కోరుకున్న పాత్రలే వస్తున్నాయి!
సమంత తొలి అడుగుల్లోనే నటిగా నిరూపించుకొన్నారు. ఆ తర్వాత ప్రతి సినిమాకీ మరో మెట్టు ఎక్కుతూ పరిణతిని ప్రదర్శిస్తున్నారు. ఈ యేడాది ‘రంగస్థలం’, ‘మహానటి’ వంటి చిత్రాల్లో అభినయ ప్రాధాన్యమున్న పాత్రలు చేసి మెప్పించారు సమంత. ఇప్పుడామె మరో అడుగు ముందుకేసి కథానాయిక ప్రాధాన్యంతో కూడిన ‘యు టర్న్‌’ చేశారు. పవన్‌కుమార్‌ దర్శకత్వం వహించిన ఆ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. నటిగా, అక్కినేని వారింటి కోడలుగా తన అభిప్రాయాల్ని మంగళవారం విలేకర్లతో పంచుకొన్నారు. ఆ విషయాలివీ...ఈసారి బాక్సాఫీసు దగ్గర మీ భర్తకీ, మీకు మధ్యే పోటీ ఎదురయ్యింది కదా?
ఈ పోటీని నేనస్సలు ఊహించలేదు. చైతూ సినిమా ఆగస్టు 31నే విడుదల చేయాలనుకొన్నారు. కానీ కుదరలేదు. దాంతో రెండు వారాల విరామం తర్వాత ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. మేం మాత్రం మొదట్నుంచీ సెప్టెంబరు 13 అని చెబుతూనే ఉన్నాం. మా ఇద్దరి సినిమాలు ఒకేసారి విడుదలవుతున్నాయంటే చిన్నపాటి ఉత్కంఠ ఉన్నమాట నిజం. కానీ భార్యగా నా భర్త చైతన్య విజయాన్నే కోరుకొంటా. తన విజయం తర్వాతే నాకు ఏదైనా. వేర్వేరు జోనర్లతో కూడిన సినిమా కాబట్టి ప్రేక్షకులు కూడా రెండు సినిమాల్నీ చూస్తారు.

‘యు టర్న్‌’ చేయడానికి బలమైన కారణమేమైనా ఉందా?
దర్శకుడు పవన్‌కుమార్‌ సినిమాలంటే నాకు చాలా ఇష్టం. ఆయన తీసిన ‘లూసియా’ నాకు బాగా నచ్చింది. అప్పుడే కలిసి సినిమా చేద్దామని చెప్పా. కన్నడలో ‘యు టర్న్‌’ ట్రైలర్‌ విడుదల కాగానే నేను ఫోన్‌ చేసి సినిమా స్క్రిప్ట్‌ పంపమన్నా. నాకు బాగా నచ్చడంతో రీమేక్‌ చేయాలని నిర్ణయించుకొన్నా. అయితే వేరే సినిమాల వల్ల ఇది సెట్స్‌పైకి వెళ్లడానికి కాస్త సమయం పట్టింది.

ఈ చిత్రంతో నటిగా మరింతగా పేరొస్తుందనుకోవచ్చా?
చేసిన సినిమాకి పేరు మాత్రం వస్తే సరిపోదు, డబ్బులు పెట్టిన నిర్మాతలు, పంపిణీ చేసిన వాళ్లకి లాభాలొచ్చినప్పుడు నాకు సంతోషం.

సినిమాలో మీ పాత్ర ఎలా ఉండబోతోంది?
రచన అనే ఓ పాత్రికేయురాలిగా కనిపిస్తా. ఇప్పటివరకు నేను పోషించిన పాత్రలు ఒకెత్తైతే, ఈ సినిమా మరో ఎత్తు. ఈ సినిమాలో నాలోని డ్యాన్సర్‌ని కూడా చూస్తారు. స్వతహాగా నేను మంచి డ్యాన్సర్‌ని. స్కూల్లోనూ, కాలేజీలోనూ తెగ డ్యాన్స్‌ చేసేదాన్ని. ఈ సినిమాలోని ‘ది కర్మ...’ అనే థీమ్‌ సాంగ్‌ కోసం బాగా డ్యాన్స్‌ చేశా. నా పాత్రే కాదు... ఆద్యంతం ఆసక్తికరంగా సాగే ఓ మంచి కథ ఇది. ఒక సినిమాకోసం ఎంతైనా కష్టపడతా. ప్రతి చోటా విలాసవంతమైన సౌకర్యాలే ఉండాలనుకోను. నా వరకు ఈ సినిమా చిత్రీకరణ ఓ గొప్ప అనుభవం. ఈ చిత్రం కోసం రోడ్లమీద, ఆటోల్లోనూ చిత్రీకరణ జరిపాô. అలాగే ‘మహానటి’ తర్వాత ఈ చిత్రానికి కూడా సొంతంగా డబ్బింగ్‌ చెప్పుకొన్నా. ఇకపై నా పాత్రలకి నేను డబ్బింగ్‌ చెప్పాలని నిర్ణయించుకొన్నా.

ఎక్కువగా సాహసోపేతమైన పాత్రల్నే ఎంపిక చేసుకొంటున్నారు. ప్రత్యేక కారణాలేమైనా ఉన్నాయా?
నిజంగానే ఈ యేడాది చాలా సాహసాలు చేశాను. ‘రంగస్థలం’లో పల్లెటూరి అమ్మాయిగా కనిపించడం, కొత్త దర్శకుడితో చేసిన ‘అభిమన్యుడు’, అలాగే ‘మహానటి’ చిత్రాలు కూడా నా వరకు సాహసోపేతమైన ప్రయత్నాలే. ‘యు టర్న్‌’లో స్టార్‌ హీరోలు ఎవరూ లేరు. ఇది నా సినీ ప్రయాణంలోనే అతి పెద్ద సాహసం. అయితే... ఇంతటితో ఆపను, మరిన్ని ప్రయోగాత్మక పాత్రలు చేయాలని ఉంది. నా అదృష్టంకొద్దీ నేను కోరుకొన్న పాత్రలే లభిస్తున్నాయి.

కొత్త సినిమాల కబుర్లు చెబుతారా?
శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న చిత్రం కోసం అక్టోబరు 6న సెట్స్‌పైకి అడుగుపెడుతున్నాం. ఆ రోజే నా పెళ్లి రోజు. అదే నాకు కానుక అనుకుంటా (నవ్వుతూ). తర్వాత మరో పెద్ద సినిమా ఉంటుంది. త్వరలోనే ఆ వివరాల్ని ప్రకటిస్తా. అలాగే ఇప్పటిదాకా సాధించిన అనుభవంతో, అన్నపూర్ణ స్టూడియోస్‌ అండతో భవిష్యత్తులో నిర్మాణంపై కూడా దృష్టిపెట్టబోతున్నా.  

‘‘పెళ్లి తర్వాత ఎక్కువ సినిమాలు చేస్తున్నారేంటి? అని అడుగుతుంటారు చాలామంది. పెళ్లి తర్వాత నాకు మరింత బలం చేకూరినట్టైంది. కుటుంబం అండగా ఉంది. దాంతో ఎక్కువ సినిమాలు చేయగలుగుతున్నా. ఇంట్లో సినిమాల గురించి అస్సలు చర్చించం కానీ... నేను నిజాయతీగా నా అభిప్రాయాల్ని చెబుతుంటాను. దాంతో నా భర్తతో పాటు నా కుటుంబ సభ్యులంతా కూడా వాళ్ల సినిమాలకి సంబంధించిన కథలు చెబుతుంటారు’’.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.