మొత్తం స్క్రిప్ట్‌లో నా డైలాగ్‌లు పది మాత్రమే!!
‘‘తల్లిదండ్రుల నట వారసత్వాన్ని అందిపుచ్చుకోవడమన్నది బాధ్యతను పెంచుతుందే తప్ప.. ఎలాంటి ఒత్తిడిని కలిగించట్లేదు’’ అంటోంది శివాత్మిక. రాజశేఖర్‌ - జీవితల నట వారసురాలిగా ‘దొరసాని’ చిత్రంతో కథానాయికగా తెరకు పరిచయమవుతోంది ఈ చిన్నది. విజయ్‌ దేవరకొండ సోదరుడు ఆనంద్‌ దేవరకొండ కూడా ఈ చిత్రంతోనే తెరంగేట్రం చేయబోతున్నారు. నూతన దర్శకుడు కె.వి.ఆర్‌ మహేంద్ర తెరకెక్కించిన ఈ చిత్రం.. జులై 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించింది శివాత్మిక. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..


*
‘‘1980ల కాలంలో తెలంగాణలోని ఓ ప్రాంతం నేపథ్యంగా సాగే ఓ యధార్థ ప్రేమకథగా దీన్ని రూపొందించారు. నేను ఆ ప్రాంత దొర కూతురు దేవకి (చిన్న దొరసాని)గా కనిపిస్తా. ఇల్లే తన ప్రపంచంగా బతికే ఈ దొరసాని.. రాజు అనే ఓ సామాన్య యువకుడి ప్రేమలో ఎలా పడుతుంది. ఆ తర్వాత వారి ప్రేమకు ఎదురైన అడ్డంకులేంటి? అన్నది మిగతా కథ. ఈ చిత్రాన్ని ప్రారంభించడానికి ముందు నిర్మాత మధుర శ్రీధర్‌ మా ఇంటికి వచ్చారు. ఆయన మాకు మంచి ఫ్యామిలీ ఫ్రెండ్‌. ఆయన అమ్మతో మాట్లాడుతూ ‘మా కొత్త చిత్రం కోసం 18ఏళ్లు వయసున్న తెలుగు తెలిసిన అమ్మాయిని తీసుకోవాలనుకుంటున్నాం. ఓసారి శివాత్మికను కథ విని, ప్రయత్నించమని అడగండి’ అని సలహా ఇచ్చారు. ఆ తర్వాత మహేంద్ర వచ్చి కథ చెప్పారు. వినగానే నాకు చాలా నచ్చింది. తర్వాత ఆడిషన్‌లో పాల్గొని కథానాయికగా ఎంపికయ్యా. అంతేకానీ, ఈ ప్రాజెక్టు ప్లాన్‌ చేసి చేసింది కాదు. నేను హీరోయిన్‌గా మారడం వెనుక నాకు స్ఫూర్తి మా నాన్నే’’.


*
‘‘ఇది చాలా సహజమైన, వాస్తవానికి దగ్గరగా ఉండే ప్రేమకథ. దర్శకుడు తన చిన్నతంలో ఆయన చూసిన అనేక సంఘటనల ఆధారంగా ఈ కథను అద్భుతంగా అల్లుకున్నారు. నా పాత్ర చాలా సౌమ్యంగా ఉంటుంది. మొత్తం స్క్రిప్ట్‌లో నా డైలాగ్‌లు ఓ పదికి మించి ఉండవు. ఎక్కువగా కళ్లతోనే నాలోని భావాలను, భావోద్వేగాలను పలికించా. ఇది చాలా సవాల్‌తో కూడుకున్న పని. అయినా.. దర్శకుడు ప్రతి సన్నివేశంలో నేనేం చేయాలి. నేను ఎలా చూడాలి? ఇలా ప్రతిదాన్ని ఎంతో జాగ్రత్తగా వివరించి చెప్పేవారు. ఆ సలహాల వల్లే నా పాత్రను సులభంగా చేయగలిగా. నా దృష్టిలో మహేంద్రను తెలుగు సంజయ్‌ లీలా భన్సాలీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ చిత్రంతో ఆయన భన్సాలీ అంతటి గొప్ప ప్రతిభను చూపించారు. కథను ఎంత వాస్తవికంగా రాశారో. అంతే నిజాయితీగా తెరపై చూపించారు’’.


*
‘‘ఈ పాత్ర కోసం ఆనాటి తెలంగాణలోని సామాజిక పరిస్థితులు, దొరల జీవితాలు, ఆనాటి గడీలు తదితర విషయాలు చదవి తెలుసుకున్నా. నటిగా నాకు స్ఫూర్తి అమ్మానాన్నలే అయినప్పటికీ నటనలో ఎవరినీ అనుకరించే ప్రయత్నం చేయలేదు. నాలోని వాస్తవ నటినే చూపించే ప్రయత్నం చేశా. కాస్ట్యూమ్స్, పాత్ర గెటప్‌ కోసం అమ్మను అనుసరించా. ప్రత్యేకంగా ఇలాంటి పాత్రలే చేయాలి అని నియమమేమి పెట్టుకోలేదు. మనసుకు నచ్చిన ప్రతి కథను చేయాలనుంది. నా చిన్నతనం అంతా నాన్న సెట్స్‌లోనే గడిచింది. కాబట్టి ఆ వాతావరణం కొత్తగా అనిపించలేదు. కానీ, తొలిసారి కెమెరా ముందు నుంచోడం ఆసక్తికరంగా అనిపించింది. ఎడిటింగ్‌ సమయంలో అమ్మ సినిమా చూసింది. నాన్న ఇంకా మా చిత్ర టీజర్, ట్రైలర్‌ ఏవీ చూడలేదు. నేరుగా థియేటర్లోనే సినిమా చూడాలని నిర్ణయించుకున్నారు’’.


*
‘‘ఆనంద్‌ దేవరకొండతో తెర పంచుకోవడం సంతోషమనిపించింది. ఆడిషన్స్‌కు వెü™్ల ముందు వరకు నాకు.. విజయ్‌ దేవరకొండకు ఆనంద్‌ అనే తమ్ముడు ఉన్నాడన్న విషయం తెలియదు. ఆనంద్‌ది కష్టపడి పనిచేసే వ్యక్తిత్వం. సెట్లోకి వెళ్లిన కొద్దిరోజుల్లోనే ఇద్దరం మంచి స్నేహితులైపోయాం. రాజు పాత్రలో ఉన్న అమాయకత్వం ఆనంద్‌లో సహజంగానే ఉంది. అందుకే ఆ పాత్రలో అతను ఒదిగిపోయాడు. ప్రస్తుతం ఓ నాలుగు కథలు చర్చల దశలో ఉన్నాయి. ప్రస్తుతానికి మాత్రం నా దృష్టి అంతా ‘దొరసాని’పైనే ఉంది. మా కుటుంబమంతా కలిసి ఓ సినిమా చేయాలన్నది ఓ ఐడియా మాత్రమే. ఇంకా కథ ఏమీ అనుకోలేదు. దర్శకత్వం వైపు వెళ్లాలని లేదు. అంత పెద్ద బాధ్యత నేను మోయలేను. ప్రొడక్షన్‌ వ్యవహారాలపై ఆసక్తి ఉంది’’.

- మందలపర్తి రాజేశ్‌ శర్మ, ఈనాడు డిజిటల్‌


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.