌ అనిపించేది. ఆయన స్క్రీన్‌ప్లే అద్భుతంగా ఉంటుంది. 'ప్రేమనగర్‌', 'సెక్రటరీ' చూస్తే అర్థమవుతుంది. అవన్నీ నాకు బాగా పనికొచ్చాయి. ఏమేం తీయకూడదో కూడా ఆయన దగ్గరి నుంచే నేర్చుకున్నా. అదే నా విజయ రహస్యం. ఆరోజుల్లోనే ఆయన చాలా అడ్వాన్స్‌డ్‌గా తీసేవారు. మా నాన్నగారి పేరు మా అబ్బాయికి పెట్టా. తను కూడా సినిమాలు తీస్తున్నాడు. ఇటీవల కంగనా రనౌత్‌తో 'మెంటల్‌ హై క్యా'(నీకేమైనా మెంటలా..) తీశాడు. అక్కడ మంచి పేరు వచ్చింది. కానీ, డబ్బులు రాలేదు. నేను అలా కాదు.. నాకు పేరుతో పాటు, డబ్బులు కూడా రావాలి.


* రాఘవేంద్రరావు 'అన్నమయ్య' సినిమా తీయడమేంటి? అన్నారట!
రాఘవేంద్రరావు: అవును! ఈ సినిమాకు కూడా మొదట్లో పెద్దగా టాక్‌ రాలేదు. నాగార్జున అన్నమయ్య ఏంటీ? సుమన్‌ వెంకటేశ్వరస్వామి ఏంటీ? రమ్య భక్తురాలేంటి? ఇలా ఎన్నో అన్నారు. అసలు అన్నమయ్యకు మీసాలు పెట్టారేంటి? అన్నవాళ్లు కూడా ఉన్నారు. నా ఉద్దేశం ఏంటంటే.. అన్నమయ్యను చూసిన వాళ్లు ఎవరూ లేరు. సన్నివేశాలు బాగుంటే అవేవీ అడగరు. ఒకవేళ జీయర్‌ స్వామి అడిగితే, ఆయనకు కూడా ఉన్నాయి కదా! అని సమాధానం చెప్పవచ్చు. ఆ ధైర్యంతో తీశా. సినిమా హిట్టవుతుందని మొదటి నుంచీ నాకు నమ్మకం ఉండేది. నాగార్జునకు కథ చెప్పేటప్పుడు 'బాబూ.. సినిమాకు మంచి పేరొస్తుంది. నీకు అవార్డు వస్తుంది' అని చెప్పా. భార్గవిగారు కథ చెబుతుంటే వాళ్లిద్దరిని గదిలో వదిలేసి బయటకు వచ్చా. అయిపోయిన తర్వాత వెళ్లి చూస్తే, నాగార్జున కళ్లు ఎర్రబడిపోయాయి. అంతలా ఫీలయిపోయాడు. 'డైరెక్టర్‌గారూ ఈ సినిమా అవార్డులు కాదు.. డబ్బులు కూడా వస్తాయి' అన్నాడు. ఎన్ని సినిమాలు తీసినా నా జీవితంలో మర్చిపోలేని చిత్రమది. ఇదే విషయాన్ని చిరంజీవిగారూ అంటారు.
* వెంకటేశ్‌, మహేశ్‌బాబు, బన్నిలను మీరే హీరోలుగా పరిచయం చేశారు. మీకెలా అనిపించింది?
