ఆయన్ని కొడుకుగా ఊహించుకొని చేయడం కష్టమైంది!
ఈ మధ్య సమంత పూర్తిగా మారిపోయింది. కమర్షియల్‌ సినిమాలకు చెక్‌ పెట్టింది. నటిగా తనకు సవాల్‌ విసిరే పాత్రలే చేస్తోంది. ‘రంగస్థలం’, ‘మజిలి’, ‘యూటర్న్‌’.. తమిళంలో వచ్చిన ‘సూపర్‌ డీలక్స్‌’ సినిమాలే ఇందుకు సాక్ష్యం. ఇప్పుడు ‘ఓ బేబీ’లోనూ ఓ ప్రయోగం చేసింది. డెబ్బై ఏళ్ల బామ్మ పాత్రలో పరకాయ ప్రవేశం చేసింది. శుక్రవారం ఈ చిత్రం విడుదల కానుంది. మరి బేబీగా సమంత అనుభవాలేంటి? ఈ సినిమాతో ఆమెకు ఎదురైన సవాళ్లేంటి? ఇవన్నీ ఆరా తీస్తే...


* ‘మజిలీ’, ‘ఓ బేబీ’.. ఈ రెండు చిత్రాలకు సంబంధించి ప్రచార బాధ్యతలన్నీ మీరే భుజాన వేసుకుని మోశారు. కారణమేంటి?

- (నవ్వుతూ) ఈ రెండు సినిమాల్నీ నేను అంతగా ప్రేమించాను. ‘మజిలీ’ నాకు చాలా ప్రత్యేకమైన చిత్రం. పెళ్లయ్యాక చైతో కలసి తొలిసారి నటించాను. అందుకే ఆ సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లాలనుకున్నాను. ‘ఓ బేబీ’ కథ కూడా నా మనసుకి నచ్చింది. ఈ సినిమా చూడ్డానికి జనం రావాలి. అందుకే నా తాపత్రయం.


* కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమా ఇది. ఇలాంటి చిత్రాలు జనాన్ని ఆకర్షించడం సవాల్‌గా మారింది కదా?
- అవును. నన్ను చూసి జనం థియేటర్లకు వస్తారో రారో అనే సంగతి నేను అంచనా వేయలేను. ఇది వరకు ఎన్టీఆర్, రామ్‌చరణ్, అల్లు అర్జున్‌ ఇలా... స్టార్‌ కథానాయకుల చిత్రాల్లో నేనుండేదాన్ని. వాళ్ల కోసం ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేవారు. ఇప్పుడు నన్ను చూసి ఎంత మంది వస్తారో చూడాలి. కథాబలం ఉన్న చిత్రమిది. ‘ఇది మంచి సినిమా’ అని ప్రేక్షకులకు తెలిస్తే చాలు. తప్పకుండా ఆదరిస్తారు.

* ‘యూటర్న్‌’ ఆశించిన ఫలితాన్ని ఇచ్చిందా?
- నిజానికి చాలా మంచి చిత్రమది. విమర్శకులు కూడా ఆ చిత్రాన్ని మెచ్చుకున్నారు. కానీ అది వసూళ్ల రూపంలో కనిపించలేదు. ఈ విషయంలో నేనెవరినీ నిందించడం లేదు. థ్రిల్లర్‌ చిత్రాల్లో ఉన్న సమస్యే అది. అయితే ‘ఓ బేబీ’ అలాంటి సినిమా కాదు. ఇందులో వినోదం, కుటుంబ బంధాలు, భావోద్వేగాలు, ఫాంటసీ అన్నీ ఉంటాయి. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే ప్యాకేజీలా అనిపించింది. అందుకే ఈ కథని ఎంచుకున్నాను.

* ‘ఓ బేబీ’ మీలో నటికి విసిరిన సవాళ్లేంటి?
- నా పాత్రే విచిత్రంగా ఉంటుంది. చూడ్డానికి పడుచు.. కానీ వయసు మాత్రం డెబ్బై ఏళ్లు. నేనొక్కసారిగా ముసలమ్మలా మారిపోవడం సవాలే కదా? భావోద్వేగ భరితమైన సన్నివేశాల్లో నటించడం చాలా చాలా సుభలం. ఎందుకంటే ముందు నుంచ్కీచీజి అలాంటి పాత్రలతోనే ప్రయాణం చేస్తున్నాను. చిటికెలో నాకు కన్నీరు వచ్చేస్తుంది. కానీ.. నేనెప్పుడూ నవ్వించలేదు. వినోద సన్నివేశాలు చూడడం చాలా తేలిక. కానీ అందులో నటించడం మాత్రం చాలా కష్టం. అదెంత కష్టమో ఈ సినిమాతో అర్థమైంది. రాజేంద్రప్రసాద్‌గారి వల్ల.. నవ్వించే విషయంలోనూ పాసైపోయాను. ఓ డైలాగ్‌ని ఎక్కడ మొదలెట్టాలో, ఎక్కడ కట్‌ చేయాలో ఆయన్ని చూసి నేర్చుకున్నాను. పతాక సన్నివేశాలు చాలా ఇబ్బంది పెట్టాయి. రావు రమేష్‌ని నా కొడుకుగా ఊహించుకుని నటించడం కష్టమైంది. ఓ నటిగా నాకు సవాల్‌ విసిరిన సన్నివేశం అదే.


