అప్పుడు తెరపై చూశా.. ఇప్పుడు తెర పంచుకున్నా

‘‘మంచి కథలు దొరకాలే కానీ, భాషతో సంబంధం లేకుండా ఏ చిత్రసీమలో పనిచేయడానికైనా నేను సిద్ధమే’’ అంటోంది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. బాలీవుడ్‌ చిత్రం ‘యారియా’తో వెండితెరపై మెరిసిన ఈ అమ్మడు.. ఆ తర్వాత దక్షిణాదిలోనే ఎక్కువగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక్కడ మహేష్‌బాబు, జూ.ఎన్టీఆర్, రామ్‌చరణ్, అల్లు అర్జున్‌ వంటి స్టార్లతో జోడీ కట్టి మెరిపించింది. అయితే ఇటీవల కాలంలో మళ్లీ ఉత్తరాది వైపు దృష్టి సారించిన ఈ భామ.. గతేడాది ‘అయ్యారే’ చిత్రంతో సందడి చేసింది. ఇక ఇప్పుడు అజయ్‌ దేవ్‌గణ్‌ వంటి స్టార్‌హీరోతో కలిసి ‘దే దే ప్యార్‌ దే’ చిత్రంతో మురిపించేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఆంగ్లమీడియాతో ముచ్చటించింది రకుల్‌. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..

* ‘‘నాది డబ్బు, ఇతర వ్యక్తిగత అవసరాల కోసం పరుగులు పెట్టే వ్యక్తిత్వం కాదు. నటనపై ఉన్న మక్కువతోనే సినిమాల్లోకి అడుగుపెట్టాను. నాకిష్టమైన ఈ పని కోసమే ఎక్కువ తపన పడుతుంటా. దక్షిణాదిలో గొప్ప పేరు రావడం, అక్కడ స్టార్‌గా ఎదగడం వంటివన్నీ ఒక్కరోజులో జరిగినవి కావు. ఆ స్థాయికి చేరుకోవడానికి చాలా కష్టపడ్డా. కష్టపడేతత్వం, పని పట్ల నాకున్న నిబద్ధత వల్లే ఇవి సాధ్యమయ్యాయి’’.


* ‘‘ప్రజలు ఎక్కువగా నన్ను సినిమాల్లోనే చూడాలనుకుంటున్నారు. వారికోసమే మంచి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నా. భాషతో సంబంధం లేకుండా అన్ని చిత్రసీమల్లోనూ సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నా. దీని కోసం 24 గంటలు కష్టపడగలను’’.

*
‘‘యారియా’ చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టే నాటికి నాకిక్కడ ఎవరూ పెద్దగా తెలియదు. చాలా చిన్నదాన్ని. కనీసం చిత్ర పరిశ్రమపై సరైన అవగాహన కూడా లేదు. కానీ, ఆ సినిమాతో మంచి గుర్తింపు దక్కింది. దీనితర్వాత తెలుగు చిత్రంతో దక్షిణాది ప్రేక్షకుల ముందుకు రావడం. ఇక్కడ అన్ని భాషల్లో స్టార్‌గా ఎదగడం వంటివి ఎంతో సంతోషాన్నిచ్చాయి. ఈ గుర్తింపుని ఇలాగే నిలబెట్టుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నా’’.


*
‘‘దే దే ప్యార్‌ దే’లో నటనకు మంచి అవకాశమున్న పాత్ర దక్కింది. అజయ్‌ దేవ్‌గణ్, టుబు వంటి జాతీయ అవార్డ్‌ విన్నింగ్‌ నటులతో తెర పంచుకోగలగడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వారి నటనను చూస్తూ పెరిగా. అలాంటి వారితో ఇప్పుడు ఒక ఫ్రేంలో నటించడం సంతోషాన్నిస్తోంది. అజయ్‌ సర్‌ అంత సీనియర్‌ అయినప్పటికీ సెట్స్‌లో నన్నెప్పుడూ ఓ కొత్త నటిగా చూడలేదు. నటన పరంగా సెట్స్‌లో ప్రతిఒక్కరూ మంచి ప్రోత్సాహాన్నందించారు. ఇది వినోదాత్మక చిత్రమైనప్పటికీ.. మానవీయ విలువలకు, భావోద్వేగాలకు కొదవు ఉండదు’’.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.