ఊహకు..కల్పనకు ఇక్కడ తావు లేదు: రాజీవన్‌
కాలం.. కళ్లు ఎరుగని గుర్రపు బండి. జోరుగా సాగిపోతుంటుంది. ఆపడం ఎవ్వరికీ సాధ్యం కాదు. కాలం గమనాన్ని మార్చి, చరిత్ర పుటల్లోకి తీసుకెళ్లి నిలబెట్టే కిటుకు ఒక్క సినిమాకే తెలిసిందేమో! టైమ్‌ మిషన్‌ ఎక్కి పాత రోజుల్లోకి వెళ్లే సాంకేతిక వస్తుందో రాదో తెలీదు గానీ, సినిమాల పుణ్యమా అని చరిత్రని తెరపై చూసుకునే భాగ్యం దక్కుతోంది. ‘సైరా నరసింహారెడ్డి’తో మరోసారి అలాంటి అవకాశమే వచ్చింది. తొట్ట తొలి స్వాతంత్య్రసమరయోధుడి కథ ఇది. బ్రిటీషు దొరలు తమ ఇనుప పాదాల కింద భారతీయుల స్వేచ్ఛని గడ్డిపూవ్వుల్లా నలిపేస్తున్న కాలమది. అప్పటి కోటలు, అప్పటి పల్లెలు, ఆనాటి జీవన చిత్రాన్ని ‘సైరా..’ కళ్లముందు ఉంచబోతోంది. చరిత్రలో నిలిచిపోయిన ఓ వీరుడి కథని ఈ తరానికి అర్థమయ్యేలా చెప్పడం ఎంత కష్టమో, ఆనాటి పరిస్థితుల్ని ఒడిసిపట్టి, దానికి అనుగుణంగా సెట్స్‌ని రూపొందించడం కూడా అంతే కష్టం. ఆ పనిని ప్రముఖ కళా దర్శకుడు రాజీవన్‌కి అప్పగించింది ‘సైరా’ బృందం. ఈ రంగంలో దక్షిణాదిన పేరుమోసిన ‘కళా’కారుడాయన.‘సెవెన్త్‌ సెన్స్‌’, ‘మనం’, ‘నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా’, ‘ధృవ’లాంటి చిత్రాలకు కళా దర్శకుడిగా పనిచేసి పేరు తెచ్చుకున్నారు. ఇంగ్లిష్, హింది, తమిళ కథలకూ తన కళా నైపుణ్యం అద్దారు. ఈ సందర్భంగా రాజీవన్‌తో ‘ఈనాడు సినిమా’ ప్రత్యేకంగా ముచ్చటించింది.


‘‘ధృవ చిత్రానికి పనిచేసే సమయంలోనే సురేందర్‌రెడ్డితో నాకు మంచి ట్యూనింగ్‌ కుదిరింది. ఓరోజు చెన్నైలో ఉండగా ఫోన్‌ చేశారు. ‘డార్లింగ్‌.. మనం మళ్లీ కలసి ఓసినిమాకి పనిచేద్దాం. ఈసారి స్కేలు చాలా పెద్దది. చిరంజీవిగారు హీరో’ అన్నారు. ‘ఇంకేం చెప్పకండి. ఈ సినిమా నేను చేస్తా’ అని మాటిచ్చేశాను. ఈ సినిమాకి సంబంధించి క్లుప్తంగా కాస్త సమాచారం పంపించారు. అది చదువుకుని హైదరాబాద్‌ వచ్చేశాను. ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’కి సంబంధించిన రిఫరెన్సులు పెద్దగా దొరకలేదు. ఫొటోలు అస్సలు లేవు. కొన్ని ఇలస్ట్రేషన్లు దొరికాయంతే. చరిత్రకు సంబంధించిన కథ ఇది. మా ఊహకు, కల్పనకూ ఇక్కడ తావు లేదు. అలాగని పూర్తిగా వాస్తవ చిత్రణ చేయలేం. ఆ రెండింటి మధ్య గీతని సరిగా అర్థం చేసుకోవాల్సి ఉంది. కొన్ని సినిమాలు చరిత్రని తప్పుగా చూపించాయి. ఆ తప్పు మేం చేయదలచుకోలేదు. చరిత్రకు సజీవ రూపం ఇచ్చే ప్రయత్నం చేశాం.

