ప్రేక్షకుల అరుపుల మధ్య కూర్చొని చూస్తేనే కిక్కు

‘‘సినిమా తర్వాత సినిమా చేసేయాలని నేనెప్పుడూ తొందర పడను. నా నిర్మాణం నుంచి ఏ చిత్రం వచ్చినా అది ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా గుర్తుండిపోవాలని తాపత్రయ పడుతుంటా’’ అన్నారు ఎస్‌కెఎన్‌(జి.శ్రీనివాసకుమార్‌). ‘ఈ రోజుల్లో’, ‘టాక్సీవాలా’ వంటి వైవిధ్యభరిత చిత్రాలు నిర్మించి పేరు తెచ్చుకున్నారు ఎస్‌కెఎన్‌. మంగళవారం ఆయన పుట్టినరోజు. ఈ నేపథ్యంలో సోమవారం మీడియాతో ముచ్చటించారు.


‘‘నేను జర్నలిస్ట్‌గా ఉన్నప్పుడు ఎలాంటి చిత్రాలు తీయాలి అని కలలు కనేవాడినో.. నిర్మాతగా మారాక అవన్నీ ఒకొక్కటిగా నెరవేర్చుకుంటున్నా. అందుకే నిర్మాతగా నా ప్రయాణం సంతృప్తికరంగా ఉంది. ‘టాక్సీవాలా’ చక్కటి విజయాన్ని అందుకోవడం సంతోషాన్నిచ్చింది. దాని తర్వాత ‘ప్రతిరోజూ పండగే’ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించాను. అదీ మంచి ఫలితాన్నివ్వడం మరింత ఉత్సాహాన్నిచ్చింది. నా సినీ ప్రయాణమంతా ఎక్కువగా బన్ని వాసు, మారుతిలతోనే ఉంటుంది. వాళ్లే చిత్రాలు చేసినా నా భాగస్వామ్యం ఉంటుంది. ‘టాక్సీవాలా’ విడుదలయ్యే నాటికే మారుతి ‘ప్రతిరోజు పండగే’ చిత్రం అనుకున్నారు. దీంతో ఆ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించా. అందుకే నా నిర్మాణం నుంచి మరో చిత్రం రావడానికి కాస్త ఆలస్యమైంది. ఇకపై ఏడాదికి రెండు చిత్రాలైనా కచ్చితంగా వస్తాయి’’. ‘టాక్సీవాలా’ తర్వాత దర్శకుడు రాహుల్‌ సంకృత్యాన్‌తోనే మరో సినిమా చేయాలనుకున్నాం. ఈలోపు రాహుల్‌కు నాని డేట్స్‌ దొరకడంతో ఆ సినిమా పూర్తయ్యాకే మా కలయికలో రెండో చిత్రాన్ని పట్టాలెక్కించాలని అనుకున్నాం. ఓ పెద్ద హీరోతోనే ఆ సినిమా ఉండబోతుంది. ప్రస్తుతం వీలైనంత తక్కువ మందితో, తక్కువ లొకేషన్లలో చిత్రీకరించేలా కథల్ని సిద్ధం చేసుకుంటున్నాం.

‘‘కొబ్బరిమట్ట’ నిర్మాత సాయి కార్తిక్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ సినిమా చేయబోతున్నా. ఓ విభిన్న కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాం. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోంది. దీంతో పాటు మారుతి దర్శకత్వంలో రానున్న కొత్త చిత్రానికీ సహ నిర్మాతగా ఉన్నా. ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతోంది. ఓ అగ్ర హీరోతోనే ఈ సినిమా ఉంటుంది. అల్లు శిరీష్‌ కథానాయకుడిగా పట్టాలెక్కనున్న కొత్త చిత్రానికీ సహ నిర్మాతగా వ్యవహరించ బోతున్నా. దీనిపైనా త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. అలాగే మారుతి స్క్రిప్ట్‌తో ఆయన దర్శకత్వ పర్యవేక్షణలో ఓ ప్రముఖ ఓటీటీ ఛానెల్‌ కోసం వెబ్‌సిరీస్‌ రూపొందించబోతున్నాం. మ్యాగీ అనే కొత్త దర్శకుడు దీన్ని తెరకెక్కించనున్నారు’’.