రాఘవేంద్రరావు: వెంకటేశ్‌ అప్పుడే అమెరికా నుంచి వచ్చాడు. అయితే అంతకుముందే నాకు బర్త్‌డే గ్రీటింగ్స్‌ పంపిస్తూ.. 'మీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్లు నాకు కల వచ్చింది' అని చెప్పాడు. ఆ తర్వాత అదే నిజమైంది. ఇక మహేశ్‌బాబును హీరోగా నేనే పరిచయం చేయాలని కృష్ణగారు పట్టుబట్టారు. చాలా ఆఫర్లు వచ్చినా చేయలేదు. ఇక బన్ని విషయానికొస్తే అది నా 100వ చిత్రం. ఒకసారి చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్‌ డ్యాన్స్‌ చేశాడు. అది చూసి, వాళ్లమ్మకు రూ.100 అడ్వాన్స్‌ ఇచ్చి, 'నా సినిమాలో హీరోగా తీసుకుంటా. ఇదిగోండి అడ్వాన్స్‌' అని చెప్పానట. ఆ తర్వాత అది నిజమైంది.
* ఎన్టీఆర్‌తో మీరు ఎంతో సన్నిహితంగా ఉంటారు.. అలాంటిది బాలకృష్ణను ఎందుకు వెండితెరకు పరిచయం చేయలేదు?
రాఘవేంద్రరావు: ఆర్కే అసోసియేట్స్‌ బ్యానర్‌లో వచ్చే సినిమాలు రామారావుగారి వారసులతో చేయాలని అనుకున్నారు. దాంతో కుదరలేదు. ఆ తర్వాత 'అపూర్వ సహోదరులు' సినిమా చేశాం. అది కూడా భారీ బడ్జెట్‌తో తీసిందే. ఆ సినిమా 100రోజుల ఫంక్షన్‌కు అందరూ బ్రదర్స్‌నే పిలిచా. వెంకట్‌-నాగార్జున, కృష్ణంరాజు-సూర్యనారాయణరాజు, ఇలా సినిమా ఫీల్డ్‌లో ఉన్న అన్నదమ్ములనే పిలిచా.
* మీరూ దాసరి నారాయణరావుగారు మాట్లాడుకోలేదు. మీ మధ్య గొడవైంది అని వినికిడి. అది నిజమేనా?
రాఘవేంద్రరావు: అది 100శాతం అబద్ధం. ఆయనంటే నాకు ఎంతో ఇష్టం. ఇక నా భార్యకు ఆయన సినిమాలంటే చాలా ఇష్టం. నారాయణరావుగారి భార్య నన్ను 'అన్నయ్యాగారూ.. అన్నయ్యగారూ..' అంటూ పిలిచేది. ఆయన కూడా చాలా చక్కగా పలకరించేవారు. అనేక వేదికలపై నా తరపున కూడా ఆయనే మాట్లాడేవారు. అయితే, సినిమాల విషయంలో మా ఇద్దరి మధ్య పోటీతత్వం ఉండేది. దాన్ని వేరేరకంగా అర్థం చేసుకున్నారు. 'ఇండస్ట్రీలో దర్శకుడికి గౌరవం తెచ్చిన వ్యక్తి' అని ఆయనను మా నాన్నగారు బాగా మెచ్చుకునేవారు.
* దర్శకరత్న దాసరి నారాయణరావు, కళాతపస్వి కె.విశ్వనాథ్‌, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఈ ముగ్గురిలో మీరు ఎవరిని ఇష్టపడతారు?
రాఘవేంద్రరావు: నేను అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఉన్నప్పుడే విశ్వనాథ్‌గారు, బాపుగారి సినిమాలు వస్తున్నాయంటే అర్జెంట్‌గా వెళ్లిపోయేవాడిని. 'అన్నమయ్య', 'శ్రీమంజునాథ' సినిమాలు చూసి వాళ్లు మెచ్చుకున్నారు. తాము తీసిన అంత బాగా తీయలేమేమోనని అన్నారు. 'మాది చప్పగా ఆయుర్వేదం.. హోమియోపతిలా ఉంటుంది. నీ సినిమా అల్లోపతిలా ఫాస్ట్‌గా ఉంటుంది' అని విశ్వనాథ్‌గారు అనేవారు. 'అన్నమయ్య' సినిమాకోసం చాలా యాడ్‌ చేశాం. ఎందుకంటే హీరోను చూసే ఎవరైనా థియేటర్‌కు వస్తారు. విశ్వనాథ్‌గారు 'శంకరాభరణం'లో సోమయాజులను తీసుకున్నారు. నాకు ఆ ధైర్యం లేదు. అందుకే నాగార్జునను పెట్టా.
