వాళ్లిద్దరినీ సీరియస్‌ మూడ్‌లోకి తీసుకెళ్లడం కష్టం

తెర వెనక బాహుబలి... ఎస్‌.ఎస్‌.రాజమౌళి. ఆయన కనే కలలు.. కథలు ఎంత భారీగా ఉంటాయో, ఆయన మెగాఫోన్‌ పట్టి ఓపికగా చెక్కే చిత్రశిల్పాలు అంతే అందంగా, మనసుల్ని హత్తుకునేలా ఉంటాయి. అందుకే జక్కన్న సినిమా అంటే ప్రపంచవ్యాప్తంగా అంచనాలు రేకెత్తుతుంటాయి. ప్రస్తుతం ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారాయన. కరోనా, ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’, కుటుంబం.. తదితర విషయాల గురించి రాజమౌళి ‘ఈనాడు సినిమా’తో ప్రత్యేకంగా ముచ్చటించారు.


* చిన్నప్పట్నుంచే ఆ అలవాటు
లాక్‌డౌన్‌లో ఇంటి పనులు చేస్తున్నారు కదా. మీ ఇంట్లో ఎవరికెక్కువ మార్కులు పడుతుంటాయి?

నాకే (నవ్వుతూ). నేను చేసే పని బాగుంటుందని మా ఆవిడ మెచ్చుకుంటుంది. ఇంటి శుభ్రత విషయంలో మా ఆవిడ ప్రమాణాలు చాలా ఉన్నతంగా ఉంటాయి. ఇంట్లో అందరూ వాటిని అందుకునేలా పనిచేయాల్సిందే.‘బి ది రియల్‌ మేన్‌’ ఛాలెంజ్‌ వల్ల సినీ ప్రముఖులంతా చీపుర్లు పట్టుకుంటున్నారు కదా?

ఇంటి పనులు చేయడాన్ని నామోషీగా భావించేవాళ్లు ఎక్కువ. ఆడవాళ్లే చేయాలన్నట్టు వ్యవహరిస్తుంటారు. ఆడా, మగా తేడా లేకుండా... పనుల్లో అందరూ పాలుపంచుకుంటే మంచిదన్నదే ఈసవాల్‌ ఉద్దేశం. హీరోలు ఇల్లు శుభ్రం చేయడం చూస్తుంటే సరదాగా ఉంది.చిన్నప్పుడు కూడా ఇంటి పనుల్లో భాగం పంచుకునేవారా?

వంట చేయడం తప్ప అన్నీ చేసేవాణ్ని. కరోనాకి ముందు ఇంటి పనుల్లో సాయం చేసేవాణ్ని కాదు. అంతా తనే చేయడం చూసి ఓ చేయి వేయడం తప్ప, మా ఆవిడ ఎప్పుడూ సాయం అడిగింది లేదు.* అది మన అదృష్టమే
కరోనా వైరస్‌ అందరినీ ఇళ్లకి పరిమితం చేసింది. ఆ విషయంలో మీ ఆలోచనల్ని పంచుకుంటారా?

జరిగిపోయిన దాని గురించి కాకుండా, భవిష్యత్తుపై దృష్టిపెట్టాలి. ఇకపైన ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎవరేం చేయాలో ఆలోచించాలి. మొదట్లో ఏమవుతుందో అనే ఆందోళన ఎక్కువగా ఉండేది. ఇప్పుడు స్పష్టత వచ్చిందని చెప్పను కానీ... మన రోగ నిరోధక శక్తో లేక వేసవి ప్రభావమో కానీ మిగతా దేశాలతో పోలిస్తే అంత బీభత్సం ఇక్కడ లేదు. అది మన అదృష్టమే అనుకోవాలి. ఎక్కువమందికి వ్యాప్తి చెందితే మన దేశంలో సమస్య అవుతుంది.కరోనా తర్వాత కూడా లాక్‌డౌన్‌ పాటించాలనే వాళ్లు కూడా ఉన్నారు. అలా మీరు ప్రత్యేక నిర్ణయాలేమైనా తీసుకున్నారా?

