నా అనుభవాలే ‘మా వింత గాథ వినుమా’

‘థియేటర్‌లో సినిమా చూడటం వేరు.. ఓటీటీలో వీక్షించడం వేరు. ఒక్కోటి ఒక్కో అనుభూతి పంచుతుంద’న్నారు యువ కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ. ఇటీవలే ‘కృష్ణ అండ్‌ హిజ్‌ లీల’ చిత్రంతో అందరినీ అలరించిన ఆయన.. ఇప్పుడు ‘మా వింతగాథ వినుమా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఆదిత్య మండల దర్శకుడు. శీరత్‌ కపూర్‌ కథానాయిక. ఇటీవలే ప్రముఖ ఓటీటీ వేదిక ‘ఆహా’ ద్వారా విడుదలైంది. ఈ నేపథ్యంలో మంగళవారం మీడియాతో ముచ్చటించారు సిద్ధు జొన్నలగడ్డ.

* అప్పుడే ఓ ప్రేమకథ చేయాలనుకున్నా..

‘గుంటూరు టాకీస్‌’ వాణిజ్యపరంగా విజయం సాధించినా.. హీరోగా నాకు బ్రేక్‌ ఇవ్వలేదు. ఆ సమయంలోనే ఓ ప్రేమకథ చేయాలని నిర్ణయించుకున్నా. అప్పటికే ప్రవీణ్‌ సత్తారు వద్ద ‘గుంటూరు టాకీస్‌’కు రచనా విభాగంలో పనిచేశా. ఆ అనుభవంతోనే నేను ఇంజినీరింగ్‌లో చదివేటప్పుడు విన్న, చూసిన అనుభవాలతో ఈ చిత్ర కథ రాసుకున్నా.

* ఓ చిన్ని ప్రయత్నమే ఈ చిత్రం..

‘‘ఈ చిత్రంతో నేటితరం యువత ఎలా ఉంది? అనే విషయాన్ని చూపించాలనుకున్నా. అంతేకానీ ఎవరికీ సందేశాలు ఇవ్వలేదు. సోషల్‌ మీడియా ట్రాప్‌లో ఇరుక్కోకూడదని చెప్పే ప్రయత్నమే ఈ చిత్రం. దర్శకుడు ఆదిత్య ఎంతో చక్కగా తెరకెక్కించారు. సీరత్‌తో నేను చేసిన రెండో చిత్రమిది. తను నాకు రెండు, మూడేళ్లుగా తెలుసు. మంచి స్నేహితురాలు. అందుకే మా మధ్య కెమిస్ట్రీ చక్కగా పండింది.

* తొలి ప్రాధాన్యం అదే..

నటుడిగా అన్ని రకాల జోనర్లు చేయాలి అనుకుంటున్నా. నా తొలి ప్రాధాన్యం నటనే. రైటింగ్‌ చేసే ఉద్దేశం లేదు కానీ, అలవాటైంది. ఇప్పట్లో దర్శకత్వం చేసే ఆలోచనలు లేవు. ప్రస్తుతం నరుడి బ్రతుకు నటన’ చిత్రంతో పాటు మరో రెండు సినిమాలు చేస్తున్నా’’.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.