ఇతిహాసాలు తరచి చూస్తే కథలు దొరుకుతాయి
‘ఒక సెల్‌ఫోన్‌లో రెండు సిమ్‌ కార్డులు ఉన్నట్టే, ఒక వ్యక్తికి రెండు మెదళ్లు ఉంటే ఎలా ఉంటుందన్న ఆలోచన నుంచి ‘బుర్ర కథ’ పుట్టింద’’న్నారు డైమండ్‌ రత్నబాబు. పలు చిత్రాలకు రచయితగా పనిచేసి, ‘బుర్రకథ’తో దర్శకుడిగా అవతారం ఎత్తారు. ఆది సాయికుమార్‌ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో డైమండ్‌ రత్నబాబు విలేకరులతో మాట్లాడారు.


‘‘రెండు మెదళ్లతో పుట్టిన వాళ్ల గురించి ఇంటర్నెట్‌లో అన్వేషించాను. ప్రపంచంలో అలాంటి వాళ్లు దాదాపుగా పదహారు మంది ఉన్నార్ట. వాళ్లంతా ఇప్పుడు బతికిలేరు. ఎవరైనా బతికుంటే ఎలా ఉంటుందన్న ఊహకు తెర రూపమే ‘బుర్ర కథ’. ఓ ఇంట్లో ఇద్దరు అబ్బాయిలుంటే ఒకరు క్లాస్‌, మరొకరు మాస్‌గా మారిపోతారు. కానీ ఆ రెండు లక్షణాలూ అభిరామ్‌లో ఉంటాయి’’.

* ‘‘రాజేంద్రప్రసాద్‌, ఆది తండ్రీకొడుకుల్లా నటించారు. వాళ్ల పాత్రలు సహజంగా ఉంటాయి. ఇలాంటి కథలు అర్థమయ్యేలా చెప్పాలి. ఆ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. విశ్రాంతి, పతాక సన్నివేశాల్లో వచ్చే మలుపులు ఎవరూ ఊహించలేరు’’.

* ‘‘చిన్నప్పటి నుంచి కవితలు రాసే అలవాటు ఉంది. ‘డైమండ్‌’ అనే కలం పేరుతో రాసేవాణ్ని. ‘పిల్లా నువ్వు లేని జీవితం’, ‘పాండవులు పాండవులు తుమ్మెద’, ‘ఆడోరకం ఈడోరకం’, ‘గాయత్రి’ చిత్రాలకు సహాయకుడిగా పనిచేశాను. హాలీవుడ్‌ సినిమాలు చూసి కథలు తయారు చేసుకోవడం నాకు నచ్చదు. హాలీవుడ్‌ సినిమాల స్ఫూర్తితో కథలు రాసుకోకూడదని నా కలంపై ఒట్టు వేసుకున్నా. రామాయణ మహాభారతాలు తరచి చూస్తే చాలు. చాలా కథలు దొరుకుతాయి’’.

* ‘‘దర్శకుడిగా నాకు దాసరి నారాయణరావు ఆదర్శం. ఆయన దర్శకులకు గౌరవం తెచ్చారు. రచయిత దర్శకుడైతే కొన్ని సౌలభ్యాలు ఉంటాయి. రచయిత, దర్శకుడు.. రెండు విభాగాల్లోనూ కొనసాగుతాను. ఇప్పటికే అయిదుగురు నిర్మాతలకు కథలు చెప్పాను. అందులో ఓ చిత్రానికి దర్శకత్వం వహిస్తాను. నాలుగు చిత్రాలకు కథారచయితగా పనిచేస్తా’’.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.