నా వంతు కష్టపడుతున్నా.. ఫలితం ప్రేక్షకుల చేతుల్లోనే

‘‘కుటుంబ ప్రేక్షకులు మెచ్చే అన్ని భావోద్వేగాలు పుష్కలంగా ఉన్న చిత్రం మా ‘కాలేజ్‌ కుమార్‌’’ అంటున్నారు రాహుల్‌ విజయ్‌. ‘ఈ మాయ పేరేమిటో’, ‘సూర్యకాంతం’ చిత్రాలతో మెప్పించిన కథానాయకుడీయన. ఇప్పుడు ‘కాలేజ్‌ కుమార్‌’గా ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ప్రియ వడ్లమాని కథానాయిక. రాజేంద్ర ప్రసాద్‌ ముఖ్య పాత్రలో నటించారు. హరి సంతోష్‌ దర్శకుడు. మార్చి 6న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో గురువారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు రాహుల్‌.


*
‘‘కన్నడలో విజయవంతమైన ‘కాలేజ్‌ కుమార్‌’ చిత్రానికి తెలుగు రీమేక్‌ ఇది. టైటిల్‌ క్యాచీగా ఉంది కదా అని తెలుగులోనూ అదే ఉంచేశాం. ప్రస్తుతం చదువులు ఎలా ఉన్నాయి. మన చదువులకు తగ్గట్లుగా ఉద్యోగాలు చేస్తున్నామా? వంటి అంశాలను ఇందులో చర్చించాం. నేనిందులో రాజేంద్ర ప్రసాద్‌ తనయుడిగా కనిపిస్తా. ఇందులో మా తండ్రి కొడుకుల మధ్య వచ్చే సన్నివేశాలు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఇది రీమేకే అయినప్పటికీ దర్శకుడు మాతృకలోని మూల కథను మాత్రమే తీసుకోని తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా చాలా మార్పులే చేశారు’’.

* ‘‘దర్శకుడు సంతోష్‌ కన్నడలో చాలా విజయవంతమైన చిత్రాలు చేశారు. ఈ చిత్ర మాతృకను తీసింది కూడా ఆయనే. అందుకే తెలుగు చిత్రాన్ని ఆయన చేతుల్లోనే పెట్టాం. మధుబాల, నాజర్, రాజేంద్ర ప్రసాద్‌ వంటి అనుభవమున్న నటులతో పనిచేయడం సంతోషంగా అనిపించింది. ఈ ప్రయాణంలో వాళ్ల దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. చిత్రీకరణ ఆద్యంతం సరదాగా సాగిపోయింది’’.

* ‘‘ఏ చిత్రం చేసినా ఓ నటుడిగా నా పాత్రని పండించడం కోసం వంద శాతం కష్టపడుతున్నా. కానీ ఫలితం అన్నది మన చేతిలో లేదు కదా. కానీ, చేసిన ప్రతి చిత్రం నుంచి ఎంతో కొంత నేర్చుకుంటూనే ఉన్నా. ప్రస్తుతం ఓ కొత్త దర్శకుడితో ‘బ్లాక్‌ అండ్‌ వైట్‌’ అనే థ్రిల్లర్‌ చిత్రం చేస్తున్నా. మరో రెండు చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి. త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తా’’.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.