అప్పటి నుంచి సంపూగా మారిపోయా
వెండితెరపైకి కథానాయకుడు ఎప్పుడు ఎటువైపు నుంచి దూసుకొస్తాడో తెలియదు. సంపూర్ణేష్‌ బాబు కూడా ఎవ్వరూ ఊహించని రీతిలో సామాజిక మాధ్యమాల నుంచి వెండితెరపైకి దూసుకొచ్చాడు. తొలి సినిమాకి ముందే బర్నింగ్‌ స్టార్‌ అనే గుర్తింపుని తెచ్చుకున్నాడు. ‘హృదయకాలేయం’తో కథానాయకుడిగా నవ్వుల్ని పంచిన సంపూ, ప్రస్తుతం ‘కొబ్బరిమట్ట’ చిత్రంతో సందడి చేస్తున్నారు. ఆయన వ్యక్తిగత, సినిమా ప్రయాణం గురించి ‘హాయ్‌’తో చెప్పిన విషయాలివీ...


కథానాయకుడు కావాలని ముందు నుంచీ ఉండేదా?
నటుడిగా ఒక్కసారైనా నన్ను నేను తెరపై చూసుకోవాలనే ఆశ తప్ప మరోటి ఉండేది కాదు. చిన్నప్పట్నుంచి నాటకాలంటే పిచ్చి. హైదరాబాద్‌కి వస్తే తప్పనిసరిగా రవీంద్రభారతికి వెళ్లేవాణ్ని. అక్కడ నాటకాల్ని ఎంతగా ఆస్వాదించేవాణ్నో. ప్రతి నటుడు వందశాతం మనసు పెట్టి నటిస్తుంటే కళ్లార్పకుండా చూసేవాణ్ని. ఆ నాటకాల పిచ్చి క్రమంగా సినిమాల్లో నటించాలనే కోరికని పెంచింది. ‘హృదయకాలేయం’కి ముందే కొన్ని సినిమాల్లో నటించా. వాటిలో నేనున్నాననే విషయం నాకు తప్ప మరొకరికి తెలియదు. ‘మహాత్మ’లో ఆరు సెకన్లపాటు కనిపిస్తా. నేనెంతసేపు తెరపై కనిపిస్తానని లెక్కపెట్టుకొని మరీ సంతోషించిన సినిమా అది.

‘హృదయకాలేయం’ అవకాశం ఎలా వచ్చింది?
ఒక చెత్త హీరో కావాలి, ఎక్కడ దొరుకుతాడా? అని సాయిరాజేష్‌ వెదుకుతున్నారు. అనుకోకుండా ఆయన ప్రసాద్‌ ల్యాబ్‌లో నన్ను చూశారు. విచిత్రమైన స్టైల్‌తో కనిపించిన నన్ను చూసి ఇతనే నేను వెదుకుతున్న హీరో అనుకున్నారట. ఆయనకి నాకూ తెలిసిన మరో స్నేహితుడు నన్ను సాయిరాజేష్‌కి పరిచయం చేశారు. అలా అప్పుడే ‘హృదయకాలేయం’ కోసం నన్ను ఎంపిక చేసుకొన్నారు.

సంపూర్ణేష్‌ బాబు పేరు మీ ఆలోచనేనా?
‘హృదయకాలేయం’ దర్శకుడు, ‘కొబ్బరిమట్ట’ నిర్మాత అయిన సాయిరాజేష్‌ నిర్ణయించిన పేరు అది. నా అసలు పేరు నరసింహాచారి. ‘హృదయకాలేయం’ సినిమా సెట్స్‌పైకి వెళ్లడానికి ముందు పేరులో బాబు వచ్చేలా ఏదో ఒకటి కావాలని చాలా ఆలోచించారు ఆయన. సంపూర్ణేష్‌ బాగుంటుంది, ఇప్పట్నుంచి నీ పేరిదే గుర్తుపెట్టుకో అన్నారు. అప్పట్నుంచి సంపూగా మారిపోయా.

సినిమా పరిశ్రమలోకి రాకముందు ఏం చేసేవాళ్లు?
సిద్దిపేట దగ్గర మిట్టపల్లి మా ఊరు. బంగారు ఆభరణాలు తయారు చేసే కుటుంబం మాది. సిద్దిపేటలో నాకొక వర్క్‌షాప్‌ ఉంది. నేను సినిమా రంగంలోకి రావడంతో 2013 నుంచి మా అన్నయ్య చూసుకొంటున్నాడు ఆ షాప్‌ని. ఆభరణాలు తయారు చేయడంలో నాకు మంచి పేరుంది. ఇప్పటికీ నా కస్టమర్లు కలుస్తూనే ఉంటారు. ఫలానా ఆభరణం నువ్వే తయారు చేసిచ్చావని మా పిల్లలకి చెబుతుంటే... నమ్మడం లేదని అంటుంటారు వాళ్లు. అప్పటి పిల్లలే ఇప్పుడు పెద్దయ్యారు కాబట్టి.. వాళ్లకి నేను సంపూర్ణేష్‌ బాబుగానే తెలుసు. అందుకే వాళ్ల ఒంటిపైన నగల్ని నేను తయారు చేశానంటే తొందరగా నమ్మరు.


