సినీ కవిగా ఉండటమే గొప్ప..
‘‘ఇది వరకు కవులు, సినీ కవులు అని రెండు రకాలుగా చూసేవారు. నేతి బీరకాయలో నెయ్యిలా సినీ కవులకు కవిత్వం రాదు అనుకొనేవారు. కానీ నా దృష్టిలో సినీ కవిగా ఉండటమే గొప్ప. ఎందుకంటే కవి తన అనుభవాల్ని తనకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు, ఏది అనిపిస్తే అది రాస్తుంటాడు. సినీ కవి మాత్రం తనది కాని అనుభవాల్నీ రాస్తుంటాడు. అందుకే సినీ కవి అయినందుకు గర్వపడతాను’’ అన్నారు ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి. కేంద్ర ప్రభుత్వం ఆయనకు ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన గురువారం హైదరాబాద్‌లో పాత్రికేయులతో ఆత్మీయంగా ముచ్చటించారు..


*
ఇది వరకు పురస్కారాల్ని ప్రభుత్వాలు సిఫార్సు చేసేవి. ఇప్పుడు వ్యక్తులు అభ్యర్థిస్తున్నారు. నాకు అది ఇష్టం లేదు. ఈసారి నాకు పద్మశ్రీ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి సిఫార్సు చేసింది. దాంతోపాటు వేలాదిమంది సీతారామశాస్త్రికి ఈ అవార్డు ఎందుకు ఇవ్వాలో తెలుపుతూ కేంద్రానికి తమ అభ్యర్థనను పంపారు. వాళ్లందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్లకి శిరస్సు వంచి పాదాభివందనాలు తెలుపుకుంటున్నాను.

*
సినిమా రంగాన్ని దేవాలయం కంటే ఎక్కువగా ప్రేమిస్తాను. సినిమా పరిశ్రమ అనేది గొప్ప వ్యాపారం. సినిమా తీస్తున్నందుకు నిర్మాతలందరూ గర్వించాలి. ఏ వ్యాపారి అయినా తను తయారుచేసిన వస్తువుకి కొన్ని రెట్ల లాభం ఆశిస్తాడు. కానీ సినిమా నిర్మాత ఆశించడు. ఇంత గౌరవప్రదమైన వ్యాపారం ఏదీ లేదు. అలా అనుకొని నిర్మిస్తేనే మరిన్ని గొప్ప చిత్రాలను తెలుగు పరిశ్రమ అందిస్తుంది.

*
అన్ని కళల కంటే సాహిత్యం గొప్పది. సాహిత్యం కంటే నాటకం గొప్పది. నాటకం కంటే సినిమా గొప్పది. ఏ సినిమా కూడా సమాజాన్ని తప్పుదోవ పట్టించలేదు. ఒక హత్యైనా, అత్యాచారానికి సంబంధించిన సీన్‌ అయినా కారణం లేకుండా చూపించడం లేదు. సినిమాల వల్ల సమాజం చెడిపోతుందంటే నేను ఒప్పుకోను. పాట అనేది జనరంజకంగా ఉంటే సరిపోతుంది. కానీ పాట దాని స్థాయిని దాటి ప్రేక్షకుణ్ని ఆలోచింపజేసేలా ఉండాలి అనుకుంటాను. అప్పుడే ఆ పాటకు సార్థకత లభిస్తుంది. స్త్రీ పాత్రని కించపరిచేలా, యువతరాన్ని కిర్రెక్కించేలా పాటలు రాయమంటే నేను రాయను. వ్యక్తి, ప్రదేశం గురించి వర్ణించమంటే వర్ణించను. పాట అంటే భావోద్వేగభరితంగా ఉండాలి. మానవుడి భావోద్వేగాలను గమనించుకుంటూ నాలో వాటి పట్ల నాకు కలిగిన అనుభూతులను వ్యక్తపరిచే విధానమే పాటగా భావిస్తాను. వాటినే రాస్తాను. పాట అంటే పదాల కూర్పు కాదు. పదాల మధ్య ఉన్న నిశ్శబ్దానికి ఇచ్చే గొంతుకే పాట. పిల్లల్ని నిద్రపుచ్చేది జోల పాట. ఒక వయసు వచ్చాకా యువతను చైతన్య పరచడానికి జ్వాల పాట అవసరం. నాకు నచ్చిన జోల పాటలు... ‘లాలీ జో లాలీ జో ఊరుకో పాపాయి..,’ ‘గుమ్మాడీ గుమ్మాడీ..’.

*
రచయిత అనేవాడు స్పేస్‌ తీసుకోవాలి. పాటలో పదాలు కథకు, సందర్భానికి న్యాయం చేస్తూనే మరో విశిష్ట లక్షణాన్ని సంతరించుకోవాలి. అలాంటి పాటలు రాయడానికే ఇష్టపడతాను. సినిమా, హీరో, దర్శకుడు, గాయకుడు... ఇలా ఎవరితోనూ సంబంధం లేకుండా ఇది నా పాట అని శ్రోత అనుకోవాలి అని నేను రాసిన ‘సిరివెన్నెల తరంగాలు’ పుస్తకంలో నా ముందుమాటగా రాసుకున్నాను. అది తెలియక చాలామంది ఫోన్‌లు చేసి మీరు రాసిన వాక్యాలు బాగున్నాయి... పాట ఏ సినిమాలోనిది అని అడిగారు.

*
పాట అనేది కేవలం వినోదానికో, కాలక్షేపానికో కాదు. మాటల్లో వ్యక్తపరచలేని అవ్యక్తమైన భావాలు ఉంటాయి. వాటిని వ్యక్తపరిచే సంవిధానమే పాట. దీన్నే ఆచరించి పదిహేనేళ్లు నేను చేసిన కృషి ఫలితంగానే చిత్ర రంగంలోకి అడుగుపెట్టాను.


*
చిత్ర పరిశ్రమలో 33 ఏళ్లుగా అందరూ నన్ను అభిమానిస్తున్నారు. నేను అన్నింటికంటే వ్యక్తిత్వానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాను. సిరిసంపదల కంటే మనుషుల హృదయంలో స్థానం సంపాదించడమే గొప్పగా భావిస్తాను.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.