ప్రేమలేఖ తెచ్చిన మార్పే.. ‘ఇట్లు అంజలి’

‘‘రంగస్థలం’లో రామ్‌చరణ్‌ చేసిన చిట్టిబాబు లాంటి వాస్తవికత ఉట్టిపడే పాత్రల్లో నటించాలనుంద’’న్నారు శ్రీ కార్తికేయ. బాల నటుడిగా ‘ఆ నలుగురు’ చిత్రంలో అప్పడాలమ్మే అబ్బాయి పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కార్తికేయ. ఇప్పుడు ‘ఇట్లు అంజలీ’ అనే సినిమాతో తొలిసారి కథానాయకుడిగా వెండితెరపై మెరవబోతున్నాడు. నవీన్‌ మన్నెల స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రమిది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో గురువారం హైదరాబాద్‌లో ‘సితార.నెట్‌’తో ముచ్చటించారు చిత్ర కథానాయకుడు.


*
‘‘ఈ సినిమాలో నేను వినయ్‌ అనే సాఫ్‌్్టవేర్‌ ఇంజినీర్‌గా కనిపిస్తా. పక్కింటి కుర్రాడిలా చాలా సాఫ్ట్‌గా సాగిపోయే పాత్ర నాది. హిమాన్షి, సుభాంగి పంత్‌ కథానాయికలుగా కనిపిస్తారు. థ్రిల్లర్‌ అంశాలతో మేళవించిన ఓ స్వచ్ఛమైన ప్రేమకథతో చిత్రాన్ని రూపొందించారు. ఓ ప్రేమలేఖ చుట్టూ అల్లుకున్న కథ కావడంతో.. దీనికి తగ్గట్లుగానే టైటిల్‌ను ఖరారు చేశాం. ఒకమ్మాయి నిజాయితీగా ఓ అబ్బాయిని ప్రేమిస్తే ఎలా ఉంటుంది అనేది ఈ సినిమా ద్వారా చూపించబోతున్నాం. ‘ఇట్లు అంజలి’ అంటూ ఓ యువతి రాసే ప్రేమ లేఖ.. కథానాయకుడి జీవితాన్ని ఎలా మార్చింది? దాని ప్రభావంతో కథానాయిక జీవితంలో సంభవించిన మార్పులేంటి? వంటి ఆసక్తికర అంశాలతో కథనం సాగుతుంది. ప్రతి ప్రేక్షకుడూ సినిమాలో తమని తాము చూసుకుంటారు’’.

*
‘‘బాల నటుడిగా దాదాపు 40కి పైగా చిత్రాల్లో నటించా. బాలకృష్ణ ‘అధినాయకుడు’, రాజేంద్రప్రసాద్‌తో చేసిన ‘ఆ నలుగురు’, రాజశేఖర్‌ ‘గోరింటాకు’ వంటి చిత్రాలు బాల నటుడిగా నాకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. వీటికన్నా ముందు బాపుగారి దర్శకత్వంలో వచ్చిన ‘శ్రీ వెంకటేశర్వర వైభోగం’ అనే ధారావాహికలో నటించా. రాఘవేంద్రరావుగారి దర్శకత్వంలో చేసిన ‘ఈ నిజం - అబద్ధమైతే’ టెలీఫిలింతో బాల నటుడిగా నంది అవార్డును అందుకున్నా. ప్రస్తుతం రెండు చిత్రాల్లో నటిస్తున్నా. వి. సముద్రతో చేస్తున్న సినిమా త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుండగా.. రాఘవేంద్రరావు శిష్యుడు రాము దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నా. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం’’ అన్నారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.