మంచి సినిమానే తీయాల్సిన పరిస్థితి వచ్చింది!
‘‘కళాకారుడి కంటే కూడా అతడు చేసిన పాత్రలే మరిచిపోలేని విధంగా చేస్తాయి. నటులు ఉన్నా లేకపోయినా మిగిలిపోయేది మాత్రం పాత్రలే. అలా నా నట జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే మరొక పాత్ర చేశా’’ అన్నారు ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్‌. 42 యేళ్ల సినీ ప్రయాణంలో కథానాయకుడిగా, సహ నటుడిగా ఆయన ప్రేక్షకులకు స్వచ్ఛమైన వినోదాన్ని పంచారు. హాస్యం పండించడమే కాకుండా... హృదయాల్ని మెలిపెట్టే పాత్రల్లోనూ ఒదిగిపోయి భావోద్వేగాల్ని పండించారు. రాజేంద్రప్రసాద్‌ ప్రధాన పాత్రధారిగా... సంజోష్‌ హర్షిత జంటగా నటించిన ‘బేవర్స్‌’ ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్‌ బుధవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ...

‘‘మొదట్నుంచీ నా చిత్రాల్లో విలువలతో కూడిన హాస్యం, విలువలతో కూడిన కథలకే చోటు. నలభై రెండేళ్లుగా ఒక మంచి నటుడిగా ప్రేక్షకుల మనసుల్లో సంపాదించిన స్థానాన్ని కోల్పోలేదంటే కారణం అదే. ఈమధ్య రెండు అగ్రదేశాల్లో జీవిత సాఫల్య పురస్కారం లభించింది. అక్కడికెళ్లినప్పుడు నన్ను నా పేరుతో ఎవ్వరూ పిలవలేదు. అప్పుల అప్పారావు అనీ, దివాకరం అనీ నా పాత్రల పేర్లతోనే పలకరించారు. అలాంటి మరొక పాత్రని ‘బేవర్స్‌’ సినిమాలో చేశా. దర్శకుడు రమేష్‌ చెప్పాల ‘మీ శ్రేయోభిలాషి’తో రచయితగా నాకు పరిచయం. ‘ఆ నలుగురు’ తర్వాత మళ్లీ ఎలాంటి సినిమా చేయాలా అని ఆందోళనలో ఉన్న నాకు, అంతకంటే మంచి కథని చెప్పి ‘మీ శ్రేయోభిలాషి’ సినిమా తీశారు. సమాజంలో తండ్రి, పిల్లల మధ్య అనుబంధం గురించి ‘ఆ నలుగురు’లో చెప్పాం. అది కాకుండా ఆ బంధం నేపథ్యంలో మరో కోణాన్ని ఆవిష్కరిద్దాం అంటూ రమేష్‌ చెప్పాల ఈ కథ వినిపించారు. అసలు తల్లిదండ్రుల బాధ్యత ఏమిటి? పిల్లల బాధ్యత ఏమిటనేది? ఈ చిత్రంలో వినోదాత్మకంగా చెప్పాం’’.

* ‘‘కాలానికి అనుగుణంగానే సినిమా కథలు మారిపోతున్నాయి. ‘బేవర్స్‌’ కథ కూడా అలాంటిదే. బాధ్యత లేకుండా తిరిగేవాణ్ని బేవర్స్‌ అంటారు. కుటుంబంలో ఎవరు బాధ్యత లేకుండా తిరిగినా బేవర్సే. సమాజం ఇలా ఉందని కాకుండా, ఇలా ఉండాలని చెప్పే ప్రయత్నం ఈ చిత్రంతో చేస్తున్నాం. నాకు నచ్చిన సమకాలీన తండ్రి పాత్రని ఇందులో చేశా. కూతురుకీ, తండ్రికీ... కొడుకుకీ, తల్లికీ మధ్య ప్రేమ బలంగా ఉంటుంది. అలా కూతురుని ప్రాణంగా ప్రేమించిన ఓ తండ్రి పాత్ర కావడంతో... దాని గురించి చెబుతూ ముందస్తు విడుదల వేడుకలో మా అమ్మాయి గురించి మాట్లాడా. అది విని మా అమ్మాయి కొట్టడానికి వచ్చిందనుకోండి, అది వేరే విషయం (నవ్వుతూ). కొన్ని పాత్రలు నటుల్ని అంతగా లీనం చేస్తుంటాయి. అదంతా కూడా కథ గొప్పతనమే’’.

* ‘‘మంచి సినిమాని ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. చిన్న సినిమా విడుదల అనేది ఇదివరటితో పోలిస్తే ఇప్పుడు చాలా సమస్యగా మారింది. కానీ మంచి సినిమా మాత్రం ఎప్పుడూ బాగా ఆడుతుంది. అందుకే చిన్న సినిమా తీసేవాళ్లంతా చచ్చినట్టుగా మంచి సినిమానే తీయాలనే పరిస్థితి వచ్చింది. మేం కూడా ‘బేవర్స్‌’ అనే ఒక మంచి సినిమానే తీశాం. మనిషి జీవితంలో గుర్తుండిపోయే రెండు. ఒకటి పెళ్లి, మరొకటి చావు. ఎవరు ఎక్కడ పెళ్లి చేసుకొన్నా.. ‘శ్రీరస్తు శుభమస్తు...’ అంటూ సాగే నా పాట వినిపిస్తుంది. ఎవరి పెళ్లి జరిగినా అందులో నేనుంటానే ఓ అనుభూతికి గురవుతుంటా. అలాగే ఎవరైనా చనిపోయినప్పుడు కూడా ‘ఒక్కడై పుట్టడం, ఒక్కడై పోవడం, నడుమ ఈ నాటకం విధిరాత...’ అనే ‘ఆ నలుగురు’లోని పాట వినిపిస్తుంది. అలా ఎప్పటికీ గుర్తుండిపోయేలా తండ్రీకూతుళ్ల బంధం గురించి ‘బేవర్స్‌’లో ఓ పాట ఉంది. సుద్దాల అశోక్‌తేజ రాసిన ఆ పాటని, ఎ.ఆర్‌.రెహమాన్‌ తరహాలో ఆలపించాడు సంగీత దర్శకుడు సునీల్‌కశ్యప్‌. దర్శకనిర్మాతలు మంచి అభిరుచితో ఈ చిత్రం తీశారు’’.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.