బోల్డ్‌గా లేకున్నా..

‘‘ఇప్పుడు ఓటీటీ కంటెంట్‌ అంటేనే బోల్డ్‌ కథాంశాలు, సంభాషణలతో ఎక్కువగా ఉంటున్నాయి. నిజానికి అలాంటి లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించేలా కథలు తయారు చేసుకోవచ్చు. ‘అర్జున్‌రెడ్డి’ లాంటి చిత్రాలు అలా బోల్డ్‌గా తీసినా తప్పుండదు. కథలో ఇంటెన్సిటీ అలాంటిది. కానీ, అవసరమున్నా లేకున్నా ప్రతిసారీ అదే ప్రయత్నం చేస్తే వర్కవుటవ్వదు. దీని వల్ల ఓటీటీలకు కుటుంబ ప్రేక్షకులకు దూరం అవుతారు. ప్రస్తుతమున్న ఫిల్మ్‌ మేకర్స్‌ వీటిని దృష్టిలో పెట్టుకొని కథల్ని సిద్ధం చేసుకుంటే.. ఓటీటీ కంటెంట్‌కీ¨ అన్ని వర్గాల్లో ఆదరణ పెరుగుతుంది.

సినిమా ఎవర్‌గ్రీన్‌..

‘‘అప్పట్లో కేబుల్‌ టీవీలు, వీసీఆర్‌లు వచ్చాక.. ‘చక్కగా ఇంట్లోనే కూర్చోని సినిమాలు చూసే అవకాశం దొరికింది. ఇక థియేటర్లకు ఎవరు పోతారు?’ అనుకున్నారు. తర్వాత డీవీడీలు వచ్చాయి. అప్పుడూ ఇదే మాట అన్నారు. కానీ, ఏమైంది? ఇప్పుడలాగే ఓటీటీ వచ్చింది. నిజానికి టెక్నాలజీ ఎంత పెరిగినా.. దానికి కావాల్సిందీ సినిమానే. దాన్ని చూపించే రూపంలో కొన్ని మార్పులుండొచ్చు అంతే. అందుకే సినిమా ఎప్పటికీ ఎవర్‌గ్రీనే. ‘బాహుబలి’, ‘అల.. వైకుంఠపురం’ లాంటి చిత్రాలను ఎవరైనా వెండితెరపై చూసి ఆస్వాదించాలనే అనుకుంటారు. చిరంజీవి, పవన్‌కల్యాణ్‌ వంటి అగ్ర కథానాయకుల చిత్రాలను వెండితెరపై ప్రేక్షకుల అరుపుల మధ్య కూర్చొని చూస్తేనే కిక్కు. ఇంత ఉత్సాహం ఓటీటీ వేదికలపై దొరకదు.

తెలుగు సినిమా గొప్పది

‘‘మలయాళ చిత్రాలు బాగుంటున్నాయి, తెలుగు సినిమాలు ఒకరకంగా ఉంటున్నాయి అని ఈ మధ్య ఎక్కడో ఓ వార్త చదివా. వాస్తవమేంటంటే.. మలయాళం, మరే ఇతర భాషా చిత్రాలైనా మనం ఎప్పుడో ఒకసారి చూస్తుంటాం. ఇవన్నీ మనం అప్పుడప్పుడూ వెళ్లి రుచి చూసే చైనీస్, ఇటాలియన్‌ రెస్టారెంట్ల లాంటివి. వీటిని అప్పుడప్పుడూ టేస్ట్‌ చేస్తేనే బాగుంటుంది. కానీ, మన తెలుగు సినిమాలు అలా కాదు. ఇది సొంతింటి వంట. మనకేలాంటివి నచ్చుతాయి, ఎలాంటి మసాలాలు ఉంటే ఇష్ట పడతామన్నది మన వాళ్లకి బాగా తెలుసు. భారతీయ చిత్రసీమలో టాప్‌గా నిలిచిన ‘బాహుబలి’ మన తెలుగు దర్శకుడు తీసిన చిత్రం. పరభాషా చిత్రాలేవో రెండు మూడు బాగున్నాయి కదా అని.. మన తెలుగు సినిమాను తక్కువగా చూడటం, తక్కువ చేసేలా మాట్లాడటం సరికాదని భావిస్తున్నా.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.