మేం మొదట్నుంచీ కొన్ని పాటిస్తున్నాం. అవసరానికి తగ్గట్టు ఏడాదికి రెండుసార్లు కేవలం కుటుంబంతోనే గడుపుతుంటా. ‘బాహుబలి’ తర్వాత ఏడాది వరకు ఏ పనీ పెట్టుకోలేదు. నిజంగా ప్రపంచం అంతా హాలీడే తీసుకుంటే బాగుంటుంది. ప్రకృతికి మేలు జరుగుతుంది. ఎవరి జీవితాల్ని వాళ్లు సమీక్షించుకొనే అవకాశం దొరుకుతుంది.

* చరణ్‌ వాయిస్‌తో...
‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ ఎలాంటి సవాళ్లని విసిరింది?

సృజనాత్మకమైన సవాళ్లే ఎక్కువ. నా జీవితంలో ఎదురైన అతి పెద్ద సవాళ్లు ‘ఈగ’ సినిమాకే. ఎక్కువ ఇబ్బంది పెట్టింది అదే. ఎక్కువ సంతృప్తినిచ్చింది కూడా అదే. మిగతా సినిమాల విషయంలో కథ రాస్తున్నప్పుడు, చర్చల్లోనూ మనసులో ఒక ఇమేజ్‌ అనుకుంటాం. ఈ విధమైన భావోద్వేగాల్ని, ఇలాంటి సన్నివేశాలతో, నటనతో రాబట్టాలనుకుంటాం. ప్రాక్టికల్‌గా మనం అనుకున్నది తెప్పించడంలో బోలెడన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. వాటిని అధిగమిస్తూ చేసే ప్రతి సన్నివేశం, ప్రతి షాట్‌ ఒక సవాలే. ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’కి ఎదురైన సవాల్‌ అంటే కరోనానే.అల్లూరి టీజర్‌కి ఎన్టీఆర్‌ వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు. కొమరం భీమ్‌ టీజర్‌ చరణ్‌ వాయిస్‌తోనే వస్తుందా?

అంతే కదండీ. అల్లూరి వాయిస్‌ ఓవర్‌ ఇవ్వడం సమస్య కాదు కానీ, ఇంకా భీమ్‌కి సంబంధించి కొన్ని విజువల్స్‌ని షూట్‌ చేయాల్సి ఉంది. లాక్‌డౌన్‌ తర్వాత ఎలాంటి అనుమతులు వస్తాయనేది చూసి చిత్రీకరణ చేయాలి. అల్లూరి టీజర్‌ విడుదలయ్యాక మొట్టమొదట ఫోన్‌ చేసింది చిరంజీవిగారే. ఆయన ఎంతో ఉత్సాహంగా ఆనందాన్ని పంచుకున్నారు.కరోనా ప్రభావంతో ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ ప్రాజెక్టులో మార్పులేమైనా ఉంటాయా?

అనుమతులు ఎప్పుడు ఇస్తారో తెలియదు. దాని ప్రకారం షెడ్యూళ్లలో మార్పులే తప్ప, ఫైనల్‌ ప్రాజెక్టులో మార్పుండదు. చిత్రీకరణ విధానంలో ఉంటాయంతే. ప్రభుత్వ అనుమతులొస్తే తప్ప స్పష్టత రాదు.అవకాశం వస్తే మీ ఏయే సినిమాల్లో మార్పులు చేస్తారు?

