ఆయన ఆశీర్వదించారు...హీరో అయ్యాను
‘నిన్ను కథానాయకుడిగా చూడాలనేది నా కోరిక అని మా తాతయ్య అనేవారు. అది నెరవేరకుండానే వెళ్లిపోయారు. ఇప్పుడాయన ఆశీర్వదించడం వల్లనే కథానాయకుడు కాగలిగాను. తాతయ్య కోరికిలా తీరింది’’ అని చెప్పారు రాజేష్‌ శ్రీచక్రవర్తి. ప్రముఖ సంగీత దర్శకుడు చక్రవర్తి మనవడు. చక్రవర్తి తనయుడైన సంగీత దర్శకుడు శ్రీ కుమారుడు. రాజేష్‌ శ్రీచక్రవర్తి కథానాయకుడుగా నటించిన చిత్రం ‘శివకాశీపురం’. ప్రియాంకశర్మ కథానాయికగా నటించింది. హరీష్‌ వట్టికూటి దర్శకుడు. మోహన్‌బాబు పులిమామిడి నిర్మాత. ఈ సినిమా శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో రాజేష్‌ శ్రీచక్రవర్తి విలేకర్లతో మాట్లాడారు.



*
‘‘పల్లెటూరి నేపథ్యంలో సాగే కుటుంబ కథా చిత్రం. మంచిర్యాల సమీపంలోని కాశీపురం ఊళ్లో నిజంగానే ఓ కోట నేపథ్యంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా అల్లిన కథతో తెరకెక్కింది. నేను మానసికంగా ఇబ్బంది పడే ఆటో డ్రైవర్‌గా నటించాను. ఆ కోటలో దాగిన అమ్మనీ, ప్రేమించిన ప్రియురాల్నీ ఎలా దక్కించుకున్నాననేదే ఆసక్తికరం. హారర్‌ సినిమా కాదు. నాలుగు పాటలున్నాయి. పవన్‌ శేషా స్వరాలు ఆకట్టుకుంటున్నాయి’’.

*
‘‘నేను బికామ్‌ చదివాను. తాత, నాన్న సంగీతదర్శకులయినా నాకు ఆ వైపు ఆసక్తి లేదు. సినిమా గురించి సాంకేతికంగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ‘కల్యాణవైభోగమే’ సినిమాకి నందినీ రెడ్డి వద్ద దర్శకత్వశాఖలో పనిచేశా. సత్యానంద్‌ మాస్టారు వద్ద నటన, తదితర అంశాల్లో శిక్షణ పొందా. ‘నువ్వు చాలా హాట్‌ గురూ’ లఘు చిత్రంలో నటించా. ఇప్పుడు కథానాయకుడుగా అవకాశాలు వస్తున్నాయి. ఈ సినిమా విడుదల తర్వాత ఎలాంటివి చేయాలో నిర్ణయించుకుని ముందుకు సాగుతా. కథానాయకుడిగానే కాదు, మంచి మంచి పాత్రలు ఎలాంటివి వచ్చినా వదులుకోను’’.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.