2017 మార్చిలో ప్రీ ప్రొడక్షన్‌ పనులు ప్రారంభమయ్యాయి. నా దగ్గర పనిచేసి, ఇప్పుడు కళా దర్శకులుగా మారిన ఓ ముగ్గుర్ని పిలిచి టీమ్‌గా తయారు చేశాను. వాళ్లకు చరిత్రపై చక్కటి అవగాహన ఉంది. అది ‘సైరా’కి బాగా పనికొచ్చింది. మరో ముగ్గురు ఆర్టిస్టుల్ని మరో టీమ్‌గా ఏర్పాటు చేసి స్కెచ్చులు తయారు చేయించాం. చిరంజీవి పాత్ర ఎలా ఉంటుంది? నయనతార ఎలా కనిపిస్తుంది? ఇలా ప్రతి పాత్రకూ ఓ స్కెచ్‌ తయారు చేశాం. ఈ సినిమాకి సెట్స్‌తో పాటుగా కాస్ట్యూమ్స్‌ కూడా చాలా అవసరం. రుద్రా మేనన్‌ అనే కాస్ట్యూమ్‌డిజైనర్‌ని పిలిపించి కొన్ని డిజైన్లు తయారు చేయించాను. 22మంది టైలర్లు అయిదు నెలల పాటు రేయింబవళ్లూ కష్టపడి 15 వేల జతల దుస్తుల్ని కుట్టారు. అందుకు సంబంధించిన ఫ్రాబ్రిక్‌ని హైదరాబాద్‌లోనే కొనుగోలు చేశాం. బ్రిటీష్‌ దొరలు, రాణులు ఆ కాలంలో ఎలాంటి సిల్క్‌ వాడారో.. సరిగ్గా ఆ లుక్‌ వచ్చేలా దుస్తుల్ని డిజైన్‌ చేశాం.


ఈ సినిమా కోసం 42 సెట్స్‌ వేశాం...
కథ మొత్తం తయారయ్యేలోగా ఆ కథకు తగిన ఆర్కిటెక్చర్‌ని కూడా తయారు చేశాం. ఆ సమయంలో బ్రిటీష్‌ కార్యాలయాలు ఎలా ఉండేవి? సామాన్య ప్రజల ఇళ్లు ఎలా ఉండేవి? ఇవన్నీ తెలుసుకోవడానికి పాత పుస్తకాలన్నీ తిరగేశాం. అందులో రాత రూపంలో వివరణ ఉంది. దానికి దృశ్య రూపం ఇచ్చాం. కొన్ని డిజైన్లు తయారు చేసి, వాటిని త్రీడీ యానిమేషన్‌లో రూపొందించాం. పెయింట్‌ వేస్తే కేవలం ఒక్క కోణమే కనిపిస్తుంది. అదే త్రీడీ యానిమేషన్‌ అంటే 360 డిగ్రీల్లోనూ ఆ సెట్‌ ఎలా ఉండబోతోందో చూపించొచ్చు. ఇలా చేయడం వల్ల ఛాయాగ్రహకుడికీ, దర్శకుడికీ పని సులభం అవుతుంది. సీజీ వర్క్‌ విషయంలోనూ స్పష్టత వస్తుంది. రాయలసీమలోని 64 గ్రామాలకు రాజు.. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఆ 64 గ్రామాల్నీ తెరపై చూడొచ్చు. ఒక్కో గ్రామానికీ ఒక్కో కథ ఉంటుంది. ఒక్కో గ్రామానికి ఒక్కో అందం ఉంటుంది. దేని కళాకృతి దానిదే. ఈ సినిమా కోసం దాదాపుగా 42 సెట్స్‌ వేశాం. అందులో 15 సెట్లు చాలా పెద్దవి. ‘సైరా’లో నౌకాశ్రయం, జగన్నాథ కొండ చాలా కీలమైన అంశాలు. వాటి చుట్టూ చాలా కథ నడుస్తుంది. అందుకే ఈ సెట్స్‌కి చాలా ప్రత్యేకంగా తీర్చిదిద్దాం. సినిమాలోని ప్రతి షాట్‌నీ ముందే డ్రాయింగ్‌ రూపంలో చూసేశాం. అందుకోసం కొన్ని వేల స్కెచ్చులు వేయాల్సి వచ్చింది.


