అలాంటి ఆలోచనల్ని పక్కన పెట్టా
నటిగా నాలో ఉన్న ఓ అభద్రతా భావాన్ని తొలగించుకొన్నాకే నా సినీ ప్రయాణంలో మార్పు వచ్చిందని చెబుతోంది సమంత. కథల ఎంపికలో మరింత స్వేచ్ఛ లభించిందని, ఆ ప్రభావంవల్లే ఇప్పుడు ఉత్తమమైన చిత్రాల్లో నటిస్తున్నా అంటోంది. సమంత తెలుగుతో పాటు తమిళంలో కొన్ని చిత్రాలు చేస్తోంది. తన భర్త నాగచైతన్యతో కలిసి ఓ చిత్రంలో నటించబోతోంది. ఇటీవలే ఆమె కథానాయిక ప్రాధాన్యమున్న మరో రెండు కథల్ని విన్నారని ప్రచారం సాగుతోంది. ఒకప్పుడు మంచి పాత్రలు రాకపోతే సినిమాల నుంచి వైదొలుగుతానని చెప్పిన సమంత ఇప్పుడు మరింత జోరు పెంచింది. ఎందుకంత మార్పు అని అడిగితే... ‘‘నిజంగా ఒకప్పుడు నా ఆలోచనలు అలాగే ఉండేవి. అదృష్టవశాత్తూ అలా జరగలేదు. నాకనే కాదు... చాలామంది కథానాయికలకి ఇప్పుడు మంచి పాత్రలు లభిస్తున్నాయి. ఇది గొప్ప పరిణామం. అయితే కొంతకాలంగా వ్యక్తిగతంగానూ నాలో మార్పొచ్చింది. ఒక సినిమా చేశాక, మళ్లీ ఇంతకుమించిన పాత్ర దొరక్కపోతే ఏమవుతుందో అనే ఆందోళన వెంటాడేది. పనే జీవితం అన్నట్టుగా ఉండేది. కానీ ఇటీవల అలాంటి ఆలోచనల్ని దూరం పెట్టా.దాంతో మరింత ధైర్యంగా, వినూత్నంగా ఆలోచిస్తూ కథల్ని ఎంపిక చేసుకొంటున్నా. ఆ ప్రభావం నా నటనపైనా స్పష్టంగా కనిపిస్తోంది’’ అంటున్నారు సమంత.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.