ప్రతి సినిమాలో మార్పులు చేస్తాను. నేనే అని కాదు, ఏ దర్శకుడూ వదిలిపెట్టడు. ఎవ్వరూ ఏ సినిమాని కూడా వందశాతం సంతృప్తితో చేయలేరు. అవకాశం ఉందంటే ప్రతి సినిమాలో ఏదో ఒకటి మార్పు చేయాలనిపిస్తుంది.* వాళ్లు అలా... వీళ్లు ఇలా
ఎన్టీఆర్, చరణ్‌లలో వ్యక్తిగతంగా, నటులుగా ఎలాంటి మార్పుల్ని గమనించారు?

వ్యక్తిగతంగా మార్పులేమీ కనిపించలేదు. నటులుగా ఇంతకుముందు కంటే ఇప్పుడు పరిణతి చెందారు. చెప్పింది అర్థం చేసుకోవడంలో కానీ, అవుట్‌పుట్‌ ఇవ్వడంలో కానీ మరింత ఉత్తమం అనిపించారు. ఇద్దరితో పనిచేసి పదేళ్లు పైనే అయ్యింది. ఈ సమయంలో వాళ్లు బోలెడన్ని సినిమాలు చేశారు, అనుభవం వచ్చింది.
చరణ్, ఎన్టీఆర్‌ సెట్‌లో ఎలా ఉంటారు?

ఇద్దరిలోనూ అల్లరి ఎక్కువ. తారక్‌ కనిపించేలా అల్లరి చేస్తాడు. చరణ్‌ చేసే అల్లరి కనిపించదు, అంతే తేడా! వాళ్లిద్దరినీ ఒక పొజిషన్‌లో నిల్చోబెట్టి సీరియస్‌ మూడ్‌లోకి తీసుకెళ్లడమనేది నాకు కష్టమైన పని. ఒకరినొకరు గిల్లుకోవడమో, వెక్కిరించుకోవడమో జరుగుతూనే ఉంటుంది. ఒకరికి సీరియస్‌గా చెబుతుంటే ఇంకొకరు మరోలా మొహం పెడుతుంటారు (నవ్వుతూ).‘బాహుబలి’ సమయంలో ప్రభాస్‌ - రానా ఎలా ఉండేవారు?

వాళ్లు అంత అల్లరి కాదు. షాట్‌ అయ్యాక ప్రభాసే రానాని కెలుకుతూ, ఏడిపిస్తూ ఉండేవాడు. షాట్‌ జరుగుతున్నప్పుడు మాత్రం కుదురుగా ఉండేవారు. ‘బాహుబలి’ కాస్ట్యూమ్‌ డ్రామా కదా. కిరీటాలు, దుస్తులు, హెయిర్‌ స్టైల్, మేకప్‌... ఇలా అన్నీ ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలి. దాంతో వాళ్లకి కామెడీ చేసుకునే అవకాశం తక్కువగా ఉండేది.


మహేష్‌బాబుతో బాండ్‌ తరహా సినిమా చేస్తారని ప్రచారం సాగుతోంది. నిజమేనా?

ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. మహేష్‌ ఇమేజ్, ఆయన బాడీ లాంగ్వేజ్‌తో పాటు... నా అభిరుచికి తగ్గట్టుగా ఉంటుందా సినిమా. ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ తర్వాత కొన్నాళ్లు విశ్రాంతి తీసుకోవాలి, ఆ తర్వాతే తదుపరి సినిమాని మొదలుపెట్టాలి. మహేష్‌తో కూడా ఇంకా కథ గురించి చర్చించలేదు.
ఆస్కార్‌ ఉత్తమ చిత్రం ‘పారసైట్‌’ నచ్చలేదని చెప్పారు మీరు. అకాడమీ జ్యూరీ ప్రమాణాలపై మీకేమైనా సందేహాలున్నాయా?

