నా కుటుంబంతో ‘మనం’ చేశా!
‘‘నాది నాది అంటే కిరాయితనం. మాది మాది అంటే పరాయితనం. మనది మనందరిదీ అంటే మనతనం, మంచితనం, మగతనం’’ అంటారు సాయికుమార్‌. ఎక్కడెక్కడో ఉన్న కుటుంబ సభ్యులందరినీ ఒక వేదికపైకి తీసుకొచ్చి ‘మనం’ అనిపిస్తున్నారాయన. సాయికుమార్‌ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమవుతున్న ‘మనం’ కార్యక్రమం ఎంతో ప్రజాదరణ పొందింది. కుటుంబ విలువల్ని చాటి చెబుతూనే, చక్కటి వినోదాన్ని పంచుతోంది. వందో ఎపిసోడ్‌కి చేరుకున్న సందర్భంగా సాయికుమార్‌ కుటుంబమే ఈసారి ‘మనం’ అంటూ ముందుకొచ్చింది. భోగి పండగ రోజున వినోదాలు పంచనుంది. ఈరోజు రాత్రి 9.30కి ఈటీవీలో ‘మనం’ వందో ఎపిసోడ్‌ ప్రసారమవుతోంది. ఈసందర్భంగా ప్రముఖ నటుడు, బుల్లితెర వ్యాఖ్యాత సాయికుమార్‌ ‘ఈనాడు సినిమా’తో ప్రత్యేకంగా ముచ్చటించారు.

* ఈసారి మీ ఇంట్లో సంక్రాంతి సందడి ముందే మొదలైనట్టుంది కదా?
నిజంగా ఈ సంక్రాంతి నా జీవితంలో ఒక గొప్ప జ్ఞాపకం. భవిష్యత్తులో నాదైన పుస్తకం తిరగేసుకుంటే అందులో ఇదొక ముఖ్యమైన పేజీ అవుతుంది. ‘మనం’ వందో ఎపిసోడ్‌కి చేరుకోవడం, అది కూడా సంక్రాంతికి కుదరడం, అందులో మా కుటుంబం పాల్గొనడం చాలా సంతోషాన్నిచ్చింది. ఇదివరకు ‘వావ్‌’ షోలో మా నాన్న, భార్య, పిల్లలు, కోడలు, అల్లుడు, మా చెల్లెళ్లు, తమ్ముళ్లు మాత్రమే కనిపించాం. ఈసారి జగమంత కుటుంబంతో కలిసి ‘మనం’ చేయాలనిపించింది. అదే ఈ రోజు ఎపిసోడ్‌గా మీ ముందుకు వస్తోంది.

* ఎక్కడెక్కడో గడుపుతున్న వాళ్లందరినీ కలపడం ఎలా సాధ్యమైంది?
సాయికి సందడి ఇష్టమనేది మా ఇంట్లో అందరికీ తెలుసు. ప్రతి నెల ఇలాంటి హంగామా ఏదో ఒకటి ఉంటుంది. మా కుటుంబం మరింత పెద్దదైంది. మంచి వియ్యంకుల వారు వచ్చారు. వాళ్ల కుటుంబాలు, ఇద్దరు చెల్లెళ్లు, వాళ్ల కుటుంబాలు, మా అన్నయ్యలు, బాబాయ్‌లు, పెద్దమ్మలతో పాటు, నా భార్య సురేఖ కుటుంబం... ఇలా అందరం కలిశాం. వీళ్లే కాదు, ఇంటి నుంచి బయలుదేరిన తర్వాత నన్ను చూసుకునే మరో కుటుంబం కూడా ఉంది. నా మేకప్‌మేన్, కాస్ట్యూమర్, ప్రొడక్షన్‌ అసిస్టెంట్, మేకప్‌ అసిస్టెంట్, నా రథసారథి డ్రైవర్‌... వాళ్లందరినీ పరిచయం చేస్తూ నేను కూడా భావోద్వేగానికి గురయ్యా. మా మేనత్త కూతురుని చేసుకున్న వెంట్రావుగారనే ఆయన దిల్లీలో ఉంటారు. నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ లా ఉప కులపతి ఆయన. మా అన్నయ్య బరంపురంలో ఉన్నత స్థానంలో ఉన్నారు. వారితోపాటు, విజయనగరం, బెంగుళూరు.. ఇలా పలు ప్రాంతాల నుంచి వచ్చారు.

