
రీతూవర్మ... నేటితరం అమ్మాయిల ఆలోచనలకు ప్రతిబింబం. స్వతంత్ర భావాలు కలిగిన యువతుల ఆత్మవిశ్వాసానికి ప్రతీక. ‘పెళ్లిచూపులు’లోని చిత్ర పాత్రతో ఆమె అంతటి ప్రభావం చూపింది మరీ! అచ్చమైన ఈ తెలుగమ్మాయి తొలి అడుగుల్లోనే కుర్రాళ్ల హృదయాల్ని దోచుకొంది. ఇప్పుడు తమిళ ప్రేక్షకుల మనసుల్నీ కొల్లగొట్టే పనిలో ఉంది. ‘పెళ్లిచూపులు’తో ఉత్తమ నటిగా నంది పురస్కారాన్ని సొంతం చేసుకొన్న రీతూ ‘హాయ్’తో చెప్పిన ముచ్చట్లివీ...
ఇంకొన్నాళ్లు మీరు ‘పెళ్లిచూపులు’ చిత్రగానే గుర్తుండిపోతారేమో కదా...?
ఆ సినిమా ప్రేక్షకులపై వేసిన ముద్ర అలాంటిది. విడుదలై చాలా రోజులైనా పరిశ్రమలోనూ, బయట ఏదో రకంగా ఆ సినిమాని గుర్తు చేస్తూనే ఉంటారు. నేనూ అంతే. ఆ సినిమాలో నా నటనని చూసే దర్శకుడు గౌతమ్ మేనన్ నన్ను సంప్రదించారు. తమిళ చిత్రసీమకి వెళ్లాక ఆ సినిమా గురించి, అందులో నా నటన గురించి తరచుగా గుర్తు చేస్తూనే ఉన్నారు. అందులో నటనకుగానూ ఉత్తమ నటిగా ఈమధ్యే నాకు నంది అవార్డు వచ్చింది. ఇటీవల నా పుట్టినరోజుకి ఒక రోజు ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అధికారికంగా లేఖ వచ్చింది. దాంతో ఈసారి నా పుట్టినరోజు సంబరాలకి మరింత జోష్ వచ్చింది.
చదువుకొనే రోజుల్లోనూ ప్రతిభ చూపేవాళ్లా?
మంచి విద్యార్థినండీ. పదో తరగతిలో స్కూల్ ఫస్ట్ నేనే. కాలేజీలో ఎలాంటి పోటీల్లోనైనా ముందుండేదాన్ని. ఇంజినీరింగ్ అయ్యాక మోడలింగ్ చేశా. అందాల పోటీల్లో పాల్గొన్నా. దిల్లీ వరకు వెళ్లొచ్చా. సినిమాల్లోకి రాకముందు తరుణ్‌భాస్కర్ దర్శకత్వంలో ‘అనుకోకుండా...’ అనే లఘు చిత్రంలో నటించా. అందులో నటనకీ నాకు పురస్కారాలొచ్చాయి.
నిజ జీవితంలో మీకు పెళ్లిచూపులయ్యాయా?
నాకు పెళ్లిచూపులు జరగవండీ (నవ్వుతూ). ఎందుకంటారా? ప్రేమ పెళ్లే ఇష్టం నాకు.
ఎవరినైనా ప్రేమిస్తున్నారా?
అలాంటిదేమీ లేదు. నేను సింగిల్‌గా, హ్యాపీగా ఉన్నా. అరేంజ్డ్ మేరేజ్, ఆ సెటప్ అదంతా నాకు ఇష్టం లేదు. నమ్మకం, ఒకరినొకరు అర్థం చేసుకోవడం ప్రేమతోనే సాధ్యం అనుకొంటా. నాకో అక్క ఉంది, తనూ ప్రేమ పెళ్లే చేసుకొంది. ఏ సమస్య రాలేదు. మా అమ్మానాన్నలు పరిణతితో ఆలోచించే వ్యక్తులు. ఒకవేళ నిజంగా నాకు ఎవరైనా నచ్చితే ఇంట్లో ధైర్యంగా చెప్పేస్తా.