చిత్రీకరణలు లేకపోతే మీ రోజువారీ వ్యాపకం ఎలా ఉంటుంది?
ఇప్పటికీ నేను మా సొంతూరు మిట్టపల్లిలోనే ఉంటా. సిద్దిపేటకు ఐదు కిలోమీటర్ల దూరం మా ఊరు. ఏవైనా పనులుంటే సిద్దిపేటకు వెళ్లి వస్తుంటా. ఇక పనులేమీ లేవంటే ఇంట్లోనే కూర్చుని సినిమాల్లోని సంభాషణల్ని రాసుకొని, వాటిని నాదైన శైలిలో ప్రాక్టీస్‌ చేస్తుంటా. ఇంకా సమయముంటే ఊళ్లో స్నేహితుల్ని కలుస్తా.

తొలి పారితోషికం అదే
‘‘నేనందుకొన్న తొలి పారితోషికం అంటే ‘బందిపోటు’ సినిమాకే. అల్లరి నరేష్‌ అన్న పిలిచి రూ.3 లక్షలు చేతిలో పెట్టారు. అంత డబ్బుని అందుకోవడం నా జీవితంలో అదే తొలిసారి. అల్లరి నరేష్‌ అన్న, ఆర్యన్‌ రాజేష్‌ అన్న, వాళ్ల సంస్థకి చెందిన రాయుడుగారు నన్ను చాలా బాగా చూసుకునేవారు. రాజమండ్రిలో చిత్రీకరణ తర్వాత నన్ను విమానంలో హైదరాబాద్‌కి పంపించారు. తొలి విమాన ప్రయాణం అది. ఆ టికెట్టు ఇప్పటికీ భద్రంగా దాచుకొన్నా. గురువుగారు మోహన్‌బాబు సంస్థలో చేసిన ‘సింగం123’ గొప్ప అనుభూతినిచ్చింది. నేను మోహన్‌బాబుకి పెద్ద అభిమానిని. ఆయన్ని కలవడమే పెద్ద విషయం అనుకుంటే, ఆయనతో కలిసి భోజనం చేశా’’.

అలాంటిచోట ఏం చెప్పుకొంటాం?
‘‘కథానాయకుడయ్యాక ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా. నా స్నేహితులు, నా గురించి తెలిసినవాళ్లు తప్ప నా సమస్యని ఎవరూ అర్థం చేసుకోరు. ఏమైనా చెబుదామనుకొనేలోపే ‘కథానాయకుడివి, నీకేంటి?’ అంటారు.

ఏడాదికొకటే డ్రెస్‌...!
‘‘మా నాన్న నా చిన్నప్పుడే చనిపోయారు. అప్పట్నుంచి అంతా అమ్మే మాకు. పేదరికంతో చాలా సమస్యలు ఎదుర్కొన్నాం. ఏడాదికి ఒక డ్రెస్‌ కొనుక్కునేవాణ్ని. ఒక డ్రెస్‌ దండెం మీద ఉంటే, మరొకటి ఒంటిమీద ఉండేది. అమ్మతో పాటు, మా చెల్లెళ్లు బీడీలు చుట్టి ఉపాధి పొందేవారు. మా అన్నయ్య పని చేయడం మొదలుపెట్టాక మాకు సమస్యలు తగ్గాయి. మాలాంటి కుటుంబం నుంచే వచ్చింది నా భార్య ఉమారాణి. మధ్య తరగతి కష్టాలు తెలిసిన అమ్మాయే కాబట్టి తనూ ఇంట్లో పరిస్థితులకి తగ్గట్టుగా నడుచుకొంటుంది. మాకు ఇద్దరు అమ్మాయిలు. ఒకరు 8వ తరగతి మరొకరు 6 చదువుతున్నారు. వాళ్లకి సినిమా రంగం గురించి ఏమీ తెలియదు. స్కూల్లో మా నాన్న నరసింహాచారి అనే చెబుతారు తప్ప సంపూర్ణేష్‌బాబు అని చెప్పరు. మరీ పనిగట్టుకొని అడిగితేనే వాళ్లు ‘సంపూ అమ్మాయిలం’ అని చెబుతారు (నవ్వుతూ).

- నర్సిమ్‌ ఎర్రకోట


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.