సెన్సార్‌ వాళ్లు కొత్త పుస్తకం రాసుకోవాలి!!
‘‘కేవలం శృంగారపరమైన సన్నివేశాల వల్లే సినిమాలు ఆడవు. కథాబలం, పాత్రల మధ్య సంఘర్షణ ఉండాల్సిందే. ‘ఆర్‌ఎక్స్‌ 100’, ‘అర్జున్‌రెడ్డి’ అలాంటి చిత్రాలే’’ అన్నారు జేడీ చక్రవర్తి. నటుడిగా, దర్శకుడిగా జేడీ సుపరిచితుడే. చాలాకాలం తరవాత తెలుగులో ఆయన నటించిన చిత్రం ‘హిప్పీ’. ఈవారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా జేడీ చక్రవర్తి ఆదివారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు.


*
‘‘ఈ మధ్య తెలుగులో నాకు చాలా అవకాశాలొచ్చాయి. ఏ కథా నన్ను ఉత్సాహపరచలేదు. ‘హిప్పీ’ మాత్రం ఆకట్టుకుంది. ముందు నాకు కథ నచ్చాలి. కథ బాగుంటే అన్ని పాత్రలూ బాగుంటాయని నా నమ్మకం. ‘హిప్పీ’లో ప్లేబాయ్‌ తరహా పాత్రలో నటిస్తున్నా. ఓ కంపెనీకి సీఈఓగా కనిపిస్తా. కార్తికేయ చాలా బాగా నటించాడు. దర్శకుడు కృష్ణ ‘హిప్పీ’ని మలిచిన తీరు ఆకట్టుకుంటుంది’’

* ‘‘ఈతరానికి తప్పకుండా నచ్చే చిత్రమిది. ప్రేమకూ, ఆకర్షణకూ తేడా తెలియజెప్పే చిత్రమిది. సెన్సార్‌వాళ్లు ‘ఎ’ సర్టిఫికెట్‌ ఇచ్చారు. కేవలం ఈ సినిమాలో ఉన్న ముద్దులు చూసే ఆ సర్టిఫికెట్‌ ఇచ్చారని నేను అనుకోవడం లేదు. చెప్పాలనుకున్న అంశాన్ని ఎలాంటి మొహమాటం లేకుండా సూటిగా చెప్పారు. అందుకే ‘ఎ’ వచ్చింది. సెన్సార్‌ నిబంధనల గురించి తరచూ చర్చ జరుగుతూనే ఉంది. అధికారులు చట్టంలో ఏముందో అదే చేసుకుంటూ వెళ్తున్నారు. వాళ్ల తప్పేం లేదు. ముందు నిబంధనలు మార్చాలి. సెన్సార్‌వాళ్లు కొత్త పుస్తకం రాసుకుంటే ఈ సమస్యలు తగ్గుతాయి’’.


*
‘‘మా గురువు రాంగోపాల్‌ వర్మ డబ్బులు సంపాదించడం తప్ప అన్నీ నేర్పారు. డబ్బుల కోసం నేను సినిమాలు చేయను. ‘రేపటి షూటింగ్‌ ఎలా ఉండబోతోంది’ అనే ఉత్సాహం రేపిన సినిమాల్లోనే నటిస్తాను. ఏ నటుడికైనా తన సినీ జీవితం మొత్తంలో గొప్పగా చెప్పుకునేందుకు కనీసం అయిదు సినిమాలైనా ఉండాలట. నా కెరీర్‌లో కూడా అలాంటి అయిదు మంచి చిత్రాలున్నాయి. ఆ తృప్తి చాలు’’

* ‘‘టెక్నాలజీకి, టెక్నీక్‌కీ తేడా తెలుసుకోవాలి. సాంకేతికత మారినా కథ చెప్పే విధానంలో ఎలాంటి మార్పూ రాలేదు. హాలీవుడ్‌లో కొన్ని పాత్రల చుట్టూ కథ నడుస్తుంది. కానీ తెలుగులో అలా కాదు. హీరో చుట్టూ కథ తిరుగుతుంది. అందుకే ఇక్కడ గుర్తుండిపోయే పాత్రలు దొరకడం లేదు. తమిళం, కన్నడ భాషల్లో నేను నటిస్తున్న చిత్రాలు విడుదలకు సిద్ధమయ్యాయి. త్వరలోనే వర్మ నిర్మాణంలో నేను కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కనుంది. పూర్తి వివరాలు త్వరలో చెబుతా’’.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.