ఆయుధాలు మేం సొంతంగా డిజైన్‌ చేశాం...
‘సైరా’లో మరో కీలక అంశం... యుద్ధ సన్నివేశాలు. అందులో కొంత భాగం హైదరాబాద్‌లోనే తెరకెక్కిచాం. సగానికి పైగా జార్జియాలో చిత్రీకరించాం. జార్జియాలోనే ఎందుకు అంటే.. మాకు పదిహేను వందల మంది బ్రిటీషు సైన్యం కావాలి. వాళ్లందరినీ హైదరాబాద్‌ తీసుకొచ్చి, తర్ఫీదులిచ్చి సినిమాకి తగినట్టుగా తీర్చిదిద్దడానికి చాలా సమయం పడుతుంది. డబ్బులు కూడా వృథా అవుతాయి. అందుకే జార్జియా వెళ్లాం. అక్కడ 28 రోజుల పాటు షూటింగ్‌ జరిగింది. ఆ కాలంలో బ్రిటీషు సైనికులు ఎలాంటి తుపాకులు వాడారన్నదానికి మాకు కొన్ని నమూనాలు దొరికాయి. దాదాపు 20 తుపాకుల్ని సేకరించి, వాటి ఆధారంగా మరో రెండు వందల రైఫిల్స్‌ తయారు చేశాం. ఇరవై ఫిరంగుల్ని పునః సృష్టి చేశాం. ఈ తుపాకులతో పేల్చవచ్చు. ఫిరంగిలో మందుగుండు నింపి పేల్చితే.. భారీ బిల్డింగులు కూడా ధ్వంసం అయిపోతాయి. అంత పక్కాగా వాటిని తయారు చేశాం. ఆయుధాలన్నీ మాకు మేం సొంతంగా డిజైన్‌ చేసి తయారు చేసినవే. ‘సైరా’కోసం తయారు చేసిన ఆయుధాలు చాలా ఖరీదైనవి. ఆ ఖర్చుతో రెండు మూడు చిన్న సినిమాలు తీసేయొచ్చు.


మేమూ మారాల్సిందే...
నేను పరిశ్రమకొచ్చి ఇరవై ఏళ్లయ్యింది. అప్పటికీ ఇప్పటికీ కళారంగం చాలా మారింది. కెమెరాని బట్టే.. మిగిలిన విభాగాలు పరుగులు పెట్టాలి. కెమెరా పనితనం చురుగ్గా మారే కొద్దీ అందుకు తగ్గట్టుగా మేమూ మారాల్సిందే. ఇది వరకు సెట్‌ అంటే కృత్రిమంగా కనిపించేది. ఇప్పుడు అత్యంత సహజంగా ఉండాలి. ఓ తలుపు కనిపించాలంటే, నిజంగా ఓ తలుపు తయారు చేయడానికి ఎలాంటి కలప వాడతారో అలాంటిదే తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది. ఎక్కడ ఖర్చు పెట్టాలి? ఎక్కడ ఆదా చేయాలి? అనే విషయాలు కళా దర్శకుడికి తెలియడం చాలా అవసరం. తమలోని పనితనానికి మెరుగులు పెట్టే అవకాశాలు ఎప్పుడోగానీ రావు. అలాంటి అవకాశం వస్తే వదులుకోకూడదు. ‘సైరా’తో నాకు అది దక్కింది. కథలోనే కాదు, దాన్ని తెరకెక్కించడంలోనూ భారీ హంగులున్న సినిమా ఇది. ఇలాంటి చిత్రాలు విజయవంతం అవ్వాలి. అప్పుడే మరిన్ని మంచి చిత్రాలొస్తాయి’'.

Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.