ప్రస్తుతానికి ‘అల్లుడు అదుర్స్‌’పైనే దృష్టిపెట్టా

‘మా సినిమా చిత్రీకరణ సాగుతున్న విధానం కూడా అదుర్సే’ అంటున్నారు సంతోష్‌ శ్రీనివాస్‌. ‘కందిరీగ’, ‘రభస’, ‘హైపర్‌’ సినిమాలతో వినోదాన్ని పంచిన దర్శకుడాయన. ప్రస్తుతం బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ కథానాయకుడిగా ‘అల్లుడు అదుర్స్‌’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. లాక్‌డౌన్‌ తర్వాత పునః ప్రారంభమై, నిరాటంకంగా షూటింగ్‌ జరుపుకొంటున్న చిత్రాల్లో ఇదొకటి. ఈ సందర్భంగా సంతోష్‌ శ్రీనివాస్‌తో ‘ఈనాడు సినిమా’ ప్రత్యేకంగా ముచ్చటించింది.


కరోనా భయాల మధ్య చిత్రీకరణ చేయడం కష్టంగా ఉందా?

చిత్రీకరణ చేయగలమా? లేదా? అనే భయాల మధ్యే సెట్లోకి అడుగుపెట్టాం. ఒకట్రెండు రోజుల్లో అంతా అలవాటైంది. ప్రముఖ నటులు 20 మందిదాకా సెట్‌కి వచ్చారు. కరోనా పరిస్థితుల మధ్య అంతమందితో చిత్రీకరణ అంటే రామోజీ ఫిల్మ్‌సిటీలో చేయడమే సరైన నిర్ణయం అని భావించాం. అక్కడ ఒక పద్ధతి, ప్రణాళిక ఉంటుంది. తీసుకునే జాగ్రత్తలు చాలా బాగుంటాయి. అంత మంది నటులతో పది రోజులపాటు ఫిల్మ్‌సిటీలో నిరాటంకంగా షూటింగ్‌ చేశాం.

చిత్రీకరణలో మునుపటి వేగం ఇప్పుడు ఉండదు కదా?

ఇదివరకటితో పోలిస్తే 20 శాతం పనులు నిదానంగా జరుగుతుంటాయి. సాంకేతిక బృందంలో సభ్యులు పరిమిత సంఖ్యలో ఉంటారు. ఎవరికివాళ్లు సామాజిక దూరం పాటిస్తూ, జాగ్రత్తగా షూటింగ్‌లో పాల్గొనాలి. మొత్తంగా ఇంతకుముందుకీ, ఇప్పటికీ పద్ధతి మారినట్టుగా అనిపిస్తుంది. రోజులు గడుస్తున్నకొద్దీ సెట్లో తీసుకుంటున్న జాగ్రత్తలకీ, చిత్రీకరణ పద్ధతులకీ అలవాటైపోతున్నాం. ఇదివరకు లేని క్రమశిక్షణ ఇప్పుడు సెట్లో కనిపిస్తోంది.



‘అల్లుడు అదుర్స్‌’ అంటున్నారు. ఇది అల్లుడు కథా?

ప్రతి కుటుంబానికీ ఒక అల్లుడు ఉంటాడు. అల్లుడంటే ఎలాగో ప్రతి కుటుంబానికీ అదుర్సే. ఇదొక పూర్తిస్థాయి కుటుంబ వినోదాత్మక చిత్రం. అంతా కలిసి ఆస్వాదించేలా ఉంటుంది హాస్యం. కథానాయకుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ తొలిసారి ఒక పూర్తిస్థాయి ఉల్లాసభరితమైన పాత్రలో కనిపిస్తాడు. పరిశ్రమలోని దాదాపు హాస్యనటులు ఇందులో కనిపిస్తారు. ప్రతి పాత్రా నవ్విస్తుంది.

ఇదివరకటి మీ సినిమాకీ, ఈ సినిమాకీ మధ్య విరామం ఎక్కువగా వచ్చింది. కారణమేమిటి?

మరో హీరోతో సినిమా చేయాలనుకున్నా. అది ఆలస్యమైంది. కొంచెం విరామం వచ్చింది. ఇక నుంచి మాత్రం విరామం లేకుండా సినిమాలు చేస్తా. ఇప్పటికే రెండు మూడు కథలు సిద్ధం చేసుకున్నా. ప్రస్తుతానికి ‘అల్లుడు అదుర్స్‌’పైనే దృష్టిపెట్టా. అందరికీ గుర్తుండిపోయేలా ఈ సినిమా చేస్తా.

* స్క్రిప్ట్‌లోనే ఎడిట్‌

‘‘సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకుడు ఎక్కడో ఒక చోట తనని తాను చూసుకోవాలి. మన ఇళ్లల్లో జరిగే కథ అనుకోవాలి. భావోద్వేగాలు, కామెడీతోపాటు నా మార్క్‌ ఎనర్జీ, యాక్షన్‌ అంశాల్ని జోడించి కుటుంబ కథల్ని తెరకెక్కించడమంటే నాకు ఇష్టం. నా సినిమాల్ని గమనిస్తే అన్నింట్లోనూ వినోదంతోపాటు అంతర్లీనంగా సందేశం ఉంటుంది. కుటుంబ విలువలు కనిపిస్తాయి. నాలో దర్శకుడితోపాటు ఛాయాగ్రాహకుడు కూడా ఉండటం కలిసొచ్చే అంశం. ఆరు నెలల్లో చేయాల్సిన సినిమాని నాలుగు నెలల్లోనే పూర్తి చేస్తా. ప్రతి షాట్‌పైనా ఒక స్పష్టత ఉంటుంది. ఎడిటింగ్‌ రూమ్‌లో కంటే స్క్రిప్ట్‌లోనే సన్నివేశాల్ని ఎడిట్‌ చేసుకుని సెట్‌పైకి వెళుతుంటా’’.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.