‘పారసైట్‌’ నాకు నచ్చకపోవడమనేది నా వ్యక్తిగత అభిరుచి. జ్యూరీ ప్రమాణాలంటారా? అక్కడ కూడా లాబీయింగ్‌ చాలానే ఉంటుంది. మీ సినిమాని జ్యూరీ మెంబర్స్‌ చూడాలంటే చాలా తతంగమే ఉంటుంది. అయినా సరే... నిర్దేశించిన కొన్ని ప్రమాణాలు పాటిస్తుంటారని ప్రపంచం మొత్తం నమ్ముతుంటుంది. ఎంత లాబీయింగ్‌ ఉన్నా చెత్త సినిమాని తీసుకెళ్లి పాస్‌ చేసేసి అవార్డు తీసుకునే పరిస్థితి ఉండదంటారు. అదెలా జరుగుతుందో దాని గురించి పూర్తిగా నాలెడ్జ్‌ లేదు నాకు. గతంలో కూడా ఆస్కార్‌ సినిమాలు నాకు నచ్చనివి చాలా ఉన్నాయి. నచ్చినవీ ఉన్నాయి.* రిటైర్‌మెంట్‌ తర్వాత అక్కడలాక్‌డౌన్‌తో ఇళ్లకే పరిమితమవడం ఇబ్బందిగా ఉందా?

నిజంగా కుటుంబాన్ని బాగా మిస్‌ అవుతుంటాను. వారానికి మూడు నాలుగుసార్లు మా ఇంట్లోనో, పెద్దన్న కీరవాణి ఇంట్లోనో అందరం కలుస్తుంటాం. నెల రోజులుగా ఎవరినెవ్వరూ కలవడం లేదు. కష్టంగానే ఉంది కానీ, తప్పదు.


మీ కుటుంబంతా కలిసి ఒక ఊరిని సృష్టించబోతున్నారట?

ఒక ఊరినే! (నవ్వుతూ). అదేం కాదు. నల్గొండ జిల్లాలో ఈదులూరు అని ఒక గ్రామం ఉంది. మేమందరం అక్కడ పక్క పక్కనే పొలాలు కొన్నాం. ప్రతి నెల ఒక ఆదివారం అక్కడికి వెళ్తాం. రిటైర్‌ అయ్యాక, పిల్లలంతా స్థిరపడ్డాక పెద్దవాళ్లం అక్కడికి వెళ్లి ఉండాలనేది ప్లానింగ్‌. పదేళ్ల వరకు రిటైర్‌మెంట్‌ ఆలోచనలేమీ లేవు.


ఉమ్మడి కుటుంబంలో ఉన్న రుచి, గొప్పతనం ఎప్పుడు తెలిసింది?

మా నాన్నగారిది ఉమ్మడి కుటుంబం. మాకు అందులో ఉన్న ఇబ్బందులు, ప్రయోజనాలూ తెలుసు. అందుకే ఉమ్మడిగా ఉండడమే సరైంది, విడిగా ఉండడం కాదని చెప్పలేం. మేం మధ్యే మార్గం అన్నట్టుగా ఉంటాం. ఎవరికివారే యమునా తీరే అని కాదు, అలాగని పూర్తిగా ఉమ్మడి కుటుంబం కాదు.


కరోనా వల్ల థియేటర్లు బంద్‌ చేశారు. ఇప్పుడు వినోదానికి ప్రత్యామ్నాయం టీవీలు, ఓటీటీ వేదికలు. కరోనా తర్వాత ఓటీటీ వేదికల్ని లక్ష్యంగా చేసుకుని కంటెంట్‌ రూపొందుతుంది. ప్రేక్షకులు కొన్నాళ్లుగా ప్రపంచవ్యాప్తంగా వచ్చిన సినిమాలు చూస్తున్నారు కాబట్టి వాళ్ల అభిరుచులు కూడా మారతాయి. వేరే రకాల భావోద్వేగాలు ఆస్వాదించడం మొదలుపెడతారు. ఈ పరిణామంతో ప్రేక్షకులతో పాటు మేకర్స్‌ కూడా పరిణతి చెందుతారు. చిత్రసీమపై రెండేళ్లుపైనే ఈ ప్రభావం ఉంటుందని నా అభిప్రాయం’’.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.