నాది 2018 బ్యాచ్‌
దక్షిణాదిలోని అన్ని భాషలతో పాటు... హిందీలోనూ నటించి ప్రేక్షకుల్ని అలరించిన కథానాయకుడు - మమ్ముట్టి. ‘స్వాతికిరణం’, ‘దళపతి’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులపై చెరిగిపోని ముద్ర వేశారు. చాలా రోజుల తర్వాత ఆయన ‘యాత్ర’తో మరోసారి తెలుగులో నటించారు. అందులో వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి పాత్రలో నటించారు మమ్ముట్టి. ఈ నెల 8న ‘యాత్ర’ ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా మమ్ముట్టి శుక్రవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు.


ఆ విషయాలివీ...
‘‘చాలా రోజుల తర్వాత తెలుగులో నేను చేసిన చిత్రం ‘యాత్ర’. ఈమధ్య కాలంలో తెలుగు పరిశ్రమలో మీకెలాంటి మార్పులు కనిపిస్తున్నాయని అడుగుతున్నారంతా. మార్పు అనేది సహజం. అన్ని పరిశ్రమల్లోనూ మార్పులు చోటు చేసుకొన్నాయి. నేను మాత్రం మారలేదు (నవ్వుతూ). ‘స్వాతికిరణం’లో ఎలా కనిపిస్తున్నానో ఇప్పుడు కూడా అలాగే ఉన్నానని అంటున్నారంతా. అందుకు కారణమేంటనేది మాత్రం నాకు తెలియదు’’.

*
‘‘తెలుగులో ఇంతకాలం సినిమాలు చేయకపోవడానికి కారణం బలమైన పాత్రలు దొరక్కపోవడమే. మహి వి.రాఘవ్‌ ‘యాత్ర’ స్క్రిప్టుని పూర్తిస్థాయిలో సిద్ధం చేసుకొని నా దగ్గరికొచ్చారు. ఆయనతో మాట్లాడాక నేను చేయాల్సిన సినిమా అనిపించింది. పైగా ఓ గొప్ప నాయకుడి పాత్ర. ఇది బయోపిక్‌ కాదు. వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి చేసిన పాదయాత్రలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. నిజమైన సంఘటనలు, చరిత్ర ఇందులో లేకపోవచ్చు కానీ... పాదయాత్రలో వై.ఎస్‌ ఎవరెవరిని కలిశారు? వాళ్ల సమస్యల్ని ఎలా విన్నారు? వాటికి ఎలాంటి పరిష్కారం ఆలోచించారనే విషయాలు ఆసక్తికరంగా ఉంటాయి. తెలుగైనా, మలయాళమైనా, కన్నడైనా, తమిళమైనా... మాట్లాడే భాష వేరు కావొచ్చు కానీ, మన జీవితాలు ఒకేలా ఉంటాయి. అందుకే ఈ సినిమాలో భావోద్వేగాలకి నేను బాగా కనెక్ట్‌ అయ్యా’’.

* ‘‘నాతో సినిమా తీసిన దర్శకుల్లో 70 నుంచి 80 మంది దాకా కొత్తవాళ్లే. ప్రస్తుతం చాలామంది అగ్ర దర్శకులుగా కొనసాగుతున్నారు. ఆ రకంగా చూస్తే మహి వి.రాఘవ్‌ అనుభవజ్ఞుడే. మహి ఈ చిత్రాన్ని చాలా బాగా తీశారు. మంచి నిర్మాతలు కూడా దొరికారు. ఈ సినిమా ప్రయాణం ఒక విహారయాత్రలా సాగింది. నేనెక్కడా వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డిని అనుకరించే ప్రయత్నం చేయలేదు. ఆ పాత్రలో ఉన్న ఆత్మని అర్థం చేసుకొని నటించాను. ఈ సినిమా కోసమని నేను ప్రత్యేకంగా పరిశోధన చేసిందంటూ ఏమీ లేదు. అంతా దర్శకుడే చేశాడు. ఆయన సిద్ధం చేసిన స్క్రిప్టుకి తగ్గట్టుగా నేను నటంచానంతే’’.

* ‘‘రాజకీయ నేపథ్యంలో సాగే కొన్ని సినిమాలు చేశాను. ‘అంబేడ్కర్‌’, ‘బషీర్‌’ వంటి బయోపిక్‌లు కూడా చేశాను. వాటితో పోలిస్తే ఇది పూర్తి భిన్నమైన చిత్రం. నా పాత్రకి నేనే డబ్బింగ్‌ చెప్పుకున్నాను. ఎక్కువ భాషలు మాట్లాడటం అంటే ఇష్టం. పైగా మలయాళం, తెలుగు మధ్య చాలా పోలికలు ఉంటాయి. తెలుగులో అద్భుతం అంటారు, మలయాళంలో అద్బుతం అని ఒత్తు లేకుండా పలుకుతారు. భాషపై ఆసక్తితో తెలుగు సినిమాలు కూడా చూస్తుంటా. ఈ మధ్య ‘రంగస్థలం’, ‘భరత్‌ అనే నేను’ చిత్రాల్ని చూశా’’.

* ‘‘మీకూ రాజకీయాల్లోకి ప్రవేశించాలనే ఆలోచన ఉందా అని అడుగుతుంటారు. మనది ప్రజాస్వామ్య దేశం కాబట్టి, నేను కూడా రాజకీయాల్లో ఉన్నట్టే. 38 యేళ్లుగా సినీ రంగంలో ఉన్నాను. ఇప్పుడు ప్రత్యేకంగా రాజకీయాల్లోకి ఎందుకు? సినిమానే నా రాజకీయం. సినిమా నా ప్యాషన్‌. ఆసక్తి ఉన్నప్పుడు ఎలాంటి సవాళ్లయినా స్వీకరిస్తుంటాం. నేను చేసేవన్నీ నా డ్రీమ్‌ రోల్సే. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమ చాలా ఆరోగ్యకరంగా ఉంది. కమర్షియల్‌ చిత్రాలు, ప్రయోగాలు, అర్థవంతమైన చిత్రాలు రూపుదిద్దుకొంటున్నాయి’’.

* ‘‘ప్రేక్షకులకు ప్రత్యేకమైన మీడియా ఉందిప్పుడు. సామాజిక మాధ్యమాల ద్వారా సినిమాలపై వాళ్ల అభిప్రాయాల్ని వినిపిస్తుంటారు. నటులు వాటిని పరిగణనలోకి తీసుకోవల్సిందే, ఎప్పటికప్పుడు కొత్తగా మనల్ని మనం ఆవిష్కరించుకోవల్సిందే. ప్రతిభ అందరిలోనూ ఉంటుంది, కావల్సింది కష్టపడటమే. తెలుగు చిత్ర పరిశ్రమతో నాకు మంచి అనుబంధముంది. చిత్ర పరిశ్రమ మద్రాసులో ఉన్నప్పుడు మేమంతా అక్కడ కలిసి పనిచేసిన వాళ్లమే. ఏవీఎమ్‌ స్టూడియోలో ఒకొక్క ఫ్లోర్‌లో ఒకొక్క భాషకి చెందిన సినిమా చిత్రీకరణ జరిగేది. 1980 బ్యాచ్‌ కథానాయకుల్లో మీరు కూడా ఉన్నారా అంటే మాత్రం లేనని చెబుతాను. ఎందుకంటే నాది 2018 బ్యాచ్‌ (నవ్వుతూ)’’.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.