* ఈ పాత్ర ప్రభావం నుంచి బయటకు రావడానికి సమయం పట్టిందా?
- అవును. డెబ్బై ఏళ్ల బామ్మల అలవాట్లు, వాళ్ల మాట తీరు, బాడీ లాంగ్వేజీ ఇవన్నీ అర్థం చేసుకుని ఈ పాత్రలో నటించాను. సెట్లోంచి బయటకు వచ్చిన తరవాత కూడా ఆ లక్షణాలు వదల్లేదు. ఈమధ్య ఓ షాపింగ్‌ మాల్‌ ప్రారంభోత్సవానికి వెళ్లా. అక్కడ నాతోటి హీరోయిన్లంతా పద్ధతిగా, అమ్మాయిల్లా కూర్చుంటే - నేను మాత్రం బామ్మలా కూర్చున్నా. ఆ ఫొటో చూసి నాకే నవ్వొచ్చింది.

* సినిమా సినిమాకీ నటిగా మీ పరిధి పెంచుకుంటూ వెళ్తున్నారు. విజయాలూ సాధిస్తున్నారు. ఇవన్నీ మీపై ఒత్తిడి పెంచడం లేదా?
- నిజానికి నాపై నేనే ఒత్తిడి పెంచుకుంటుంటా. నేను చేసిన సినిమా కంటే చేయబోయే సినిమా ఇంకా బాగుండాలి, నా పాత్ర ఇంకా బాగా రావాలన్న తాపత్రయం నాది. అది కచ్చితంగా ఒత్తిడి పెంచేదే. ఓ సినిమా ఒప్పుకున్నప్పుడు ఆ పాత్ర నన్ను వెంటాడాలి. రేపు షూటింగ్‌ అంటే ఈ రోజు నిద్ర పట్టకూడదు. పాత్రలో అంత దమ్ముండాలి.

* ఈ మధ్య తిరుపతికి ఎక్కువగా వెళ్తున్నారు.. భక్తి పెరిగిందా?
- చై సినిమా విడుదలకు ముందు తిరుపతి వెళ్లడం అలవాటైంది. తొలిసారి నా సినిమా విడుదలకు ముందు అక్కడికి వెళ్లాను.


* ‘అమ్మ ఎప్పుడు అవుతావు’ అని తరచూ మిమ్మల్ని సోషల్‌ మీడియాలో అభిమానులు అడుగుతుంటారు. ఈ కామెంట్లు మీకు ఇబ్బంది కలిగిస్తున్నాయా?
- అలాంటిదేం లేదు. నాకో పెళ్లైన స్నేహితురాలు ఉండి, తను ఎదురైతే.. నేను కూడా ఆ ప్రశ్నే వేస్తాను కదా? ఇలాంటి విషయాల్ని వ్యతిరేక దృష్టితో చూడడం నాకిష్టం లేదు.


* అమ్మలు అంతే కదా..
‘‘ఈ సృష్టిలో నిస్వార్థ జీవి అమ్మనే. మా నాన్న డాక్టర్, మా నాన్న ఇంజనీర్‌ అని బయట గొప్పగా చెప్పుకుంటాం. మా అమ్మ హోస్‌ వైఫ్‌ అని చెప్పుకోవడానికి ఎందుకో అంత ఇష్టపడం. కానీ మన కోసం ఏమైనా చేసేది అమ్మే. కానీ తనకు థ్యాంక్స్‌ కూడా మనకు చెప్పాలనిపించదు. ‘అమ్మా.. చిన్నప్పుడు దేని కోసమైనా కలలు కన్నావా? ఏదైనా దక్కకుండా పోయిందా?’ అని అమ్మని అడిగాను. ‘ఏమైంది నీకు..? నువ్వు బాగానే ఉన్నావ్‌ కదా’ అని కంగారు పడింది. ‘నువ్వు హ్యాపీగా ఉంటే.. నాకు అంతే చాలు, ఇంకేం అవసరం లేదు’ అంది అమ్మ. అందరు అమ్మలూ అంతే కదా’’.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.