రేణుదేశాయ్‌ ఘాటు సమాధానం

నటి రేణూ దేశాయ్‌ ఇటీవల కర్నూలు జిల్లా మంత్రాలయంలో పర్యటించిన విషయం తెలిసిందే. అదే ప్రాంతంతో జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ కూడా పర్యటించారు. ఇప్పుడీ విషయంపై సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది. ప్రజల సమస్యలు తెలుసుకొనేందుకు పవన్‌ కళ్యాణ్‌ పర్యటిస్తుండగా, రైతాంగ సమస్యలను తెరకెక్కించే పనిలో రేణూ దేశాయ్‌ పర్యటించారు. భార్యభర్తలుగా విడిపోయిన తరువాత వీరిద్దరూ ఒకే ప్రాంతంలో పర్యటనలో పాల్గొనటం రాజకీయంగా కూడా చర్చకు దారితీసింది. తన పర్యటనకు ఎలాంటి రాజకీయ సంబంధం లేదని రేణు దేశాయ్‌ అప్పుడే క్లారిటీ ఇచ్చింది. అయినా కూడా కామెంట్స్‌ ఆగకపోవడంతో మరోమారు సోషల్‌ మీడియా వేదికగా ఘాటుగా రేణు దేశాయ్‌ సమాధానం ఇచ్చారు. ‘‘పవన్‌ కళ్యాణ్‌ గారు, నేను ఒకేసారి కర్నూలు జిల్లాలో పర్యటించడం వలన అనేక ఊహాగానాలు, పిచ్చి కామెంట్స్‌ చేస్తున్నారు. నా పర్యటనకు ప్లానింగ్‌ రెండు నెలల క్రితమే జరిగింది. వాస్తవానికి వారం రోజుల ముందే నా పర్యటన జరగాల్సింది. కానీ పరిస్థితులు అనుకూలించకపోవడం వలన వాయిదా వేశాం. ఇది కేవలం అనుకోకుండా జరిగిన సంఘటన మాత్రమే అని’’ అన్నారు. తాను రైతుల సమస్యల గురించి రూపొందిస్తున్న ఓ సినిమా కోసం పనిచేస్తునట్లు రేణు దేశాయ్‌ స్పష్టం చేశారు. దానికి సంబంధించి రైతులతో ఒక కార్యక్రమాన్ని చేయాలని కూడా అనుకున్నామని, అందుకోసమే కర్నూలు జిల్లాలో పర్యటించానని చెప్పారు. ‘‘ఈ విషయం గురించి అనవసరమైన కామెంట్స్‌ చేసే వారంతా మూర్ఖులు. ఒక మంచి పని కోసం వస్తే ఎందుకు ఇంత రచ్చ. మీ నాన్న, నేను ఒకే టౌన్‌లో ఉన్నాం అని అకీరాకు చెప్పగానే చాలా సంతోషించాడు. మీకేంటి సమస్య?’’ అని రేణు ఘాటుగా ప్రశ్నించారు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.