పద్నాలుగు చిత్రాలు ఫ్రీగా చేశా!
‘స్నేహగీతం’, ‘ప్రస్థానం’ చిత్రాలతో మంచి నటుడు అనిపించుకున్నాడు సందీప్‌ కిషన్‌. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’తో హిట్‌ హీరోల జాబితాలో చేరిపోయాడు. అటు కమర్షియల్‌ కథానాయకుడిగానూ ఎదుగుతున్న సమయంలో వరుస పరాజయాలు తన కెరీర్‌కి స్పీడ్‌ బ్రేకర్లుగా మారిపోయాయి. రెండేళ్ల నుంచీ సినిమాలకు దూరమయ్యాడు సందీప్‌. ఇప్పుడు ‘నిను వీడని నీడను నేనే’తో ఎలాగైనా హిట్టు కొట్టాలన్న కృత నిశ్చయంతో ఉన్నాడు. ఈ చిత్రానికి నిర్మాత కూడా తనే. శుక్రవారం ఈ చిత్రం విడుదల అవుతోంది. ఈ సందర్భంగా సందీప్‌కిషన్‌ ఏమన్నాడంటే...


* ‘‘హారర్‌ సినిమాలు చూడ్డానికి ఇష్టపడతాను. కానీ నటించాలని ఎప్పుడూ అనుకోలేదు. ఓ నటుడికి హారర్‌ సినిమాలో కొత్తగా చేయడానికి ఏమీ ఉండదని అనుకునేవాడ్ని. కానీ ‘నిను వీడని నీడను నేనే’ కథ నా ఆలోచన మార్చింది. ఇది కేవలం హారర్‌ చిత్రమే కాదు. చాలా రకాల అంశాలున్నాయి. వినోదం ఉంది, సోషియో ఫాంటసీ అంశాలున్నాయి, అన్నింటికంటే మించి ఓ ఎమోషన్‌ ఉంది. ఓ మంచి సినిమా చూశాం అనే తృప్తితో జనాలు థియేటర్‌ నుంచి బయటకు వస్తారు’’.


* నచ్చినట్టు తీసుకోవచ్చని...
‘‘రెండేళ్ల నుంచీ నన్ను నేను వెండి తెరపై చూసుకోలేదు. గత చిత్రాలు సరిగా ఆడలేదు. దాంతో నిరుత్సాహానికి గురయ్యాను. ఇక్కడ ఉంటే అదే ఆలోచనతో ఉంటానేమో అని భయపడి, విదేశాలకు వెళ్లాను. తిరిగొచ్చాక దాదాపు ముఫ్ఫై కథలు విన్నాను. అందులో నాకు బాగా నచ్చిన కథ ఇది. గత పరాజయాలు చాలా పాఠాలు నేర్పాయి. సినిమా జరుగుతుండగానే ‘ఇది ఆడదు’ అనే నిజం తెలిసిపోయేది. నేను ఎక్కడైతే లోపాలు ఉన్నాయనుకున్నానో, చివరికి ఆ లోపాలే జనాలు, సినీ విశ్లేషకులు కూడా చెప్పేవారు. ‘ఇలా చేయండి.. అలా చేయండి’ అంటూ దర్శక నిర్మాతలకు సలహా ఇస్తే.. ‘జోక్యం’ చేసుకుంటున్నానే అపవాదు మోయాల్సివస్తుంది. నా సినిమా నేనే తీసుకుంటే, నాకు నచ్చినట్టు చేసుకోవచ్చన్న ఉద్దేశంతోనే నిర్మాతగానూ మారాను. ఓ రకంగా ఈ సినిమా నా నమ్మకానికి పరీక్షలాంటిది’’.


* ఇంట గెలవాలి

‘‘ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు. కానీ నేను అందుకు రివర్స్‌. తమిళంలో నాకు మంచి సినిమాలు పడ్డాయి. ఒప్పుకోవాలే గానీ, నాలుగైదు తమిళ చిత్రాలు రెడీగా ఉన్నాయి. హిందీలోనూ హిట్టు కొట్టాను. అమేజాన్‌లో ఓ వెబ్‌ సిరీస్‌ కూడా చేశాను. తెలుగులోనే సరైన సినిమా రాలేదు. అందుకే ఇప్పుడు ‘ఇంట గెలిచి తీరాలి’ అనుకుని ఈ సినిమా చేశాను. ప్రచారం కూడా కొత్త తరహాలో చేశాం. ఇప్పుడు ఈ సినిమా హిందీలో చేస్తామంటూ ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ముందుకొచ్చింది. త్వరలో ఆ వివరాలు వెల్లడిస్తాను’’.


* డబ్బులు ఎగ్గొట్టారు..
‘‘నలుగురూ మనల్ని గుర్తించాలనే ఏ నటుడైనా అనుకుంటాడు. ఆ గుర్తింపుని కూడా దక్కించుకున్నాను. ఒంటికి గాయాలైనా లెక్క చేయలేదు. ఇప్పటి వరకూ పద్నాలుగు సినిమాలు ఫ్రీగా చేసుంటాను. నేనేదో త్యాగం చేశానని చెప్పుకోవడం లేదు. ఆ కథలు నచ్చడంతోనే డబ్బులు తీసుకోకుండా నటించాను. ‘సినిమా హిట్టయితే డబ్బులిస్తాం’ అని నిర్మాతలు చెప్పారు. అందులో సగం ఫ్లాప్‌ అయ్యాయి. సగం మంది ఎగ్గొట్టారు. ప్రస్తుతం ‘తెనాలి రామకృష్ణ ఎల్‌.ఎల్‌.బీ’ సినిమా చేస్తున్నా. ప్రేక్షకుల్ని నవ్వించే సినిమా అది. మరో సినిమా కూడా సిద్ధంగా ఉంది. త్వరలోనే ఆ వివరాలు చెబుతా’’.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.