లవ్ ఎవరూ ప్రపోజ్ చేయలేదా?
అదెందుకో తెలియదు కానీ... నేరుగా వచ్చి ‘నిన్ను ప్రేమిస్తున్నా’ అని ఇప్పటిదాకా ఎవరూ చెప్పలేదు. కాలేజీలో అయితే నువ్వంటే ఫలానావాళ్లకి ఇష్టం అనీ, అదనీ ఇదనీ వేరేవాళ్ల నుంచి తెలిసేది. ఒకవేళ నా దగ్గరికొచ్చి ప్రేమిస్తున్నా అని చెప్పుంటే నేనెలా స్పందించేదాన్నో? ఇప్పుడైతే సామాజిక మాధ్యమాల్లో లవ్ ప్రపోజల్స్ వస్తుంటాయి.

ఈమధ్య తమిళ చిత్రసీమకే పరిమితం అయ్యారు. కారణమేమిటి?
అక్కడ ఆసక్తికరమైన కథల్లో నటించే అవకాశాలు లభిస్తున్నాయి. అయినా ఇప్పుడు తెలుగు, తమిళం అని వేరుగా చూడాల్సిన అవసరం లేదు. దాదాపు చిత్రాలు తెలుగులోనూ విడుదలవుతుంటాయి కాబట్టి నేను తమిళానికే పరిమితమవుతున్నట్టు అస్సలు అనిపించడం లేదు. తెలుగు కథలూ వింటున్నా.
తమిళంలో విక్రమ్‌తో కలిసి ‘ధృవనక్షత్రం’లో నటిస్తున్నారు. ఆ అవకాశం ఎలా వచ్చింది?
‘పెళ్లిచూపులు’ రీమేక్‌లో నటిస్తారా అని మొదట గౌతమ్ మేనన్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. నేను చేస్తా అని చెప్పా. మూడు నెలల తర్వాత మళ్లీ అక్కడ్నుంచే ఫోన్ చేసి విక్రమ్‌తో కలిసి ‘ధృవనక్షత్రం’లో నటించాలని చెప్పారు. వెంటనే ఒప్పుకొన్నా.
బాగా తింటా... కసరత్తులు చేస్తా
కుటుంబం, సినిమా, స్నేహితులు, సంగీతం... ఇవే నా ప్రపంచం. అప్పుడప్పుడూ వంటింట్లోకి దూరిపోయి, కొత్త వంటకాల్ని ప్రయత్నిస్తుంటా. చూడ్డానికి ఇలా కనిపిస్తుంటాను గానీ, బాగా తింటా. తిండికి తగ్గట్టుగా జిమ్‌లో కసరత్తులూ చేస్తుంటా. వ్యక్తిగతంగా చాలా సింపుల్‌గా ఉంటా. సౌకర్యంగా ఉండే దుస్తులే నా ఫ్యాషన్.
అదే నాకు ప్రత్యేకం
నా పుట్టిన రోజున మా అపార్ట్మెంట్లో ఉన్న స్నేహితులు, పాఠశాల స్నేహితులందరినీ పిలిచి వాళ్ల మధ్య కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకొనేవాళ్లం. పాఠశాల అసెంబ్లీలో అదే రోజు ఫలానావాళ్ల పుట్టినరోజు అని ప్రకటించేవాళ్లు. అది విన్నప్పుడు భలే థ్రిల్‌గా అనిపించేది. ఇప్పుడు శుభాకాంక్షలు చెప్పేవాళ్ల సంఖ్య పెరిగింది. ప్రత్యేకమంటే మా నాన్న ఇచ్చే పుష్పగుచ్ఛమే. అమ్మానాన్నలు చిన్నప్పుడు నా ప్రతి పుట్టినరోజుకూ ఏదో ఒక బహుమతి ఇచ్చేవాళ్లు