* కుటుంబం, బంధాలు, అనుబంధాల గురించి మీ అభిప్రాయమేంటి?
కుటుంబం అనే ఒక్క మాట మనందరం కలిసి నడిచేలా చేస్తుంది. కుటుంబ వ్యవస్థ మనది. ఆ తరానికీ ఈ తరానికీ వారధిగా నేను... మనవైన విలువలు, సంస్కృతి, సంప్రదాయాలు, కట్టుబాట్ల గురించి భావి తరాలకి ఈ షోతో చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అంకుల్, ఆంటీ అని పిలవడం అలవాటైంది. ఎవరిని ఏ బంధంతో పిలవాలో, వాటి అర్థమేమిటో పిల్లలకి అర్థమయ్యేలా చెప్పాలని ఈ షోలో పాల్గొనే కుటుంబాలకి చెబుతుంటా. నేను మా మేనత్త కూతురునే చేసుకున్నా. మనం ఎట్టి పరిస్థితుల్లో కలిసే ఉండాలి. అమ్మానాన్న ఉన్నంత వరకు వాళ్లదే పెత్తనం అని చెప్పా. మా ఇంటికి కోడలుగా వచ్చినా కూతురిలా మారిపోయింది. అమ్మ సంస్కారం ఇస్తే, నాన్న స్వరం ఇచ్చారు. వాటితోనే మా జీవితం సాగిపోతోంది.

* బుల్లితెరపై చాలా కార్యక్రమాలు చేశారు. వాటితో పోల్చుకుంటే ‘మనం’ ఎలాంటి అనుభూతినిచ్చింది?
ఇదివరకు తెలుగు, కన్నడ భాషల్లో ‘వావ్‌’ షో చేశా. వాటిలో పేరున్న ప్రముఖలే ఎక్కువగా పాల్గొన్నారు. ‘మనం’ మాత్రం సామాన్య కుటుంబాలతో చేసే కార్యక్రమం. ఇప్పుడు ప్రతి కుటుంబం ‘మనం’ని వాళ్ల షోలా భావిస్తోంది. ‘మనం’ చూస్తున్నంతసేపూ మేం కూడా ఇలా ఉండాలి అనుకుంటుంటాం అన్నవాళ్లూ ఉన్నారు. ఇలాంటి షో చేస్తున్నందుకు ఈటీవీ, జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌కి చెందిన అనిల్‌ కడియాల, ప్రవీణ కడియాలకి కృతజ్ఞతలు చెప్పాలి. ఇప్పటికి 200 కుటుంబాల్ని కలిశా. వారితోపాటు, టీవీ చూస్తున్న ప్రతి ఒక్కరూ నన్ను వాళ్లలో ఒకడిగా భావిస్తున్నారు.

* మీ ఇంట్లో కళాకారులు చాలా మందే ఉన్నట్టున్నారు?
నటులు, నృత్యకారులు, సంగీత విద్వాన్‌లు ఇలా ఇంటినిండా కళాకారులే. షోలో సంక్రాంతి సంబరాలు, భోగిపళ్ల వేడుకని చేశాం. వంద మంది కుటుంబ సభ్యులం ఇందులో పాల్గొన్నాం. మా బాబాయ్‌ రూథర్‌ఫర్డ్‌ డైలాగ్‌ చెప్పారు. మా మనవరాళ్లు పాటలు పాడారు. మా మేనత్త మనవడు ఆధ్యాత్మికత గురించి బాగా చెప్పారు. డాక్టర్లు, డాక్టరేట్లు ఉన్నారు. కుటుంబం అనేది ఎంత విలువైనది, ఎన్ని విలువల్ని ఇస్తుందనేది ‘మనం’లో చెబుతుంటా. ఈ షో మంచి వినోదంతో ఉంటుంది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.