‘‘ఇంటర్నెట్ లేని కాలంలో ప్రేమలు ఎలా ఉండేవో, ప్రేమికులు ఎలా మాట్లాడుకునేవారో మా సినిమాలో అందంగా చూపించాం’’ అన్నారు సాయి రాజేశ్. ఆయన బెన్ని ముప్పానేనితో కలిసి నిర్మించిన చిత్రం ‘కలర్ ఫొటో’. సందీప్‌రాజ్ దర్శకత్వం వహించారు. సుహాస్, చాందినీ చౌదరి జంటగా నటించారు. సునీల్ ముఖ్య పాత్ర పోషించారు. ఈ నెల 23న ఓటీటీ వేదిక ‘ఆహా’లో ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా సాయిరాజేశ్ బుధవారం విలేకర్లతో మాట్లాడారు.

* ‘‘నా సొంత అనుభవాల నుంచి తయారు చేసుకున్న కథ ఇది. దర్శకుడు సందీప్ నాకు ఎప్పట్నుంచో స్నేహితుడు. ఒక పెద్ద నిర్మాణ సంస్థలో తను చేయాల్సిన సినిమా ఆలస్యమవుతూ వచ్చింది. దీంతో నేను రాసుకున్న కథని ఆయనకి ఇచ్చి ‘కలర్‌ఫొటో’ చిత్రాన్ని రూపొందించాం. రంగు వివక్ష గురించి నిజాయతీగా, నిక్కచ్చిగా చెప్పే ప్రయత్నం చేశాం. అలా అని ఇందులో సీరియస్ అంశాల్ని స్పృశించలేదు. ప్రేక్షకులకు కావల్సినంత వినోదాన్ని, భావోద్వేగాల్ని పంచుతూనే మేం అనుకున్న విషయాన్ని సూటిగా చెప్పాం’’.

* ‘సుహాస్.. ఈ కథకి, పాత్రకి తగిన హీరో అని మేమంతా ఎంపిక చేశాం. నటులు సునీల్ కథ విని వెంటనే చేస్తానని చెప్పారు. తన వల్ల సినిమాకి బలం పెరిగింది. కాలభైరవ సంగీతం ఈ చిత్రానికి మరో ప్రధానబలం.’’
* ‘‘నా తొలి రెండు సినిమాలు వాణిజ్య పరంగా విజయవంతమయ్యాయి. కానీ మా సంస్థకి రావల్సిన గౌరవం రాలేదనిపించేది. ఎవరైనా కొత్తవాళ్లతో సినిమా తీసి విజయాన్ని అందుకోవాలని నిర్ణయించుకున్నా. అలా చేసిన ప్రయత్నమే ఈ ‘కలర్ ఫొటో’. టీజర్ విడుదల కావడంతో నాకు నా సంస్థకి రావల్సినంత గౌరవం వచ్చింది.’’