* మీ తండ్రి దగ్గర కాకుండా ఎవరి దగ్గరైనా అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేయాలనిపించిందా?
రాఘవేంద్రరావు: ఆదుర్తి సుబ్బరావుగారి వద్ద చేయాలని ఉండేది. ఆయన నన్ను ఎడిటింగ్‌లో పెట్టారు. నా మొదటి సినిమా కామేశ్వరరావుగారి దగ్గర, మధుసూదన్‌రావుగారి వద్ద ఒక సినిమా చేశా.* మొత్తం మీరు తీసిన సినిమాల్లో మీ మనసుకు నచ్చింది ఏది?
రాఘవేంద్రరావు: నేను మొత్తం 108 సినిమాలు తీశా. మనసుకు మెచ్చింది 'అడవిరాముడు', మనసుకు నచ్చింది 'అన్నమయ్య'.
* 'జస్టిస్‌ చౌదరి'లోని 'చట్టానికి.. న్యాయానికి..' పాట తరహాలో 'అగ్నిపర్వతం'లో తనకు పాట కావాలని కృష్ణ అడిగారట!
రాఘవేంద్రరావు: చర్చల్లోకి వచ్చింది. అందుకే తీశాం. ఎన్ని రొమాంటిక్‌ పాటలు తీసినా, ఈ పాటలు తీసేటప్పుడు వచ్చే ఎమోషన్‌ ఎప్పుడూ రాదు. చాలా అద్భుతంగా ఉంటాయి.
* ఒక సీనియర్‌ డైరెక్టర్‌గా కొత్త దర్శకులను ఎలా చూసుకోవాలని మీ అభిప్రాయం?
రాఘవేంద్రరావు: నేడు వచ్చే యువ దర్శకులు చాలా కొత్త కొత్త పాయింట్స్‌తో సినిమా చేస్తున్నారు. ఇటీవల 'ఎవరికీ చెప్పొద్దు' అనే సినిమా వచ్చింది. అది ఏదో సినిమా అనుకుని ఓపెనింగ్స్‌ సరిగా రాలేదు. కానీ, అందులో మ్యాటర్‌ చూస్తే, కులం గురించి ఎవరికీ చెప్పొద్దనే కాన్సెప్ట్‌ చాలా బాగుంది. ప్రొడ్యూసర్‌ బాగుండాలనే ఉద్దేశంతో సినిమా తీయాలి. ఈ దేశం భవిష్యత్‌ అంతా నేటి అమ్మల చేతిలోనే ఉంది. వాళ్లు చెబితేనే పిల్లలు వింటారు. పిల్లలను చక్కని పౌరులుగా తీర్చిదిద్దండి. ఉదయాన్నే పేపర్‌ చూస్తే ఎలాంటి వార్తలు చూస్తున్నామో మనకు తెలుసు. మీరు బాగా చూస్తేనే తర్వాతి తరం బాగుంటుంది. పిల్లలకు మంచి విషయాలు చెప్పండి. సామాజిక స్పృహ కల్పించండి.
* రొమాంటిక్‌ సాంగ్స్‌ చేసేటప్పుడు మీరెలా సిద్ధమవుతారు?
రాఘవేంద్రరావు: (నవ్వులు) చెబితే చేయగలిగే వాళ్లనే సినిమాలో పెట్టుకుంటాం.
* మీరు యంగ్‌గా ఉన్నప్పుడు మీకెన్ని ప్రపోజల్స్‌ వచ్చాయి?
రాఘవేంద్రరావు: పల్లెటూరిలో మొదలైంది.. పట్నం వచ్చే వరకూ కొనసాగుతూనే ఉన్నాయి.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.