వినోదం ఉంటేనే ఆదిరిస్తారు

‘‘కథలో ఏం చెప్పినా, ఏం చూపినా వినోదంగా ఉంటేనే ప్రేక్షకులకి నచ్చుతుంది. అదే విజయాన్ని తీసుకొస్తుంది. ఈ సూత్రాన్ని నమ్మి ‘వేర్‌ ఈజ్‌ వెంకటలక్ష్మీ’ చిత్రాన్ని నిర్మించా’’ అన్నారు ఎం.శ్రీధర్‌ రెడ్డి. రాయ్‌లక్ష్మి ప్రధానపాత్రధారిగా నటించిన చిత్రమిది. కిషోర్‌కుమార్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రామ్‌కార్తీక్‌, పూజిత పొన్నాడ, ప్రవీణ్‌, మధునందన్‌ కీలక పాత్రధారులు. ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో శ్రీధర్‌రెడ్డి విలేకర్లతో మాట్లాడారు. ‘‘నాది అనంతపురం. సినిమాలంటే పిచ్చి. ఇంజినీరింగ్‌ చేశాక సినీ పరిశ్రమపై దృష్టిపెట్టా. నిర్మాత దిల్‌రాజు స్ఫూర్తితోనే ఈ రంగంలోకి వచ్చా. కొన్నాళ్లు సినిమాలపై పరిశోధన చేశాను. ఒకొక్క విభాగంపై అవగాహన ఏర్పరచుకున్నాను. ఈ ప్రయాణంలో పూరిజగన్నాథ్‌ వద్ద పనిచేస్తోన్న కిరణ్‌ చెప్పిన కథ నచ్చింది. కిషోర్‌కుమార్‌ దర్శకత్వంలో రూపొందిద్దామని సలహా ఇచ్చాడు. రాయ్‌లక్ష్మి అందంగా కనిపిస్తూనే పాత్రకు తగ్గ అభినయాన్ని ప్రదర్శించింది. తనే ఈ సినిమాకి మూలం. హాస్యనటులు ప్రవీణ్‌, మధునందన్‌లు పంచే నవ్వులు మరో సానుకూలాంశం. ఈ సినిమా తర్వాత నిర్మాతగా కొనసాగుతాను’’ అన్నారు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.