అలాంటి కథలు చేయడానికి వారికి ధైర్యం లేదు
‘చాలామంది కథానాయికలు సోషల్‌ మీడియా వేదికగా మహిళా సమస్యల గురించి అనర్గళంగా మాట్లాడతారు. కానీ వాటి చుట్టూ అల్లుకున్న ఓ కథలో నటించడానికి మాత్రం ధైర్యం చేయడం లేద’’న్నారు శంకర్‌ భాను. ‘రాజు మహారాజు’, ‘అర్థనారి’ చిత్రాలతో ఆకట్టుకున్న దర్శకుడాయన. ఇప్పుడు ‘ఆర్‌డిఎక్స్‌ లవ్‌’ చిత్రాన్ని రూపొందించారు. ఈనెల 11న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శంకర్‌ భాను మాట్లాడారు.


*
‘‘ఈ కథని ముందు కొంతమంది అగ్ర కథానాయిలకు చెప్పాను. వాళ్లు నటించడానికి ముందుకు రాలేదు. ఆ సమయంలో ‘ఆర్‌.ఎక్స్‌ 100’లో పాయల్‌ని చూసి నా కథానాయికగా ఎంచుకున్నాను. ఇదేం నాయికా ప్రాధాన్యం ఉన్న సినిమా కాదు. కాకపోతే.. కొన్ని సమస్యలపై ఓ అమ్మాయి పోరాడుతుంది. అదే ఈ కథకు బలం’’.

*
‘‘అభివృద్ధికి దూరంగా ఉన్న పల్లెటూర్ల గురించి ఈ సినిమాలో చర్చించాం. ప్రచార చిత్రాల్ని చూసి ‘పెద్దల సినిమానేమో’ అనుకున్నారు. ఆలోచన రేకెత్తించే అంశాలూ ఈ కథలో ఉంటాయి’’.

*
‘‘అర్థనారి కథని కొంతమంది పెద్ద హీరోలకు చెప్పాను. హిజ్రా పాత్రని ఒప్పుకోవడానికి భయపడ్డారు. కొత్తవాళ్లతో తీస్తే.. నంది అవార్డు వచ్చింది. మంచి చిత్రాల్ని ఆదరిస్తే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి. దర్శకుడిగా నా ప్రతిభకు తగినంత గుర్తింపు దొరుకుతుందని భావిస్తున్నా’’.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.