కామెడీతో పాటు మంచి కథ కూడా ఉండాలి!
‘విజయం తర్వాత కచ్చితంగా అంచనాలు పెరుగుతాయి. చూసే ప్రేక్షకులు కూడా పెరుగుతారు కాబట్టి మరింత బాధ్యతతో పనిచేయాలి. ప్రేక్షకులు నా నుంచి విభిన్నమైన సినిమాలే ఆశిస్తారు కాబట్టి... వాటితోనే నా ప్రయాణం’’ అన్నారు శ్రీవిష్ణు. ‘బ్రోచేవారెవరురా’తో మంచి విజయాన్ని సొంతం చేసుకొన్న ఆయన ఇటీవల ‘తిప్పరామీసం’ చేశారు. కృష్ణవిజయ్‌ దర్శకత్వం వహించిన ఆ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా శ్రీవిష్ణు బుధవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ...


* ‘తిప్పరామీసం’ అంటున్నారు. మాస్‌ ప్రేక్షకుల్ని మెప్పించడానికేనా?
- మాస్‌ కథే ఇది. ఎవరినీ లెక్క చేయని మనస్తత్వమున్న ఓ కుర్రాడిగా కనిపిస్తా. రఫ్‌గా కనిపించేందుకు బరువు కూడా పెరిగా. రాత్రి వేళల్లో పనిచేసే డీజే పాత్ర.

* శక్తివంతమైన పేరు పెట్టారు. ఆ పేరుకీ, కథకీ సంబంధమేమిటి?
- మీసం అంటే బాధ్యత అని చెప్పాం. ఇందులో కథానాయకుడు ఎప్పుడు మీసం తిప్పాడు? అతను ఎలాంటి బాధ్యతల్ని నిర్వర్తించడానేది తెరపైనే చూడాలి. వ్యతిరేక ఛాయలతో కూడిన పాత్రలో కనిపిస్తా. తల్లికొడుకు నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.

* ‘బ్రోచేవారెవరురా’తో కామెడీ కూడా పంచారు. సినిమాలో కామెడీ ఉంటేనే ఎక్కువమందికి చేరువవుతుందనే అభిప్రాయాలు వినిపిస్తుంటాయి. మీరేమంటారు?
- ముందే అలా హద్దులు గీసుకోవడం సరైంది కాదు. కథ లేకపోతే కామెడీ ఎంతున్నా ప్రేక్షకుడు అనుభూతి చెందలేడు. అదే కథ కూడా ఉందంటే... మంచి సినిమా అని నలుగురికి చెబుతాడు. ఇందులో యాక్షన్‌ డ్రామా చాలా కొత్తగా ఉంటుంది. ఈ సినిమా తర్వాత దర్శకుడు కృష్ణవిజయ్‌ మీద ప్రేక్షకుల్లో అంచనాలు పెరుగుతాయి.

* కాన్సెప్ట్‌ చిత్రాలు కొద్దిమంది ప్రేక్షకులకే పరిమితం అవుతుంటాయి. కారణమేమిటంటారు?
- క్లాస్‌ సినిమా అని ఒక ముద్ర వేసేస్తున్నారు. మాస్‌ ప్రేక్షకుల వరకు వెళ్లాలంటే వాళ్లు కోరుకునే అంశాలు ఉండాలి. ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని చేసిన సినిమానే ఇది.

* విజయాలు అందుకుంటున్నారు కదా. పారితోషికం పెంచారా?
- ‘బ్రోచేవారెవరురా’ కంటే ముందే మూడు సినిమాలు ఒప్పుకున్నా. విజయం వచ్చిందని వాటికి పారితోషికం పెంచడం సరైంది కాదు కదా. వాటి తర్వాత నిజంగా నాకు డబ్బులివ్వొచ్చు అనుకుంటే ఇస్తారు.

* నారా రోహిత్‌తో కలిసి మళ్లీ ఎప్పుడు చేయబోతున్నారు?
- కథ సిద్ధమవుతోంది. చారిత్రాత్మక కథ అది. వచ్చే యేడాది సెట్స్‌పైకి వెళుతుంది. ముగ్గురు కొత్త దర్శకులతో వరుసగా మూడు సినిమాలు చేయబోతున్నా.

                                     


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.