ప్రతినాయక పాత్ర.. రాత్రిళ్లు చిత్రీకరణ
‘‘నిర్మాతగా వ్యవహరించడం కంటే.. దర్శకత్వం చేయడంలోనే ఎక్కువ కష్టముంది. 24 విభాగాల గురించి అవగాహన ఉండాలి. ప్రతిరోజు హార్డ్‌ వర్క్‌ చేయాలి’’ అంటున్నారు కృష్ణ విజయ్‌.ఎల్‌. ‘అసుర’ చిత్రంతో దర్శకుడిగా తెరకు పరిచయమైన విజయ్‌.. ‘అప్పట్లో ఒకడుండేవాడు’, ‘నీదీ నాదీ ఒకే కథ’ చిత్రాలతో మంచి అభిరుచి గల నిర్మాతగానూ సత్తా చాటారు. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘తిప్పరా మీసం’. శ్రీవిష్ణు - నిక్కీ తంబోలి జంటగా నటించారు. నవంబరు 8న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా మంగళవారం విలేకర్లతో మాట్లాడారు కృష్ణ విజయ్‌.


*
‘‘ఈ చిత్రాన్ని ఓ సరికొత్త యాక్షన్‌ డ్రామా కథాంశంతో రూపొందించాం. క్రికెట్‌లో పాకిస్థాన్‌పై భారత్‌ గెలిచినప్పుడు, సరిహద్దులో శత్రువులపై విజయం సాధించినప్పుడు ప్రతిఒక్కరం గర్వంగా ఫీలవుతాం. అలాగే ఓ ఇంట్లోని కుర్రాడు తమ కుటుంబ సభ్యులు గర్వంతో ‘తిప్పరా మీసం’ అనేలా ఓ పని చేస్తాడు. అదేంటి అన్నదే ఈ చిత్ర కథ. టైటిల్‌ కాస్త యాక్షన్‌ కోణంలో ఉన్నప్పటికీ తల్లి - బిడ్డల సెంటిమెంట్‌ ప్రధానంగా కథ నడుస్తుంటుంది. ఓ బిడ్డ తన తల్లి గర్వపడేలా ఏం చేస్తాడో ఇందులో చూడొచ్చు’’.

*
‘‘ఇందులో ఓ చక్కటి ప్రేమ కథ కూడా ఉంది. మౌనిక అనే పాత్రలో నిక్కీ తంబోలి కనిపించనుండగా.. డీజే మణిగా శ్రీ విష్ణు దర్శనమిస్తారు. తెరపై వీళ్లిద్దరి కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. విష్ణు క్లబ్‌లలో డీజేగా చేస్తుంటాడు కాబట్టి తన జీవితం కాస్త విభిన్నంగా ఉంటుంది. అందరి జీవితాలు పగలు మొదలైతే ఆయన జీవితం మాత్రం రాత్రిళ్లు సాగుతుంది. అందుకే చిత్రీకరణ కూడా 50శాతం రాత్రి సమయాల్లోనే జరిపాం. శ్రీవిష్ణు పాత్రలో కాస్త ప్రతినాయక ఛాయలుంటాయి. ఆయన 4ఏళ్ల ప్రయాణంగా ఈ కథ సాగుతుంది. చిత్ర ముగింపుకొచ్చే సరికి ఆ పాత్ర మంచిగా మారుతుంది. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న అనేక సంఘటనల నుంచి ప్రేరణగా ఈ కథ రాసుకున్నా. సురేష్‌ బొబ్బిలి అందించిన స్వరాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి’’.


*
‘‘శ్రీవిష్ణుతో పనిచేయడం సౌకర్యంగా ఉంటుంది. ఆయన నా ‘అసుర’ చిత్రంలో ఓ పాటలో నటించారు. అప్పటి నుంచే మా ఇద్దరికి మంచి స్నేహ బంధం ఏర్పడింది. తర్వాత ఆయన సినిమాలకు నిర్మాతగా వ్యవహరించా. అందుకే నా దర్శకత్వంలో మరో చిత్రం రావడానికి ఇంత సమయం పట్టింది. ప్రస్తుతం నిర్మాతగా రెండు చిత్రాలు చేస్తున్నా. ఒకదాంట్లో విష్ణునే హీరో. నా దర్శకత్వంలో నారా రోహిత్‌తో ఓ సినిమా చేయబోతున్నా. దానికి కొంత సమయం పడుతుంది. నాకు డ్రామా అంటే ఇష్టం. కానీ, తొలి చిత్రం క్రైమ్‌ థ్రిల్లర్‌ చేశా. ఇప్పుడు యాక్షన్‌తో వస్తున్నా. దర్శకత్వంలో కె.విశ్వనాథ్‌ సర్‌ స్ఫూర్తి. దర్శకత్వం కన్నా నిర్మాతగా చేయడం సౌకర్యంగా ఉంది. ఇక్కడ ఎంత లాభం వస్తుంది? ఎంత పోతుంది? అన్నది ముందుగానే ఓ అంచనాలకు వచ్చేయ్యొచ్చు. కాబట్టి ఇది కష్టం కాదు’’.మందలపర్తి రాజేశ్‌ శర్మ, ఈనాడు డిజిటల్‌


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.